ఒక సిద్ధాంతానికే కట్టుబడి సినిమాలు చేస్తున్న ఏకైక నటుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి!
on Dec 31, 2024
(డిసెంబర్ 31 ఆర్.నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా..)
ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరులోనే ఆవేశం కనిపిస్తుంది, అభ్యుదయ భావాలు కనిపిస్తాయి, అన్యాయాల్ని.. అక్రమాల్ని ఎదిరించే ధైర్యం కనిపిస్తుంది. ఏ స్టార్ హీరోకీ తీసిపోనంత ఇమేజ్ ఆయన సొంతం. ఆయన గురించి తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమా అంటే కేవలం కళ కోసమే కాదు, సామాజిక శ్రేయస్సు కోసం అని నమ్మిన మానవతా వాది. ఆయన సినిమాలకు ప్రజల గాధలే కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన సినిమాల్లోని పాత్రలు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీళ్ళను తెరపై ఆవిష్కరించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న విలక్షణమైన నటుడు. తన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన మొదటి సినిమా ‘అర్థరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు నిర్మించారు నారాయణమూర్తి. అందులో 15 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయినా కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్ళకుండా తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి అభ్యుదయ చిత్రాలే నిర్మించారు, నిర్మిస్తున్నారు. ఆ తరహా చిత్రాలకు కాలం చెల్లినా తన పంథా మాత్రం మార్చుకోలేదు. సమకాలీన సమస్యలను తీసుకొని వాటికి తెరరూపం ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణమూర్తి. ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అంతటి అభిమానగణం కలిగిన రెడ్డి నారాయణమూర్తి సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు? ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
1954 డిసెంబర్ 31న కాకినాడ జిల్లా మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు రెడ్డి నారాయణమూర్తి. తల్లి రెడ్డి చిట్టెమ్మ, తండ్రి చిన్నయ్యనాయుడు. రౌతులపూడిలో 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆయనకు సినిమాలపై ఆసక్తి కలిగింది. విపరీతంగా సినిమాలు చూసి హీరోలను అనుకరించేవారు. సినిమా నటుడు అవ్వాలన్న కోరిక చిన్నతనంలోనే కలిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కోరిక కూడా పెరిగింది. 1972లో ఇంటర్ పరీక్షలు అవ్వగానే తల్లిదండ్రులకు చెప్పి మద్రాస్ రైలెక్కేశారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది తప్ప అవకాశాలు ఎలా వస్తాయో తెలీదు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. పూట గడవడమే కష్టంగా మారిపోయింది. హోటల్‌లో పనిచేస్తానన్నా, రిక్షా తొక్కుతానన్నా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అలా పస్తులతోనే కాలం వెళ్ళదీస్తున్న సమయంలో రాజబాబు మేకప్‌మేన్ అయిన కృష్ణ అసిస్టెంట్ చిన్ని పరిచయమయ్యాడు. నారాయణమూర్తి పరిస్థితి తెలుసుకొని ఒక కారు షెడ్డులో వసతి కల్పించాడు. మరుసటి రోజు విక్రమ్ స్టూడియోకి రమ్మని చెప్పాడు చిన్ని. అక్కడ తాత మనవడు షూటింగ్ జరుగుతోంది. చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకనే అక్కడికి చేరుకున్నారు నారాయణమూర్తి. చాలా రోజులుగా పస్తులున్న ఆయనకు అక్కడ కడుపు నిండా భోజనం దొరికింది. అప్పుడు దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగారు. దానికాయన ‘నువ్వు ఇంకా చిన్నవాడివి. ఊరికి వెళ్లి డిగ్రీ పూర్తిచేసి రా. నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను’ అన్నారు. అదే సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ ఒక సినిమాలో వేషం ఉందని చెప్పాడు. వెంటనే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్లిపోయారు నారాయణమూర్తి. ‘నేరము శిక్ష’ చిత్రంలోని ఒక పాటలో 170 మందిలో ఒకడిగా నటించారు. దానికి పారితోషికంగా 36 రూపాయలు ఇచ్చారు. వాటిని తీసుకొని ఊరికి వచ్చేశారు. అక్కడ పడిన కష్టాలు గుర్తొచ్చి ఇక సినిమా ఇండస్ట్రీకి వెళ్లక్కర్లేదు అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు నేరము శిక్ష ఆ ఊరిలో రిలీజ్ అయింది. 170 మందిలో ఉన్నప్పటికీ ఊరి జనం నారాయణమూర్తిని గుర్తు పట్టారు. ఆయనకు రెడ్డి బాబులు అనేది ముద్దు పేరు. రెడ్డి బాబులు సినిమాలో కనిపించాడంటూ ప్రచారం పెరిగిపోవడంతో ఎంతో మంది పనిగట్టుకొని ఆ సినిమా చూశారు. అది నారాయణమూర్తిపై ప్రభావం చూపించింది. ఒక చిన్న పాత్ర చేస్తేనే తమ ఊరిలో ఇంత గుర్తింపు వచ్చింది. పెద్ద క్యారెక్టర్లు చేస్తే ఎంత పేరు వస్తుందో.. అనే ఆలోచనతోపాటు సినిమాల్లోకి మళ్ళీ వెళ్ళాలనే నిర్ణయం కూడా తీసేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి మళ్ళీ మద్రాస్ వెళ్లారు. దాసరి నారాయణరావు మాట ఇచ్చినట్టుగానే కృష్ణ కుమారుడు రమేష్‌బాబు హీరోగా నటించిన నీడ చిత్రంలో నారాయణమూర్తికి నక్సలైట్‌గా ఓ కీలక పాత్రను ఇచ్చారు. అయితే ఈ సినిమా చేసిన తర్వాత పెద్ద అవకాశాలు ఏమీ రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. అయితే తను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని నారాయణమూర్తి అనుకున్నారు.
