ప్రభాస్ అందరికీ డార్లింగ్ ఎలా అయ్యాడో తెలుసా?
on Oct 22, 2025
(అక్టోబర్ 23 రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా..)
రెబల్‌స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. స్టార్‌గా తను ఎంత ఎత్తుకు ఎదిగినా డౌన్ టు ఎర్త్ అనే పద్ధతిలోనే ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. టాలీవుడ్‌లో గొప్ప స్నేహశీలిగా పేరు తెచ్చుకొని అందరికీ డార్లింగ్‌గా మారిన ప్రభాస్.. ప్రతి ఒక్కరినీ డార్లింగ్ అంటూ ప్రేమగా పలకరిస్తాడు. సాధారణంగా సెలబ్రిటీస్‌లో ఉండే హిపోక్రసీ ప్రభాస్‌లో కనిపించదు. స్వచ్ఛమైన మనసు, అందర్నీ ఆదరించే సుగుణం అతని సొంతం. అందుకే అందరికీ అతను డార్లింగ్ అయ్యాడు. అందరికీ ఎంతో ఇష్టమైన ప్రభాస్ అభిరుచులు ఏమిటి? ఆయన ఎవరిని ఇష్టపడతారు? ఎలాంటి జీవితాన్ని ఆయన కోరుకుంటారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ప్రభాస్ ప్రకృతి ప్రేమికుడు. ముఖ్యంగా అడవులు, జంతువులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని 1650 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దాని కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. తన తండ్రి యు.వి.సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఈ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఒక అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకో టూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇందులో జంతువుల్ని కూడా ప్రవేశపెట్టి వాటిని సంరక్షించాలన్నది ప్రభాస్ ఆలోచన.
నటుడు అవ్వాలన్న ఆలోచన ప్రభాస్‌కి మొదట్లో ఉండేది కాదు. బాగా చదువుకొని మంచి బిజినెస్‌మేన్‌గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన గోల్. అయితే పెదనాన్న కృష్ణంరాజు, స్నేహితుల ప్రోత్సాహంతో నటనవైపు అడుగులు వేశారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత నటనలో శిక్షణ పొందారు.
ప్రభాస్‌కి ఇష్టమైన డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్ చిత్రాలను 20 సార్లకు పైగా చూశారు. హాలీవుడ్‌కి చెందిన రాబర్ట్ డీనీరో ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు. ఆయన నటన అంటే ప్రభాస్‌కి ఎంతో ఇష్టం.
ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయడానికి ప్రభాస్ ఇష్టపడేవారు కాదు. తను చేసే ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టేవారు. అలా బాహుబలి సిరీస్ కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించారు. ఈ సినిమా తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని ఒకేసారి పలు సినిమాల్లో నటిస్తూ తన సినిమాల స్పీడును పెంచారు.
బాహుబలి సినిమాలో చేసిన శివుడు, అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్స్ కోసం 30 కేజీల బరువు పెరిగారు ప్రభాస్. దాన్ని నాలుగు సంవత్సరాలపాటు కొనసాగించడం కోసం ఎంతో శ్రమించారు. 2010లో మిస్టర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న లక్ష్మణ్‌రెడ్డి... బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ని ట్రైన్ చేశారు. కోటిన్నర విలువైన జిమ్ ఎక్విప్‌మెంట్స్ ప్రభాస్ కోసం తెప్పించారు మేకర్స్.
రాజమౌళి మాటల్లో చెప్పాలంటే.. ప్రభాస్ చాలా బద్ధకస్తుడు. ఏ పని చెయ్యడానికైనా బద్దకిస్తాడు. అయితే సెట్స్‌కి వచ్చిన తర్వాత ఒక్కసారి కెమెరా ముందు నిలబడితే తన నటవిశ్వరూపంతో విజృంభిస్తాడు. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా విషయాల్లో బద్ధకంగా వ్యవహరిస్తాడు.
బాహుబలి సినిమాకి సంబంధించి ఇచ్చిన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో భాగంగా ప్రభాస్‌తో వాలీబాల్ కూడా ఆడించేవారు. అప్పటి నుంచి వాలీబాల్ ప్రభాస్‌కి ఇష్టమైన గేమ్‌గా మారిపోయింది. దాని కోసం తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్ కోర్ట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బాస్కెట్ బాల్ అంటే కూడా ప్రభాస్‌కి చాలా ఇష్టం.
ప్రభాస్‌కి ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ. అతిథులకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటారు అతని ఆతిథ్యం తీసుకున్నవారు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు’. ‘సలార్’ చేస్తున్న సమయంలో తను ఉంటున్న రూమ్‌కి లెక్కకు మించిన డిషెస్ పంపించాడని, అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా పంపాడని పృథ్విరాజ్ చెప్పారు.
సేవా కార్యక్రమాల్లో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. ప్రకృతి విపత్తు సంభవించినపుడు ఏ టాలీవుడ్ ఇవ్వనంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటిస్తుంటారు. ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సాయం చేయడం ద్వారా వారిని ఆదుకున్నారు. అయితే చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెబుతారు ప్రభాస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



