వెంకటేష్‌తో ఒకే ఏడాది రెండు హిట్స్ తీసిన నిర్మాత.. కోర్టులో కేసు వేసిన కృష్ణంరాజు!
on Nov 9, 2024
ఒక మంచి సినిమా నిర్మించి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన వారు చేసే మొదటి ప్రయత్నం డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయడం. ఇలా ఎంతో మంది నిర్మాతలు కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. అయితే డబ్బింగ్ సినిమాలు చేయడం ద్వారానే నిర్మాతలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ. సౌదామిని క్రియేషన్స్ అనే బేనర్‌ను స్థాపించి 100కి పైగా డబ్బింగ్ సినిమాలు చేశారు. అలాగే 15 స్ట్రెయిట్ సినిమాలు కూడా నిర్మించారు. విక్టరీ వెంకటేష్‌తో ఒకే సంవత్సరం రెండు సినిమాలు చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆ రెండు సినిమాలు సుందరకాండ, కొండపల్లి రాజా. సుందరకాండ 1992 అక్టోబర్ 2న విడుదలైంది, కొండపల్లి రాజా 1993 జూలై 3న రిలీజ్ అయింది. అంటే రెండు సినిమాలు 9 నెలల గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కొండపల్లి రాజా చిత్రానికి సంబంధించి నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ రెబల్‌స్టార్ కృష్ణంరాజు కోర్టును ఆశ్రయించారు. అసలు కొండపల్లిరాజా సినిమాకి, కృష్ణంరాజుకి సంబంధం ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.. అనే విషయాలు తెలుసుకుందాం.
సుందరకాండ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ చెన్నయ్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ రజినీకాంత్ నటించిన అన్నామలై చిత్రాన్ని చూశారు. సినిమా బాగా నచ్చడంతో ఫ్యాన్సీ రేట్ ఇచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నారు కె.వి.వి. ఈ సినిమా ఎవరితో చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ బయల్దేరిన కె.వి.వి.కి అనుకోకుండా ఫ్లైట్‌లో చిరంజీవి కనిపించారు. ఆయనకు అన్నామలై కథను వివరించారు. చిరుకి కూడా బాగా నచ్చింది. తప్పకుండా చేద్దాం అన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా సుందరకాండ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్ళారు కె.వి.వి. ఆ సినిమా గురించి వెంకటేష్‌కి కూడా చెప్పారు. ఆ సినిమా మనమే చేద్దాం అని వెంకటేష్ అన్నారు. వెంకటేష్, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో అదే సంవత్సరం విడుదలైన చంటి పెద్ద హిట్ కావడంతో అన్నామలై రీమేక్‌కి రవిరాజాను డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారు. సుందరకాండ జరుగుతుండగానే కొండపల్లి రాజా చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ రెండు సినిమాలకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించారు. రెండు సినిమాల్లోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. సుందరకాండ షూటింగ్ పూర్తి కావడంతో 1992లో చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత కొండపల్లి రాజా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి 1993లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుండగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఈ సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ కోర్టుకెక్కారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రింట్లను సీజ్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. కృష్ణంరాజు కేసు వేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేమిటంటే.. 1987లో జితేంద్ర, శత్రుఘ్నసిన్హా హీరోలుగా, భానుప్రియ, అమృతాసింగ్ హీరోయిన్లుగా ఖుద్‌గర్జ్ పేరుతో ఓ హిందీ సినిమా రూపొందింది. 1979 జాఫ్రీ ఆర్చర్ అనే రచయిత రాసిన కేన్ అండ్ ఏబెల్ అనే నవల ఆధారంగా ఖుద్‌గర్జ్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు రాకేష్ రోషన్. ఈ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. మ్యూజికల్‌గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రైట్స్ తీసుకొని ప్రాణస్నేహితులు పేరుతో గోపీకృష్ణా కంబైన్స్ బేనర్‌లో కృష్ణంరాజు నిర్మించారు. కృష్ణంరాజు, శరత్‌బాబు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే తమిళ్‌లో రజినీకాంత్, శరత్‌బాబులతో సురేష్ కృష్ణ డైరెక్షన్‌లో అన్నామలై పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా రైట్స్‌ను కె.వి.వి.సత్యనారాయణ తీసుకొని కొండపల్లిరాజా చిత్రాన్ని నిర్మించారు. దీంతో ఖుద్‌గర్జ్ తెలుగు రీమేక్ రైట్స్ తనవి కాబట్టి కొండపల్లి రాజా రిలీజ్‌ను ఆపాలని కోర్టుకెక్కారు కృష్ణంరాజు. విచారణ చేపట్టిన కోర్టు కృష్ణంరాజుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కె.వి.వి.సత్యనారాయణ జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దాని నుంచి బయటికి రావడానికి ఆయన ఎంతో డబ్బు ఖర్చు చెయ్యాల్సి వచ్చింది. చివరికి కొండపల్లిరాజా చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. అయినా ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యలేకపోయారు కె.వి.వి.సత్యనారాయణ.
Also Read