ENGLISH | TELUGU  

శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలేంటో తెలుసా!

on Jul 21, 2023

నటనకు పర్యాయపదంలా నిలిచిన తారల్లో 'నడిగర్ తిలగమ్' శివాజీ గణేశన్ ఒకరు. తమిళంలో తిరుగులేని కథానాయకుడిగా రాణించిన ఈ 'నవరస నాయగన్'.. మన తెలుగు సినిమాల్లోనూ సందడి చేశారు. ఇటు ముఖ్య పాత్రల్లోనూ, అటు అతిథి పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. శివాజీ గణేశన్ నటించిన తెలుగు చిత్రాల వివరాల్లోకి వెళితే.. 

పరదేశి: ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగులో 'పరదేశి' పేరుతో, తమిళంలో 'పూంగోతై' పేరుతోనూ రూపొందిన ఈ సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావుతో కలిసి నటించారు శివాజీ గణేశన్. ఈ చిత్రానికి ఎల్వీ ప్రసాద్ దర్శకుడు. 1953 సంక్రాంతి కానుకగా జనవరి 14న 'పరదేశి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

పెంపుడు కొడుకు: ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే తయారైన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, మహానటి సావిత్రి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రల్లో అభినయించారు. 1953 నవంబర్ 12న ఈ సినిమా రిలీజైంది. 

మనోహర: ఈ సినిమాకి కూడా ఎల్వీ ప్రసాద్ నే దర్శకుడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం.. తమిళ వెర్షన్ లో 1954 మార్చి 3న రిలీజ్ కాగా, 1954 జూన్ 3న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.

బొమ్మల పెళ్ళి: తమిళంలో 'బొమ్మై కళ్యాణమ్', తెలుగులో 'బొమ్మల పెళ్ళి' పేర్లతో ఏకకాలంలో నిర్మితమైన ఈ ద్విభాషా చిత్రంలో.. శివాజీ గణేశన్, జమున ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఆర్. ఎం. కృష్ణస్వామి ఈ సినిమాకి నిర్దేశకుడు. 1958 జనవరి 11న తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా.. అదే సంవత్సరం మే 3న తమిళ వెర్షన్ థియేటర్స్ బాట పట్టింది.

నివురుగప్పిన నిప్పు: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. కె. బాపయ్య రూపొందించిన ఈ మూవీ 1982 జూన్ 24న జనం ముందు నిలిచింది. 

బెజవాడ బెబ్బులి: కృష్ణ, రాధిక జోడీగా నటించిన ఈ చిత్రంలో రవీంద్ర, ఏఎస్పీ రఘుగా ఎంటర్టైన్ చేశారు శివాజీ గణేశన్. 1983 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. 

విశ్వనాథ నాయకుడు:  దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో కృష్ణది టైటిల్ రోల్ కాగా.. ఆయన తండ్రి నాగమ నాయకుడిగా శివాజీ దర్శనమిచ్చారు. కృష్ణదేవరాయగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించారు. 1987 ఆగస్టు 14న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెండితెరపైకి వచ్చింది. 

అగ్ని పుత్రుడు: తండ్రీకొడుకులు ఏయన్నార్, నాగార్జున కలిసి నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. 1987 ఆగస్టు 27న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించారు.

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బి.ఆర్. పంతులు తెరకెక్కించిన త్రిభాషా చిత్రమిది. టైటిల్ కి తగ్గట్టు ఇందులో పిల్లలు ప్రధాన పాత్రధారులు కాగా.. శివాజీ గణేశన్ ఓ స్పెషల్ రోల్ లో మెరిశారు. 1960 జూలై 1న ఈ చిత్రం రిలీజైంది. 

రామదాసు: చిత్తూరు వి. నాగయ్య టైటిల్ రోల్ లో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటరత్న నందమూరి తారక రామారావు శ్రీరాముడిగా కనిపించగా.. శివాజీ గణేశన్ లక్ష్మణుడిగా దర్శనమిచ్చారు. 1964 డిసెంబర్ 23న ఈ బయోగ్రాఫికల్ మూవీ రిలీజైంది.

బంగారు బాబు: ఏయన్నార్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ అతిథి పాత్రలో కనిపించారు. వీబీ రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1973 మార్చి 15న రిలీజైంది.

భక్త తుకారం: ఇందులో టైటిల్ రోల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించగా.. శివాజీ పాత్రలో శివాజీ గణేశన్ దర్శనమిచ్చారు. వి. మధుసూదన రావు రూపొందించిన ఈ మూవీ 1973 జూలై 5న తెరపైకి వచ్చింది.

జీవన తీరాలు: కృష్ణంరాజు, వాణిశ్రీ, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ గెస్ట్ రోల్ చేశారు. జీసీ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1977 ఆగస్టు 12న జనం ముందుకు వచ్చింది. 

చాణక్య చంద్రగుప్త: ఎన్టీఆర్ చంద్రగుప్త మౌర్యగా.. ఏయన్నార్ చాణక్యుడిగా టైటిల్ రోల్స్ లో అలరించిన ఈ సినిమాలో అలెగ్జాండర్ గా కాసేపు మెరిశారు శివాజీ గణేశన్. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ 1977 ఆగస్టు 25న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. 

(జూలై 21.. శివాజీ గణేశన్ వర్థంతి సందర్భంగా)


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.