జయమాలినిని కత్తితో బెదిరించిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగింది?
on Oct 11, 2024
సినిమా తారలంటే ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోలకు అభిమానులు ఉంటారు, హీరోయిన్లకూ అభిమానులు ఉంటారు. ఒకప్పుడు సినిమా వాళ్ళను తెరపై తప్ప మరో చోట చూసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మీడియా బాగా విస్తరించడం వల్ల అనేక మాధ్యమాల్లో వారిని చూస్తున్నారు, వారి మాటలు వింటున్నారు. అంతేకాదు, వివిధ ప్రాంతాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పత్రికలు తప్ప మరో మాధ్యమం లేని రోజుల్లో తెరపై మాత్రమే కనిపించే తమ అభిమాన తారలు బయట కనిపిస్తే పరిస్థితి ఎలా ఉండేది? ఐటమ్ సాంగ్స్ చేసే జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారిని ప్రత్యక్షంగా చూస్తే యూత్ ఎలా రెస్పాండ్ అవుతారు? అనేది జయమాలినికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.
సాధారణంగా ఐటమ్ సాంగ్స్ చేసే జ్యోతిలక్ష్మీ, జయమాలిని వంటి వారు స్టూడియోల్లో మాత్రమే షూటింగ్స్ ఎక్కువ చేసేవారు. ఔట్‌డోర్‌కి వెళ్ళే అవకాశం వారికి చాలా తక్కువ. అంతేకాదు, బయట జరిగే కొన్ని కార్యక్రమాలకు కూడా వాళ్ళు హాజరయ్యేవారు కాదు. అయితే ఒకసారి జయమాలిని ఒక ఊరిలో నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లారు. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. అయితే అది సినిమాలకు సంబంధించిన నాట్యం కాదు, భరతనాట్యం. జయమాలిని వంటి ఐటమ్ గర్ల్ అలాంటి డాన్స్ చేయడం జనానికి నచ్చలేదు. దీంతో పెద్ద పెద్దగా ఆరుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సినిమా పాటలకు డాన్స్ చెయ్యాలంటూ గోల చేశారు. జనం అంతా స్టేజ్‌ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి జారిపోతుండడంతో కార్యక్రమ నిర్వాహకులు, జయమాలిని సన్నిహితులు ఆమెను జాగ్రత్తగా హోటల్ రూమ్‌కి పంపించే ఏర్పాటు చేశారు. ఆమె కారుతో పాటు హోటల్‌కి కూడా జనం వచ్చేశారు.
ఈలోగా జనంలో నుంచి ఒక యువకుడు చేతిలో కత్తితో ముందుకు దూకాడు. అందర్నీ బెదిరిస్తూ ‘నేను జయమాలిని రూమ్‌కి వెళుతున్నాను. నాతోపాటు ఎవరైనా వచ్చారంటే పొడిచి చంపేస్తాను’ అన్నాడు. అక్కడితో ఆగకుండా జయమాలిని ఉన్న రూమ్‌లోకి బలవంతంగా ప్రవేశించాడు. ఆమెతోపాటు ఉన్నవారు భయంతో కేకలు వేశారు. దానికా యువకుడు ‘ఎవరూ భయపడొద్దు. మిమ్మల్ని ఏమీ చేయను. నేను కేవలం జయమాలినిని చూసేందుకే వచ్చాను. అందుకే జనాన్ని కత్తి చూపించి బెదిరించాను’ అంటూ జయమాలినిని దగ్గరకి రమ్మని పిలిచాడు. కాసేపు ఆమెను తేరిపార చూసి ‘మిమ్మల్ని దగ్గరగా చూడాలనుకున్నాను. నా కోరిక తీరింది’ అంటూ కత్తి తీసి లోపల పెట్టుకొని హోటల్ బయటికి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన కాసేపటికి పోలీసులు వచ్చి హోటల్ దగ్గర ఉన్న జనాన్ని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత జయమాలినికి రక్షణ కల్పిస్తూ హోటల్ వెనుక భాగం నుంచి బయటికి తీసుకెళ్ళి కారు ఎక్కించారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు లోనైన జయమాలిని ఆ తర్వాత నాట్య ప్రదర్శనలు ఇవ్వాలంటూ కొందరు కోరినా తిరస్కరించారు. అంతేకాదు, షూటింగ్‌ల కోసం కూడా బయటకి వచ్చేవారు కాదు. స్టూడియోల్లో షూటింగ్ అయితేనే సినిమా ఒప్పుకునేవారు. ఈ ఘటన ఎప్పుడు గుర్తొచ్చినా భయంతో వణికిపోతానని ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయమాలిని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



