ENGLISH | TELUGU  

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

on Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..)

కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.

 

సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు. 

 

సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. 

 

సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.

 

ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.

 

తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.

 

‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.

 

ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

 

సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.