ENGLISH | TELUGU  

అమ్మాయితో దొరికిపోయిన అక్కినేని.. అప్పుడు అన్నపూర్ణ ఏం చేశారో తెలుసా?

on Oct 18, 2024

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన కెరీర్‌ని కొనసాగించిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు. 1944లో ప్రారంభమైన అక్కినేని సినీ ప్రస్థానం ఏకధాటిగా 80 ఏళ్ళు కొనసాగింది. 2014లో అక్కినేని కన్నుమూశారు. ఆయన చివరి శ్వాస వరకు నటుడిగానే కొనసాగారు. అంత సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు, ఎలాంటి వివాదాలకూ తావివ్వలేదు. అలాంటిది నటుడుగా పరిశ్రమలో నిలదొక్కుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న రోజుల్లో ఆయనకు ఓ థియేటర్‌లో వింత అనుభవం ఎదురైంది. దాంతో అక్కినేని అన్నపూర్ణ ఎంతో వేదనకు గురయ్యారు. ఆ కారణంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో థియేటర్‌ కట్టే వరకు అక్కినేనితో కలిసి మళ్ళీ థియేటర్‌కు వెళ్ళలేదు. ఆ అనుభవం ఎలాంటిది, అక్కినేని అన్నపూర్ణ అంత బాధపడడానికి కారణం ఏమిటి? అనేది కొన్ని సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్నప్పుడు ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు.

‘నేను నాలుగో తరగతి వరకే చదువుకున్నాను. అంతకుమించి నన్ను చదివించే స్తోమత మా కుటుంబానికి లేదు. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తుండడం వల్ల అందులో ఏమైనా రాణిస్తాడేమో అని మా అమ్మ అనుకోవడంతో ఆ దిశగానే నా ప్రయత్నాలు ప్రారంభించాను. ఎన్నో నాటకాలు వేశాను. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. చదువు లేకపోవడం వల్ల, నాకు ఇంగ్లీషు రాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నాకు పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి నా మేనమామ తన కూతుర్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సినిమా వాళ్లంటే చెడ్డవారని, వ్యసనపరులని ప్రజలకి ఎంతో నమ్మకం. ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందర్నీ నిందించడం కూడా కరెక్ట్‌ కాదు. సొసైటీలో రోజూ ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ మనకు తెలియదు కదా. సినిమాల వల్ల మేం అందరికీ తెలుస్తాము కాబట్టి మా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. సినిమాల్లోకి వెళ్ళే ముందే నేను మందు తాగనని, అమ్మాయిల జోలికి వెళ్ళనని మా అమ్మకి మాటిచ్చాను. దాని ప్రకారమే నడుచుకున్నాను. ఏ వ్యసనాలకు లొంగిపోకుండా నా కెరీర్‌ను కొనసాగించాను. అయినా నా మేనమామ కూతుర్ని నాకు ఇవ్వలేదు. బయటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. 

బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను వంటి సినిమాలు రిలీజ్‌ అయిన తర్వాత నాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలు తమిళ్‌లో కూడా డబ్‌ అయ్యాయి. కొన్ని సినిమాలు వందరోజులు ఆడాయి. దానికి సంబంధించిన ఫంక్షన్లు కూడా జరిగాయి. ఆ విధంగా తమిళ ప్రేక్షకులకు కూడా నేను బాగా పరిచయం. అప్పటికి శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ ఇండస్ట్రీకి రాలేదు. ఆ సమయంలో నా భార్య ఇంగ్లీష్‌ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని వుంది, తనను తీసుకెళ్ళమని అడిగింది. అప్పుడు చెన్నయ్‌లోని ఓ థియేటర్‌కి నేను, నా శ్రీమతి వెళ్ళాం. మొదట మమ్మల్ని ఎవరూ చూడలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా నన్ను గుర్తుపట్టి దూరం నుంచే చూడడం మొదలుపెట్టారు. అప్పుడు నా పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అనే విషయం గురించి వాళ్ళు మాట్లాడుకోవడం మాకు వినిపించింది. ‘ఆ అమ్మాయి ఎవరు.. ఎస్‌.వరలక్ష్మా’ అని ఒకడంటే.. ‘కాదు కాదు. ఆమెకు పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా’ అని ఒకడన్నాడు. ‘అంజలి అయ్యుంటుందా. అంజలి పొట్టిగా ఉంటుంది కదా.. ఆమె అయ్యుండదు’, ‘భానుమతా.. భానుమతి లావుగా ఉంటుంది కదా’, ‘మరి ఎవరై ఉంటారు’ అని ఒకడంటే.. ‘ఎవరో ఎక్స్‌ట్రా అమ్మాయిని కొట్టుకొచ్చి ఉంటాడు’ అని ఒకడు తేల్చేశాడు. ఇవన్నీ వాళ్ళు తమిళ్‌లో  అంటున్నారు. నేను తెలుగులోకి ట్రాన్స్‌లేట్‌ చేసి నా భార్యకు చెబుతున్నాను. అప్పుడు పెళ్ళయిన కొత్త. ఆ మాటలు విని ఆమె చాలా బాధపడింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే.. పాపులారిటీ ఉంటే ఒక కళాకారుడికే కాదు, ఆయన భార్యకు, కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఎంతో సంయమనం పాటిస్తే తప్ప వాటి నుంచి బయటపడలేరు. అందుకే ఒక యాక్టర్‌ భార్యగా ఉండడానికి కూడా ఎన్నో ధైర్యసాహసాలు, తెలివితేటలు, లౌక్యం కావాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న వండర్‌ఫుల్‌ వైఫ్‌ అన్నపూర్ణ. థియేటర్‌లో ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ నాతో ఏ థియేటర్‌కీ రాలేదు. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత అందులో ఉన్న థియేటర్‌కి మాత్రమే వచ్చేది’ అంటూ తనకు ఎదురైన అనుభవం గురించి వివరించారు అక్కినేని నాగేశ్వరరావు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.