నేటితో శత జయంతి సంవత్సరంలోకి సూర్యకాంతం
on Oct 28, 2023
తెలుగు సినిమా కళావైభవానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఎంతో మంది నటీమణుల్లో సూర్యకాంతం ఒకరు. నేడు తన పుట్టిన రోజు. ఈ రోజు తో శతజయంతి సంవత్సరంలోకి ఆమె అడుగుపెట్టబోతుంది. అంటే 100 వ సంవత్సరంలో కి అడుగుపెట్టబోతుంది. అత్త పాత్రలకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన నట శిఖామణి సూర్యకాంతం నేడు భౌతికంగా మన మధ్య లేక పోయినా తను నటించిన సినిమాల ద్వారా మన ముందే ఉన్నారు.
1924 అక్టోబర్ 28 న కాకినాడలో ఒక సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో సూర్యకాంతం జన్మించారు. సినిమాల్లో నటించాలనే కోరికతో ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోయినా చెన్నైలో అడుగుపెట్టారు. మొదట కొన్ని సినిమాల్లో డాన్సర్ గా చేసిన సూర్యకాంతం పర్లాకిమిడి జమిందారు రాజా గజపతిదేవ్ నిర్మాతగా సి .పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన నారద నారది అనే సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమయ్యారు. మూగ అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన సూర్యకాంతం ఆ తర్వాత పెళ్లి చేసి చూడు, ప్రేమ, అమ్మలక్కలు, దొంగ రాముడు, చంద్రహాసన్ కన్యాశుల్కం, అప్పుచేసి పప్పుకూడు, తోడికోడళ్లు ,మాయాబజార్మాం,మాంగల్యబలం ఇలా దాదాపు 30 సినిమాలకి పైనే నటించి మంచి నటీమణి అనే గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గుండమ్మ కథ సినిమా సూర్యకాంతం కి ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. కాలక్రమేణా సూర్యకాంతంకి అత్త పాత్రలు రావడం జరిగింది. ఇక అంతే తెలుగు సినిమా ని అప్పటిదాకా డామినేట్ చేసిన హీరో ,హీరోయిన్, దర్శకుల స్థానం లో అత్త పాత్ర కూడా వచ్చి చేరింది. సూర్య కాంతం అత్త పాత్రలో నటించే విధానానికి తెలుగు జనం ఎంతగా ప్రభావితమయ్యారంటే తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి సూర్యకాంతం అనే పేరునే పెట్టలేదు. అలాగే కొత్తగా కాపురానికి వెళ్లిన ఆడపిల్ల కూడా తమ అత్తలని చూసి భయపడేలా సూర్యకాంతం నట విజృంభణ సాగింది. ఎన్నో సినిమా లు ఆవిడ వలన ఆడాయి. జనం తెర మీద సూర్య కాంతం ని తిట్టుకుంటునే తన సినిమా కి రిపీటెడ్ గా వెళ్లే వాళ్ళు.
50 వ దశకంలో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సూర్యకాంతం 90 వ దశకం దాకా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలని పోషించారు. కులగోత్రాలు, రక్తసంబంధం,చదువుకున్న అమ్మాయిలు.మూగమనసులు, రాముడు భీముడు ఆత్మ గౌరవం, నవరాత్రి,జమీందార్, ఆస్తిపాస్తులు,ఉమ్మడికుటుంబం,గృహ లక్ష్మి,పూల రంగడు,నిన్నే పెళ్లాడుతా,తిక్క శంకరయ్య, అత్తలు కోడళ్ళు ,కాలం మారింది, యమగోల,గోరంత దీపం, గయ్యాళి గంగమ్మ, ఉగ్ర నరసింహం, యముడికి మొగుడు,పల్నాటి సింహం, వన్ బై టూ ,గోవింద గోవింద ఇలా లెక్కకు పైగా చిత్రాల్లో నటించి అశేష తెలుగు ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. చిరంజీవి ,శ్రీదేవి ల కాంబినేషన్ లో వచ్చిన ఎస్.పి పరశురామ్ సూర్యకాంతం నటించిన చివరి చిత్రం. 70 సంవత్సరాల వయసులో 1994 డిసెంబర్ 18 న సూర్యకాంతం కన్నుమూశారు. సూర్యకాంతం గారు మీరు మా మధ్య లేకపోయిన మీరు నటించిన సినిమాల రూపంలో మా మధ్యే ఉన్నారు. మీకు మా తెలుగు వన్ మీడియా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Also Read