ENGLISH | TELUGU  

వైభవంగా జరుగుతున్న నటరత్న ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం ‘మనదేశం’ వజ్రోత్సవం! 

on Dec 14, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ సినీ చరిత్రలో యుగపురుషుడుగా నిలిచిపోయిన మహా నటుడు నటరత్న ఎన్‌.టి.రామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అద్వితీయమైన పాత్రలు పోషించి కళామతల్లికి విశిష్ట సేవలు అందించిన ఎన్‌.టి.రామరావు నటించిన తొలి సినిమా ‘మనదేశం’. ఈ చిత్రం 1949 నవంబర్‌ 24న విడుదలైంది. ఈ ఏడాది నవంబర్‌ 24కి ఈ సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్‌ వజ్రోత్సవాన్ని నిర్వహించాలని చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూరినాయుడు కన్నుమూసిన కారణంగా ఆ ఉత్సవాన్ని డిసెంబర్‌ 14 సాయంత్రం 5 గంటలకు ఎన్‌.టి.ఆర్‌. సినీ వజ్రోత్సవ కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ‘మనదేశం’ చిత్ర నిర్మాత కృష్ణవేణి, ఎం.పి. దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు, డి.సురేష్‌బాబు, నటి జయప్రద, హీరోలు నాగచైతన్య, అఖిల్‌, నటులు రాజేంద్రప్రసాద్‌, నటి ప్రభ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, ఎ.పి. ఫిలింఛాంబర్‌ అధ్యక్షులు భరత్‌భూషణ్‌ తదితరులు హాజరవుతున్నారు. ఎంతో ఘనంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం ‘మనదేశం’ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

అది 1946వ సంవత్సరం. సాతంత్య్రోద్యమం తారాస్థాయికి చేరింది. బ్రిటీష్‌ వారు మన నేతలకు నాయకత్వాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది మహనీయులు బ్రిటీష్‌ వారి కబంద హస్తాల నుంచి భారతదేశానికి సాతంత్య్రాన్ని సాధించేందుకు శ్రమించారు. అలాంటి వారి జీవితాలను నేపథ్యంగా తీసుకొని ఒక సినిమాను నిర్మించాలని భావించారు నటి కృష్ణవేణి. అదే విషయాన్ని తన భర్త, నిర్మాత మీర్జాపురం రాజాకి చెప్పారు. పౌరాణిక, జానపద, భక్తి చిత్రాలు రాజ్యమేలుతున్న ఆరోజుల్లో అలాంటి దేశభక్తి సినిమాను నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. కానీ, కృష్ణవేణి మాత్రం పట్టు వీడకుండా ఎం.ఆర్‌.ఎ. ప్రొడక్షన్స్‌ అనే కొత్త సంస్థను స్థాపించి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ‘మనదేశం’ చిత్రానికి మూలం బెంగాలీ నవల విప్రదాసు. దీన్ని శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ్‌ రచించారు. సాతంత్య్రం కోసం సర్వం అర్పించిన ఓ మధ్య తరగతి యువకుడి కథ అది. ఆ నవల ఆధారంగా సముద్రాల రాఘవాచార్యతో సినిమాకు అనుగుణంగా రచన చేయించారు. 

దర్శకుడిగా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే విషయంలో కృష్ణవేణి చాలా ఆలోచించి కె.ఎస్‌.ప్రకాశరావును ఎంపిక చేసుకున్నారు. అయితే అప్పటికి ఆయన దీక్ష అనే చిత్రం చేస్తున్నారు. ఆ కారణంగా ఎల్‌.వి.ప్రసాద్‌ పేరును సూచించారు. ఆయన అంతకుముందు ద్రోహి అనే సినిమాను రూపొందించారు. అలా మనదేశం చిత్రానికి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడయ్యారు. ఈ సినిమాలో కృష్ణవేణి కథానాయిక కాగా, సి.హెచ్‌.నారాయణరావు కథానాయకుడు, నాగయ్య ఓ కీలక పాత్ర పోషించారు. సినిమాలోని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర కోసం ఎన్‌.టి.రామారావు పేరును సూచించారు ఎల్‌.వి.ప్రసాద్‌. అంతకుముందే ఒక సినిమా కోసం స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన ఎల్‌.వి.ప్రసాద్‌ మనదేశం సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. ఎన్టీఆర్‌ సినిమాలో కనిపించేది కాసేపే అయినా ఎంతో కీలకమైన పాత్ర. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన ఒక మీటింగ్‌ జరుగుతుండగా కానిస్టేబుళ్ళతో అక్కడికి చేరుకుంటారు పోలీస్‌ ఆఫీసర్‌. ఆ మీటింగ్‌ జరగడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తాడు. కానీ, జనం వినకపోవడంతో లాఠీ చార్జ్‌ చేస్తారు. అయితే ఆ సమయంలో అది సినిమా షూటింగ్‌ అని మర్చిపోయిన ఎన్టీఆర్‌ అక్కడున్న జనాన్ని నిజంగానే లాఠీతో బాదేశారు. అలా షూటింగ్‌లో పాల్గొన్న చాలా మంది దెబ్బలు తిన్నారు. ఎన్టీఆర్‌ అంకిత భావం చూసిన హీరో సి.హెచ్‌.నారాయణరావు ఆయన్ని అభినందించి, భవిష్యత్తులో మీరు మంచి హీరో అవుతారు అని ఆశీర్వదించారు. ఈ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్‌కు రూ.250 పారితోషికంగా ఇచ్చారు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు కృష్ణవేణి ఎంతో గర్వంగా చెబుతారు. 

ఈ సినిమా ప్రారంభంలో, ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కథా నేపథ్యం గురించి వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. దాన్ని ఘంటసాలతో చెప్పించారు. అప్పటికి ఘంటసాల సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అంత ప్రాచుర్యంలో లేరు. ఇక ఈ సినిమాతోనే పి.లీల నేపథ్యగాయనిగా పరిచయమయ్యారు. జిక్కి ఈ సినిమాతో సింగర్‌గా బాగా బిజీ అయిపోయారు. ఇందులో మొత్తం 16 పాటలున్నాయి. 1946లో ప్రారంభమైన ఈ సినిమాను సాతంత్య్రం సిద్ధించే సమయానికి విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ, సినిమా నిర్మాణంలో జాప్యం, ఇంకా అనేక కారణాల వల్ల స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాలకు 1949లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్‌ 4 లక్షలు. 11 ప్రింట్లతో 1949 నవంబర్‌ 24న ఈ సినిమాను విడుదల చేశారు. దేశభక్తి కథాంశంతో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా నాలుగు వారాలు ప్రదర్శించబడింది. ఈ సినిమాలో నటించిన ప్రధాన నటీనటులు, సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు మనమధ్య లేరు. కానీ, ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడమే కాదు, ఎన్‌.టి.రామారావులాంటి మహా నటుడ్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి ఇంకా జీవించే వున్నారు. అంతేకాదు, డిసెంబర్‌ 24 ఆమె పుట్టినరోజు. దీంతో ఆమె 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.