తనే ఓ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా తనే నటించాలని నిర్ణయించుకున్నారు నారాయణమూర్తి. అయితే తన దగ్గర డబ్బులేదు. ఆయనకు స్నేహితులు చాలా ఎక్కువ. తను సినిమా చేయబోతున్న విషయం వారికి చెప్పారు. స్నేహితుడి కోసం వారంతా తోచిన ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బుతోనే సినిమాను ప్రారంభించారు. స్నేహితుల సాయంతో చేస్తున్న సినిమా కావడంతో తన బేనర్‌కు స్నేహచిత్ర అని పేరు పెట్టి ‘అర్థరాత్రి స్వతంత్రం’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించి నారాయణమూర్తికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరసగా దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, లాల్‌సలామ్, అడవి దివిటీలు, చీకటి సూర్యులు, ఎర్రోడు, ఊరు మనదిరా వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత నారాయణమూర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది దర్శకనిర్మాతలు విప్లవాత్మక చిత్రాలు నిర్మించారు. అభ్యుదయ చిత్రాల్లో నటించడం ద్వారా ఒక స్టార్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఏకైక నటుడు నారాయణమూర్తి. ఆయనకు ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఒసేయ్ రాములమ్మ చిత్రంలో దాసరి పోషించిన పాత్ర, టెంపర్ చిత్రంలో పోసాని చేసిన క్యారెక్టర్ కోసం మొదట నారాయణమూర్తినే అడిగారు. తను హీరోగానే నటిస్తానని, ఇతర పాత్రలు చేయనని చెప్పారు. అలా నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు ఒరేయ్ రిక్షా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. తన సినిమాలు గతంలో మాదిరిగా విజయాలు సాధించకపోయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
కాలేజీ రోజుల్లో నాయకత్వ లక్షణాలతో వుండేవారు నారాయణమూర్తి. పెద్దాపురంలో బి.ఎ. చదువుతున్న రోజుల్లో రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. ఈయన విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నారు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగానూ పనిచేశారు. నారాయణమూర్తి పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందు వలన పోలీసులు ఆయన్ని ఇంటరాగేట్ చేశారు. సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారు నారాయణమూర్తి. అప్పట్లో బీహార్‌లో వరద బాధితుల సహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డారు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా పిలిచేవారు.
వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ఎంతో సాదాసీదా కనిపిస్తారు నారాయణమూర్తి. ఎలాంటి ఆడంబరాలు ఆయన జీవితంలో కనిపించవు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నారో.. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడూ అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత వాహనం లేదు. కాలి నడక లేదా ఆటోలలో తన గమ్యానికి చేరుకుంటారు. అవసరమైతే విమానంలో ప్రయాణిస్తారు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు నారాయణమూర్తి. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం. వారి జీవన శైలి తన జీవన విధానానికి సరిపోదని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేదు. అప్పటి నుంచి అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే.. అది చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీ కాదని అంటారు. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి అడ్డు వస్తుందనే కారణంగానే పెళ్ళి చేసుకోలేదని చెప్పారు. నారాయణమూర్తికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడతారు గానీ అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. తెలుగుదేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా వాటిని సున్నితంగా తిరస్కరించారు నారాయణమూర్తి. తన జీవితం సినిమాలకే అంకితం అని చెప్తుంటారు. గతంలో ఎంతో మంది దర్శకనిర్మాతలు అభ్యుదయ చిత్రాలు చేశారు. కాలక్రమేణా వారు కమర్షియల్ చిత్రాలను కూడా నిర్మించారు. కానీ, నారాయణమూర్తి మాత్రం ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సినిమా కూడా చెయ్యలేదు. ఆయన సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ఉండవు, ద్వందార్థాలతో కూడిన మాటలకు అవకాశమే లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడమే నారాయణమూర్తికి తెలుసు. ఆ పద్ధతిలోనే ఎన్నో ఘనవిజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రేక్షకులే కాదు, సినిమా ఇండస్ట్రీలోని వారందరికీ నారాయణమూర్తి అంటే ఎంతో అభిమానం. అతని సినిమాల్లో చిన్న వేషం ఇచ్చినా చాలు, ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తామని స్టార్ హీరోలు సైతం అడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనూ ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నారాయణమూర్తి వంటి నటుడు మరొకరు లేరు అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Also Read