(అక్టోబర్ 28 సూర్యకాంతం జయంతి సందర్భంగా..)
సినిమాల్లో ఆమె కనిపిస్తే కోడళ్లకు హడల్.. అల్లుళ్లకు చెమటలు.. భర్తలకు వణుకు! అత్త పాత్రలో సూర్యకాంతం కనిపించారంటే చాలు.. ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ జరగాల్సిందే. మాటలతోనే ఎదుటివారిని ముప్పుతిప్పలు పెట్టడం, కోపంతో ఊగిపోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గయ్యాళి అత్తగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె తర్వాత సూర్యకాంతం అనే పేరును పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేదు. దీన్నిబట్టి తన నటనతో తెలుగు ప్రజల మనసుల్లో ఆమె ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థమవుతుంది.
తెరపై తన గయ్యాళితనంతో అందరూ భయపెట్టే సూర్యకాంతం నిజజీవితంలో ఒక మహిళను చూసి షాక్ అయింది, నోట మాట రానంత పనైంది. ఈ విచిత్రమైన సంఘటన జరిగిన తర్వాత ఏ సినిమా షూటింగ్‌కి వెళ్లినా సూర్యకాంతం సహనటీనటులు ఆమెను ఆట పట్టించేవారట. అసలేం జరిగింది.. సూర్యకాంతంని అంతలా భయపెట్టిన మహిళ ఎవరు, ఇది ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళితే..
ఓసారి సూర్యకాంతం నెల్లూరుకు వెళ్లినప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారు మధ్యలో ఆగిపోయింది. మెకానిక్ వచ్చి రిపేరు చేస్తుండగా.. ఆమె కారు దిగి రోడ్డు మీదే పచార్లు చేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ సూర్యకాంతంని గుర్తుపట్టి దగ్గరకి వచ్చింది. ఆమెకు సూర్యకాంతం చేసిన గయ్యాళి పాత్రలు, కోడళ్లను రాచి రంపాన పెట్టే సీన్లు అన్నీ గుర్తు వచ్చి ఉంటాయి. దాంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి తిట్ల దండకం మొదలు పెట్టింది.
‘ఇంకెన్ని కాపురాలు కూలుస్తావు?’, ‘కోడళ్లను ఎందుకలా రాచి రంపాన పెడతావు?’ అంటూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలు పెట్టిందా మహిళ. ఒక్కసారిగా షాక్ అయిన సూర్యకాంతం మారు మాట్లాడకుండా ఆమె తిట్లన్నీ భరించారు. తిట్టి తిట్టి అలసిపోయిన ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయాక ఊపిరి పీల్చుకున్నారు సూర్యకాంతం. తను చేసిన క్యారెక్టర్లు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయినందుకు ఆమె ఎంతో సంతోషించారు.
ఈ విషయం సినీ వర్గాలకు తెలియడంతో షూటింగ్‌లలో సహనటులు ఆమెను ఆటపట్టించేవారట. సినిమాల్లో ఆమె పాత్రలు ఎంత సహజంగా ఉండేవో చెప్పడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణగా నిలుస్తాయి. నిజానికి సూర్యకాంతం వ్యక్తిగత జీవితంలో ఎంతో సున్నిత మనస్కురాలని, ఇతరుల కష్టాలకు స్పందించే మంచి మనసున్న వ్యక్తి అని ఆమెతో పనిచేసినవారు చెప్పేవారు.
సూర్యకాంతం నటిగా ఎంత గొప్పవారో, ఆమె చేసిన పాత్రలు ప్రజల్లోకి ఎంతగా దూసుకెళ్లాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. గయ్యాళి అత్త అనే ఇమేజ్ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురైనా, తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెను ఎప్పటికీ మర్చిపోలేరు. అక్టోబర్ 28న సూర్యకాంతం జయంతి సందర్భంగా ఈ సరదా సంఘటనను గుర్తుచేసుకుంటే.. ఆమె నటన సాధారణ ప్రేక్షకుల్లో ఎంతటి ప్రభావం చూపిందో మరోసారి అర్థమవుతుంది.
[rare incident in actress suryakantham life, actress suryakantham jayanthi on october 28th, actress suryakantham characters, legendary actress suryakantham]




