Home

»

Featured News

హిట్లు, ఫ్లాపులతో సాగిన ప్రయాణం.. నాగచైతన్య కెరీర్‌లో ఆసక్తికర విశేషాలివే.!

Nov 23, 2026 11:37AM

(నవంబర్ 23 అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు నాగార్జున.. ఇలా రెండు తరాలుగా ప్రేక్షకులను అలరించిన ఈ కుటుంబం నుంచి వచ్చిన మరో నటుడు అక్కినేని నాగచైతన్య. నవంబర్ 23, 1986న నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటి దంపతులకు జన్మించిన ఆయన.. తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునల సినీ వారసత్వాన్ని చూస్తూ పెరిగారు. దీంతో ముంబైలో యాక్టింగ్ కోర్సు చేయడంతో పాటు, అమెరికాలోనూ నటన, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. తెలుగు ఉచ్చారణ, డైలాగ్ డెలివరీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు.

2009లో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జోష్‌’ సినిమాతో నాగచైతన్య హీరోగా పరిచయమయ్యారు. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్య అనే యువకుడి పాత్రలో కనిపించారు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, ఫిలింఫేర్‌ ఉత్తమ నూతన నటుడు అవార్డు, సినీమా అవార్డును అందుకున్నారు. అయితే ఆయన కెరీర్‌కు అసలైన మలుపు మాత్రం గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేశావే’. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ ప్రేమకథలో కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య చూపించిన నటన యువతను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా పాటలు, ప్రేమ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఆ తర్వాత ‘100% లవ్‌’లో తమన్నాతో కలిసి నటించి మరో విజయాన్ని అందుకున్నారు. ‘ద‌డ‌’, ‘బెజవాడ’, ‘తడాఖా’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘ఒక లైలా కోసం’, ‘దోచేయ్‌’ వంటి సినిమాలతో తన కెరీర్‌ను కొనసాగించారు.

2014లో వచ్చిన ‘మనం’ నాగచైతన్య కెరీర్‌లోనే కాదు, అక్కినేని కుటుంబ సినీ చరిత్రలోనూ ప్రత్యేకంగా నిలిచిపోయింది. తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునతో కలిసి ఒకే సినిమాలో నటించే అవకాశం ఆయనకు ఈ చిత్రం ద్వారా దక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి గాను నంది అవార్డుతో పాటు, సైమా క్రిటిక్స్‌ విభాగంలోనూ గుర్తింపు అందుకున్నారు. ఆ తర్వాత ‘ప్రేమమ్‌’లో విక్రమ్‌ పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘యుద్ధం శరణం’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘ప్రేమమ్‌’ సినిమాకు సంతోషం ఉత్తమ నటుడి అవార్డు, టీఎస్ఆర్‌-టీవీ9 అవార్డుల్లో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ‘మజిలీ’లో పూర్ణ పాత్ర, ‘లవ్‌స్టోరీ’లో రేవంత్‌ పాత్ర ఆయన నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ‘వెంకీమామ’, ‘బంగార్రాజు’ సినిమాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నాగచైతన్య. ఆమిర్‌ ఖాన్‌ నటించిన హిందీ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’తో తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లారు. ఇక విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘దూత’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. జర్నలిస్ట్‌ సాగర్‌ వర్మ పాత్రలో కనిపించిన ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. అయితే 2025లో విడుదలైన ‘తండేల్‌’ నాగచైతన్య కెరీర్‌లో మరో కీలకమైన సినిమాగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మత్స్యకారుడైన రాజు పాత్రను పోషించారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో నటనకు గాను 2025 సంవత్సరానికి తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. నాగచైతన్య, సమంత ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. ‘ఏ మాయ చేశావే’తో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళ్లతో పరిచయం ప్రేమగా మారింది. 2024 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ అదే ఏడాది డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. సినిమాల విషయంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తన నిర్ణయాలను తానే తీసుకోవడానికి ఇష్టపడే నాగచైతన్య.. తన తండ్రి, తాతల వారసత్వాన్ని గౌరవిస్తూనే సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. నటుడిగానే కాకుండా వ్యాపార రంగంలోనూ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రేమకథల నుంచి కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్‌ సినిమాలు, థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ల వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు చైత‌న్య‌. ప్రస్తుతం కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్నారు. సూపర్ నేచురల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 4, 2026న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

 

 

[NagaChaitanyaBirthday, NagaChaitanyaBiography, NagaChaitanyaCareer, NagaChaitanyaMovies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com