అమ్మానాన్నలతో సూపర్‌స్టార్ అనుబంధం
on Nov 16, 2022
తల్లితండ్రులు నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి అంటే కృష్ణకు భక్తి, గౌరవం ఎక్కువే. కృష్ణను ఇంజినీర్‌గా చూడాలనేది వారి కోరిక. కానీ సినిమా యాక్టర్ కావాలన్నది ఆయన ఆశయం. బీయస్సీ చదివాక సినిమాల్లోకి వెళ్తానంటే నాగరత్నమ్మ ప్రోత్సహించారు. తమ పిల్లల చదువుల కోసం స్వగ్రామం బుర్రిపాలెం వదిలిపెట్టి, తెనాలిలో కాపురం పెట్టి దగ్గరుండి వారిని చదివించారు. కాలేజీ చదువుల కోసం ఊళ్లోని పొలాన్ని అమ్మి కృష్ణను ఏలూరుకి పంపి చదివించారు. ఆ పొలాన్ని తిరిగి ఎలాగైనా పందాలనే పట్టుదల నాగరత్నమ్మలో ఉండేది.
కృష్ణ హీరోగా బిజీ అయ్యాక ఆయనతో బుర్రిపాలెంలో పొలం కొనిపించారు. అక్కడి పాత ఇంటిని రిమోడలింగ్ చేయించారు. మేడ పైభాగాన్ని కృష్ణ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అమ్మ కోసం తను ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు బుర్రిపాలెం వెళ్లి రెండు మూడు రోజులు అక్కడ గడిపేవారు కృష్ణ. సొంతూరులో స్కూలు కట్టించాలనే అమ్మ కోరికను కూడా కృష్ణ నెరవేర్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1985లో బుర్రిపాలెంలో 'నాగరత్నమ్మ ప్రాథమిక ఉన్నత పాఠశాల' ప్రారంభమైంది. ఆ స్కూల్ ఇప్పటికీ నడుస్తోంది.
తన అమ్మానాన్నల పేరు మీద విడివిడిగా సినిమాలు నిర్మించారు కృష్ణ. తండ్రి పేరుమీద జి.వి.ఆర్. (ఘట్టమనేని వీరరాఘవయ్య) పిక్చర్స్ పేరుతో బ్యానర్ నెలకొల్పి 'శభాష్ గోపి' చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. టైటిల్స్‌లో వీరరాఘవయ్య చౌదరి నిర్మాతగానూ, కృష్ణ సమర్పకునిగానూ కనిపిస్తారు. దీనికి స్క్రీన్‌ప్లే రైటర్ హనుమంతరావు, నిర్మాణ సారథి ఆదిశేషగిరిరావు. ఇలా తండ్రీకొడుకులు కలిసి తీసిన ఈ మూవీలో టైటిల్ రోల్‌ను కృష్ణ కుమార్తె మంజుల పోషించడం విశేషం. బాలనటిగా ఆమెకు ఇదే తొలిచిత్రం. మానికొండ మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1978లో విడుదలైంది. ఇక తల్లి పేరిట రత్నా మూవీస్ బ్యానర్ నెలకొలిపిన కృష్ణ, దానిపై 'ప్రజారాజ్యం', 'ముగ్గురు కొడుకులు' చిత్రాలను నిర్మించారు.
'కలియుగ కర్ణుడు ' సినిమా షూటింగ్ జరుగుతున్న కాలంలో 1987లో వీరరాఘవయ్య కన్నుమూశారు. భర్త మరణంతో కుంగిపోయిన నాగరత్నమ్మ ఏడాది తిరిగేసరికి 1989 జనవరి 3న తన 76వ ఏట మృతిచెందారు.
Also Read