ముగ్గురు అగ్రనిర్మాతలు 30 లక్షల్లో తీసిన సినిమా 2 కోట్లు వసూలు చేసింది!
on Apr 11, 2025
ఏ సినిమాకైనా కథే మూలం, కథే ప్రధానం. కథాబలం ఉన్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయని అనేకసార్లు ప్రూవ్ అయింది. కొన్ని కమర్షియల్ సినిమాలు కథాబలం లేకున్నా స్టార్ వాల్యూతో ఘనవిజయాలు సాధిస్తుంటాయి. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే కథాబలం ఉన్న సినిమాలను తక్కువ బడ్టెట్‌తో, చిన్న ఆర్టిస్టులతో చేసి విజయాలు అందుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకు దక్కుతుంది. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన దాసరి.. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్ని తరహా సినిమాలు చేశారు. అలాగే కొన్ని ప్రయోగాలు కూడా చేసి సక్సెస్ అయ్యారు. అలా ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కించిన సినిమా ‘అమ్మ రాజీనామా’.
మరాఠిలో అశోక్ పాటిల్ రాసిన ‘రిటైర్ హోతి’ అనే నాటకం మహారాష్ట్రలో చాలా పాపులర్. ఎన్నో వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ నాటకం గురించి తెలుసుకున్న సి.అశ్వినీదత్.. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో హక్కులు కొన్నారు. ఈ నాటకం గురించి తన మిత్రులు, ప్రముఖ నిర్మాతలు కె.దేవీవరప్రసాద్, టి.త్రివిక్రమరావులకు చెప్పారు. వారికి కూడా కథ బాగా నచ్చింది. వాస్తవానికి ఈ ముగ్గురూ అగ్ర నిర్మాతలే. ఆ సినిమాను ఒక్కరే నిర్మించగల సామర్థ్యం వారికి ఉంది. కానీ, ప్రయోగాత్మకంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముగ్గురూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ కథా చిత్రాలు, మహిళల సమస్యలపై సినిమాలు రూపొందించడంలో సిద్ధహస్తుడైన దాసరి నారాయణరావుకే ఆ బాధ్యతను అప్పగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ కథకు సంబంధించిన పూర్తి వివరాలు దాసరితో చెప్పి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను రెడీ చెయ్యమన్నారు.
పూర్తి ఉత్తర భారత నేపథ్యం ఉన్న ఈ కథలో ఎన్నో మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథ సిద్ధం చేశారు దాసరి. అందరికీ ఆసక్తి కలిగించే విధంగా ‘అమ్మ రాజీనామా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాను ఎక్కడ తియ్యాలనే విషయంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. మోహన్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ దాసరి నారాయణరావు తీసిన స్వర్గం నరకం చిత్రం, కృష్ణ కుమారుడు రమేష్‌బాబు తొలిసారి నటించిన నీడ చిత్రాలను విజయవాడలో తీశారు దాసరి. అమ్మ రాజీనామా చిత్రం షూటింగ్ కూడా విజయవాడలోనే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1991 అక్టోబర్ 9న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. కేవలం 21 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఉద్యోగులకు రిటైర్‌మెంట్ ఉంటుంది. పెళ్లి తర్వాత భర్తకు, ఆ తర్వాత పిల్లలకు సేవ చేసే తల్లి మాత్రం మరణం తర్వాతే రిటైర్ అవుతుంది. అయితే భర్తకు, పిల్లలకు ఎంత చేసినా తనకు విలువ ఇవ్వకపోవడంతో ఆ బాధ్యతల నుంచి విరమణ తీసుకుంటుంది ఆ తల్లి. అదే ‘అమ్మ రాజీనామా’ కథ. ఈ టైటిల్‌ను ఎనౌన్స్ చెయ్యగానే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అంతేకాదు, సినిమా రిలీజ్‌కి ముందే విడుదలైన ఆడియో సూపర్‌హిట్ అయింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ముఖ్యంగా ‘ఎవరు రాయగలరు.. అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం..’, ‘సృష్టికర్త ఒక బ్రహ్మ.. అతనిని సృష్టించినదొక అమ్మ..’ అనే పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ పాటలతో సినిమాపై ప్రేక్షకులకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సి.అశ్వినీదత్, కె.దేవీవరప్రసాద్, టి.త్రివిక్రమరావు కలిసి రూ.30 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.2 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఎలాంటి అవార్డులు రాకపోవడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కన్నడలో లక్ష్మి ప్రధాన పాత్రలో ‘అమ్మ’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
