‘బద్రి’ క్లైమాక్స్ విషయంలో పవన్ మాట వినని పూరి.. అప్పుడు ఏం జరిగింది?
on Sep 26, 2025

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా పరిచయమైన పవన్‌కళ్యాణ్.. ఆ తర్వాత ఎలాంటి సెన్సేషనల్ హిట్స్‌తో స్టార్ హీరో అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని హిట్స్ వచ్చినా అతని కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో బద్రి ఒకటి. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసి యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగులు ఆరోజుల్లో జనం వాడుకలోకి వచ్చేశాయి. అలాంటి డిఫరెంట్ డైలాగులు రాయగల ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్. పవన్‌కళ్యాణ్‌కి కొత్త ఇమేజ్‌ని, గ్లామర్‌ని తీసుకొచ్చిన ఘనత పూరికి దక్కుతుంది. ‘బద్రి’ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా. డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ దక్కించుకునేందుకు పవన్‌కళ్యాణ్ వంటి హీరోకి కథ చెప్పి ఎలా మెప్పించారు? దాని వెనుక కథ ఏమిటి అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
రామ్‌గోపాల్‌వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి డైరెక్టర్‌గా ఛాన్స్ కోసం తిరుగుతున్న రోజులవి. అంతకుముందు దూరదర్శన్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు పూరి. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుతో మంచి స్నేహం ఉండేది. దాంతో తను పవన్‌కళ్యాణ్‌కి స్టోరీ చెప్పేందుకు ఏర్పాటు చేయమని అడిగాడు పూరి. శ్యామ్ కె.నాయుడు సోదరుడు ఛోటా కె.నాయుడు.. పవన్‌కళ్యాణ్‌కి మంచి స్నేహితుడు. పూరిని అతని దగ్గరకు తీసుకెళ్లాడు శ్యామ్. పవన్‌కళ్యాణ్‌కి స్టోరీ చెప్పాలంటే.. ముందు తనకు చెప్పాలని, కథ బాగోకపోతే తనకు చెడ్డపేరు వస్తుందని అన్నాడు ఛోటా. అప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పారు పూరి. ఛోటాకి ఆ కథ బాగా నచ్చింది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌కి మూడు ముక్కల్లో ఆ కథ చెప్పాడు ఛోటా.
పవన్‌కి కూడా స్టోరీ నచ్చడంతో తెల్లవారు జామున 4 గంటలకు పూరి జగన్నాథ్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు, అరగంట మాత్రమే టైమ్ ఇస్తానని, ఆలోగా తనకు కథ చెప్పాలని కండిషన్ పెట్టారు పవన్. దానికి ఒప్పుకున్నారు పూరి. ఆరోజుల్లో పూరి కృష్ణానగర్‌లో ఉండేవారు. ఉదయం 4 గంటలకు అక్కడి నుంచి పవన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు. కథ చెప్పడం మొదలు పెట్టారు. అరగంట దాటిపోయింది. అలా నాలుగు గంటల పాటు కథ చెప్పారు పూరి. పవన్‌కి ఆ కథ బాగా నచ్చింది. అయితే క్లైమాక్స్ మార్చి మళ్ళీ కథ చెప్పమన్నారు. వారం రోజులపాటు దానిమీద కూర్చున్నారు పూరి. కానీ, తను రాసిన క్లైమాక్స్‌ని మించిన క్లైమాక్స్ అతనికి రావడం లేదు. మళ్ళీ పవన్ చెప్పిన టైమ్‌కి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ కథ చెప్పారు. ‘ఇంతకుముందు చెప్పిన క్లైమాక్సే కదా ఇది’ అన్నారు పవన్. తను రాసిన క్లైమాక్స్‌ని మించింది రావడం లేదని చెప్పారు. తను మార్చమని చెప్పాడు కాబట్టి క్లైమాక్స్ మార్చుకొని వస్తాడని ఊహించారు పవన్. కానీ, పూరి తను అనుకున్న దానికే ఫిక్స్ అయ్యాడు. పవన్‌కి అది బాగా నచ్చింది.
అందుకే పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే చివరలో ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ‘ఛోటా నాతో చెప్పిన కథ ఇది కాదు కదా.. సూసైడ్స్‌కి సంబంధించిన కథ చెప్పాడు’ అన్నారు. ‘ఈ కథ చెబితే ఛోటాగారికి నచ్చేది కాదు. అందుకే వేరే కథ చెప్పి మీ అపాయింట్‌మెంట్ సంపాదించాను’ అన్నారు. ఆ విషయంలో పూరి యాటిట్యూడ్ ఇంకా బాగా నచ్చింది పవన్‌కి. అలా శ్యామ్ కె.నాయుడు ద్వారా డైరెక్టర్‌గా తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు పూరి. ఐదు సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత ఇడియట్ నుంచి డబుల్ ఇస్మార్ట్ వరకు పూరి జగన్నాథ్ చేసిన సినిమాల్లో 80 శాతం సినిమాలకు తనకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇప్పించిన శ్యామ్ కె.నాయుడుతోనే పనిచేశారు పవన్‌కళ్యాణ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



