మోహన్‌బాబు వల్ల 'స్వర్గం నరకం'లో ఎస్వీఆర్ ట్రావెల్స్ యజమానికి హీరో చాన్స్ మిస్!
on Aug 15, 2021
అందరూ కొత్తవాళ్లతో దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన సినిమా 'స్వర్గం నరకం' (1975). ఈ సినిమా ద్వారా మోహన్‌బాబు, ఈశ్వరరావు హీరోలుగా, అన్నపూర్ణ, జయలక్ష్మి హీరోయిన్లుగా పరిచయమయ్యారు. గమనించాల్సిన విషయమేమంటే మోహన్‌బాబు అసలుపేరు భక్తవత్సలం, ఈశ్వరరావు అసలు పేరు విశ్వేశ్వరరావు. వారి అసలు పేర్లను ఈ సినిమాతో మార్చేశారు దాసరి. మొదట నాటకాల్లో నటించే ఈశ్వరరావును ఒక హీరోగా ఎంపికచేసిన దాసరి, మరో హీరోగా అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మోహన్‌బాబును ఎంపిక చేశారు.
అయితే 'స్వర్గం నరకం' సినిమాని పంపిణీ చేస్తున్న లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్లు బోసుబాబు అనే యువకుడ్ని పంపించి, అతనికి హీరోగా చాన్స్ ఇవ్వాల్సిందేనని ఈ చిత్రానికి నిర్మాణ సారథిగా వ్యవహరించిన దిడ్ది శ్రీహరిరావు మీద ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిందే వేదం. దాంతో దాసరికి శ్రీహరిరావు విషయం చెప్పి, బోసుబాబుకు హీరోగా చాన్స్ ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పెడతారేమోనని అన్నారు. దాంతో అప్పటికే తను ఎంపిక చేసిన భక్తవత్సలం (మోహన్‌బాబు)ను తీసుకోవాలా, బోసుబాబును తీసుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు దాసరి.
ఈ వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన దాసరి శిష్యుడు, ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవిరాజా పినిశెట్టి తన గురువుకు ఒక సూచన చేశారు. "భక్తవత్సలం, బోసుబాబును షూటింగ్ లొకేషన్ అయిన విజయవాడకు తీసుకువెళ్లి, ఇద్దరిపై ఒకే సీన్‌ను తీద్దాం. ఇద్దరిలో ఎవరు బాగా చేస్తే వాళ్లను హీరోగా తీసుకోండి. దానివల్ల రికమండేషన్స్‌కు తావు లేకుండా టాలెంట్‌కు మాత్రమే విలువ ఇచ్చినట్లవుతుంది." అని ఆయన చెప్పారు. రవిరాజా మాట దాసరికి నచ్చింది.
విజయవాడలో షూటింగ్ ప్రారంభించి భక్తవత్సలం, బోసుబాబు మీద ఒకే సీన్ చిత్రీకరించారు దాసరి. షూట్ చేసిన ఫిల్మ్‌ను అప్పటికప్పుడు మద్రాసుకు పంపించి, డెవలప్ చేయించారు. మర్నాడు దాన్ని విజయవాడకు రప్పించి, ఒక థియేటర్‌లో వేసుకొని చూశారు. అందరికీ భక్తవత్సలం పర్ఫార్మెన్స్ నచ్చింది. అతనినే హీరోగా తీసుకున్నారు దాసరి. అలా ఆయన 'స్వర్గం నరకం' ద్వారా హీరోగా మోహన్‌బాబు తెరపై ఎంట్రీ ఇస్తే, ఆ సినిమాలో హీరో అయ్యే చాన్స్‌ను మిస్ చేసుకున్నాడు బోసుబాబు. ఆ బోసుబాబు మరెవరో కాదు, తదనంతర కాలంలో 'బోస్ ఈజ్ బాస్' అంటూ ఎస్వీఆర్ ట్రావెల్స్‌ను దిగ్విజయంగా నడుపుతున్న ఆయనే. సినిమా నటుడు కావాలనుకున్న బోసుబాబు చివరకు వ్యాపార రంగంలో స్థిరపడి బాగా సంపాదించారు.
Also Read