తెలుగు పాట ఉన్నంత వరకు నిత్య స్మరణీయుడు వేటూరి సుందరరామ్మూర్తి!
on Jan 29, 2024

సినీ సాహిత్య రంగంలో వేటూరి సుందరరామ్మూర్తిది ఒక శకం. 70వ దశకం నుంచి సినిమా పాటను పలురకాలుగా పరవళ్ళు తొక్కించిన ఘనత వేటూరిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు.. ఒకవైపు సాహిత్య విలువలున్న సంప్రదాయమైన పాటలు అందిస్తూనే మరో వైపు మసాలాలు దట్టించిన మాస్ పాటలతో విజిల్స్, స్టెప్పులు వేయించారు. జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ రంగ ప్రవేశం గురించి, రాసిన వేల పాటల్లోని కొన్ని మచ్చుతునకల గురించి మెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక దశలో ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా..’ అనీ, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ అనీ, ‘ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా’, ‘ఆకుచాటు పిందె తడిసే.. కోకమాటు పిల్ల తడిసె’ అంటూ ఆయన కలం నుంచి హుషారెక్కించే పాటలు వచ్చాయి. ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము..’, ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’, ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ ‘రాగాల పల్లకిలో కోయిలమ్మా..’, ‘మానసవీణా మధుగీతం.. మన సంసారం సంగీతం..’ అంటూ మనసును హత్తుకునే మధురగీతాలు మనల్ని పలకరించాయి. ‘ఈ దురోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..’, ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులౌతారు..’, ‘రా.. దిగిరా దివి నుంచి భువికి దిగిరా..’ అంటూ ఆలోచన రేకెత్తించే పాటలు, ఆవేశభరితమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. వేటూరి వారు రాసిన వేల పాటల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. ఆయన రాసిన పాటల గురించి ప్రస్తావించడానికి సమయాన్ని వెచ్చించడం అనేది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
1956 నుంచి 16 ఏళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన వేటూరిని నందమూరి తారక రామారావు ఆయనలోని ప్రతిభను గుర్తించి సినిమా రంగానికి ఆహ్వానించారు. తాను సినిమా రంగానికి పనికిరానని ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు వేటూరి. అయినా పట్టు వదలని ఎన్టీఆర్ ‘దీక్ష’ చిత్రం కోసం ఓ పాటను రాయించారు. అయితే అప్పటికే పాటల పర్వం ముగియడంతో వేటూరి తొలి సినిమా పాట వెలుగు చూడలేకపోయింది. ఆ తర్వాత కె.విశ్వనాథ్ తన దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రానికి ‘భారతనారీ చరితము’ అనే హరికథను రాయించుకున్నారు. ఈ హరికథతోనే సినీ రంగ ప్రవేశం చేశారు వేటూరి. అక్కడి నుంచి వేటూరి కలం ఆగలేదు. కొన్ని వేల పాటలతో తెలుగు వారిని అలరించారు. శంకరాభరణము, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం వంటి తెలుగుదనం ఉట్టిపడే పాటలతో పాటు మాస్ పాటలను కూడా తనదైన శైలిలో రాసి ఆబాలగోపాలాన్ని అబ్బురపరిచారు. తన కెరీర్‌లో 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు వేటూరి సుందరరామ్మూర్తి. 1936 జనవరి 29న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించిన వేటూరి మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు.
వేటూరి పదవిన్యాసాల గురించి బోలెడు కథలు చెబుతారు. ఒకసారి ‘అడవిరాముడు’ నిర్మాతలు.. ‘పాట రాయకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా’ అని అడిగితే, ‘ఆ.. రేసుకు పోయి పారేసుకున్నాను’ అన్నారట. అంతే.. అదే పల్లవిగా పాట రాయమని దర్శకుడు కోరడంతో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అనే పాట ఆవిర్భవించింది. ప్రేక్షకులను థియేటర్లలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేసిందా పాట. పాటల రచయితలు సమయానికి పాటలు ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రతి రచయిత జీవితంలోనూ ఉంటాయి. దానికి వేటూరి కూడా అతీతుడు కాదు. ‘ఆలుమగలు’ చిత్రం కోసం ఇవ్వాల్సిన పాటలు ఆలస్యం కావడంతో ఆ చిత్ర నిర్మాత ఎ.వి.సుబ్బారావు ‘పాట ఎప్పుడిస్తావయ్యా..’ అని అడిగారు. దానికి వేటూరి ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ అంటూ చమత్కారంగా అన్నారట. అంతే.. ఆ సినిమాలోని ఓ పాటకు పల్లవి రెడీ అయిపోయింది.
వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలకు ప్రభుత్వ అవార్డులే కాదు, ప్రజల రివార్డులు ఎన్నెన్నో లభించాయి. ఆయన పాటలతోనే పలు చిత్రాలపై వసూళ్ళ వర్షం కురిసింది. ఆయన పాటలతోనే నాటి వర్ధమాన కథానాయకులు తారాపథం చూడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి పాటల మహత్తుతో వెలిగిన వైభవాలు అనేకం కనిపిస్తాయి. అందుకే తెలుగు మాట ఉన్నంత వరకు వేటూరి పాట కూడా వెలుగొందుతూనే ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



