ఆ విషం కైకాల సత్యనారాయణ పాలిట వరంగా మారింది.. హీరోను చేసింది!
on Jul 25, 2024
.webp)
పాతతరం నటుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత చెప్పుకునే పేరు ఎస్.వి.రంగారావు. ఆయన తర్వాత నిస్సందేహంగా వినిపించే పేరు కైకాల సత్యనారాయణ. ఆయన ఒక పరిపూర్ణ నటుడు. నవరసాలనూ అవలీలగా పోషించగల సమర్థుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు కైకాల. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుతో ఆరోజల్లోనే సత్కారాలు అందుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కైకాలకు సినిమాల్లో అవకాశం రాక మునుపు ఆయన జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని ప్రభావితుడ్ని చేసింది. జీవితంలో ముందుకు వెళ్ళగలను, అనుకున్నది సాధించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. జూలై 25 కైకాల సత్యనారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటన గురించి తెలుసుకుందాం.
చిన్నతనం నుంచి నటన అంటే మక్కువ ఏర్పరుచుకున్న కైకాలకు చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆయనకు నటన అంటే ఎంత ఇష్టమో, చదువుపట్ల కూడా అంతే గౌరవం ఉండేది. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా డిగ్రీ పూర్తయ్యే వరకు సినిమాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. తను అనుకున్నట్టుగానే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాస్ చేరుకున్నారు. అయితే ఆయనకు ఎప్పుడూ అదృష్టం ఆమడదూరంలో ఉండేది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేవి. అయినా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవ్వలేదు, తన ప్రయత్నాలు మానలేదు. కైకాల ఉండేందుకు రూమ్ కూడా లేకపోవడంతో 15 రోజులపాటు ఒక పార్కునే ఇల్లుగా భావించి అక్కడే గడిపారు. ఆ తర్వాత భాగస్వామ్యంలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. ప్రతిరోజూ అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యడం, రూమ్‌కి వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉండేది.
అలా ఓ రోజు ఎప్పటిలాగే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి రూమ్‌కి చేరుకున్నారు కైకాల. అలసటగా అనిపించడంతో పనిమనిషిని కాఫీ తీసుకు రమ్మని పంపించారు. కాఫీ పూర్తిగా తాగిన తర్వాత కప్పు అడుగున చనిపోయిన సాలెపురుగు కనిపించింది. ఒక్కసారిగా కైకాల మనసు వికలమైపోయింది. చచ్చిన సాలె పురుగు విషంతో సమానమని, వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలని రూమ్‌లోని మిత్రులు చెప్పినా కైకాల వినలేదు. అప్పుడే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తనకు అదృష్టం ఉంటే, నటుడిగా రాణించగలను అని తన నుదుటన రాసి ఉంటే ఈ సాలెపురుగు నన్నేమీ చెయ్యలేదు అనుకున్నారు. అలాగే పడుకున్నారు. ఉదయం ఎప్పటిలాగే నిద్ర లేచారు. తనకు ఎలాంటి అనారోగ్యం కలగలేదు. దాంతో ఆయన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
అదే ఉత్సాహంతో మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరిగేందుకు బయల్దేరారు. నిర్మాత డి.ఎల్.నారాయణ ఒక సినిమా నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆయన్ని కలిసి ఏదైనా వేషం ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు కైకాల. ‘చిన్న వేషం ఏమిటి.. హీరో వేషమే ఉంది వేస్తావా’ అని అడిగారు డి.ఎల్.నారాయణ. దానికి కైకాల ఆశ్చర్యపోయారు. తనను ఎగతాళి చేస్తున్నారు అనుకున్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో సరేనన్నారు. ఆ సినిమా పేరు ‘సిపాయి కూతురు’. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ఉండేవి కాదు. ఆ సమయంలోనే బి.విఠలాచార్యకు కైకాలలో ఒక మంచి విలన్ కనిపించాడు. తన డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో కైకాలకు మొదటిసారి విలన్ వేషం ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. విలన్‌గానే కాదు, అన్ని రకాల క్యారెక్టర్లు పోషించగల నటుడు అని పేరు తెచ్చుకున్నారు. ఎస్.వి.రంగారావు పోషించిన ఎన్నో పాత్రల్లో ఆ తర్వాత కైకాల సత్యనారాయణ నటించడం విశేషంగా చెప్పుకోవాలి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో దాదాపు 777 చిత్రాల్లో నటించారు కైకాల. నవరస నటనా సార్వభౌమగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది తెలుగువన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



