ENGLISH | TELUGU  

అంతటి అరుదైన ఘనత సాధించిన యుగపురుషుడు నటరత్న ఎన్‌.టి.రామారావు!

on Mar 29, 2024

66 సంవత్సరాల క్రితం మద్రాస్‌లో ఒక సినిమా విషయంలో అందరూ చర్చించుకున్నారు. సి.పులయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ చిత్రాన్ని తియ్యబోతున్నారు. అది కూడా రంగుల్లో... ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ సినిమా కోసం అంత విశేషంగా మాట్లాడుకోవడానికి కారణం. అప్పటివరకు తెలుగులో రంగుల చిత్రం అనే మాట లేదు. సౌత్‌ ఇండియాలో మొట్ట మొదటి కలర్‌ సినిమా తమిళ్‌లో వచ్చింది. ఎం.జి.ఆర్‌., భానుమతి జంటగా ఆలీబాబా 40 దొంగలు కథతో ఆ సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు తొలి కలర్‌ సినిమా తనే అందించాలని ఎ.శంకరరెడ్డి నిర్ణయించుకున్నారు. 1958 మార్చి 5న వాహిని స్టూడియోలో ‘లవకుశ’ చిత్రం ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామపట్టాభిషేకం సన్నివేశాన్ని ఓపెనింగ్‌ షాట్‌గా తీశారు.

ఉత్తర రామాయణం ఆధారంగా 1934లోనే ‘లవకుశ’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి కూడా సి.పుల్లయ్యే దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సీనియర్‌ శ్రీరంజని సీతగా నటించారు. ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్‌ అయిన 24 సంవత్సరాల తర్వాత చేసే ఈ ‘లవకుశ’లో ఏం ప్రత్యేకత చూపిస్తాం అని ఆలోచించిన దర్శకుడు పుల్లయ్య, శంకరరెడ్డిలకు రంగుల్లో తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. కలర్‌లోనే సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు శంకరరెడ్డి. అప్పటికి దేశంలోకి ఈస్ట్‌మన్‌కలర్‌ రాలేదు. గేవా కలర్‌ఫిల్మ్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. దానితోనే సినిమాను ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి చేద్దామని స్టార్ట్‌ చేస్తే ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ ఐదేళ్ళలో బడ్జెట్‌ పరంగా వచ్చిన సమస్యల వల్ల కొంతకాలం షూటింగ్‌ ఆగిపోయింది. తిరిగి ప్రారంభించడానికి శంకరరెడ్డి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనకడుగు వేయకుండా విజయవంతంగా సినిమా పూర్తి చేశారు శంకరరెడ్డి. భూకైలాస్‌, సీతారామకళ్యాణం చిత్రాల్లో రావణాసురుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎన్‌.టి.రామారావు ఈ సినిమాలో రాముడిగా అవతారమెత్తారు. అయితే సీత పాత్రకు అంజలీదేవిని ఎంపిక చేయడాన్ని అందరూ వ్యతిరేకించారు. నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం కూడా శంకరరెడ్డి, పుల్లయ్యలను కలిసి.. డాన్సులు చేసే అమ్మాయిని సీతగా చూపిస్తే ఏం బాగుంటుంది, వేరే అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చింది. కానీ, పుల్లయ్య ఆ మాటలు పట్టించుకోకుండా అంజలీదేవితోనే సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అలా ఎన్నో విమర్శలు ఎదుర్కొని సీత పాత్ర పోషించారు అంజలి. ఆ తర్వాత ‘లవకుశ’ ప్రివ్యూ చూసి అంజలి దగ్గరకు వెళ్లి ‘అమ్మా సీతమ్మ తల్లీ! తప్పయిపోయింది. క్షమించు అంజమ్మా’ అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు లక్ష్మీరాజ్యం. 

ఉత్తర రామాయణాన్ని తీసుకొని పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ‘లవకుశ’గా తెరకెక్కించారు సి. పుల్లయ్య, ఆయన తనయుడు సి.ఎస్‌.రావు. 3 గంటల 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో 1 గంట 45 నిమిషాలపాటు 36 పాటలు, పద్యాలతో వీనుల విందు చేశారు ఘంటసాల. ఈ సినిమాలో ఎంతో పాపులర్‌ అయిన ‘వల్లనోరి మామా నీ పిల్లను..’ అనే పాట మొదట సినిమాలో లేదు. పంపిణీదారులకు ఈ సినిమాను చూపిస్తే వారు ఒక సలహా చెప్పారు. సినిమా చాలా బాగుంది. అయితే వినోదం కోసం రేలంగి, గిరిజలపై ఒక పాట పెడితే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు ఆ పాటను వారిద్దరిపై చిత్రీకరించి జత చేశారు. ఇంత మంచి సినిమాలో నటించడం మహాభాగ్యంగా భావిస్తున్నామంటూ రేలంగి, గిరిజ ఈ సినిమాలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదు. సినిమా చివరి దశలో ఉన్నప్పుడే సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయన తనయుడు సి.ఎస్‌.రావు దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సినిమాను పూర్తి చేశారు. 

1963 మార్చి 29న ‘లవకుశ’ విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకొని మరీ వచ్చి సినిమా చూశారు. ఎ, బి, సి అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ‘లవకుశ’ అలరించింది. 62 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శితమైంది. 18 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. ఆరోజుల్లో 75 వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ఘనత ‘లవకుశ’ చిత్రానికే దక్కింది. ఈ సినిమా కంటే ముందు ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్‌’ చిత్రాలదే కలెక్షన్లపరంగా రికార్డు ఉండేది. ఆ రికార్డును ‘లవకుశ’ క్రాస్‌ చేసింది. తమిళ్‌ వెర్షన్‌ కూడా సూపర్‌హిట్‌ అయింది. అక్కడ కూడా 40 వారాలు ఈ సినిమాను ప్రదర్శించారు. హిందీలోకి డబ్‌ చేసే అక్కడ కూడా 25 వారాలు నడిచింది. భారతదేశ సినీ చరిత్రలో ఒక హీరో నటించిన పాతాళభైరవి, లవకుశ చిత్రాలు మూడు భాషల్లో ఘనవిజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్‌ విషయంలోనే జరిగింది. అలాగే ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, తమిళ చిత్రం కర్ణన్‌ వంటి అవార్డు చిత్రాల్లో నటించినందుకు రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ప్రశంసా పత్రం అందుకున్నారు ఎన్టీఆర్‌. 

ఇక ‘లవకుశ’ సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే.. అప్పట్లో టిక్కెట్‌ ధర కేవలం పావలా నుంచి రూపాయి వరకు ఉండేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనాభా 3 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన సినిమా ‘లవకుశ’. అలాగే 100 కేంద్రాల్లో ఉన్న జనాభాకి దాదాపు నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దీన్ని బట్టి సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ ఎలా వచ్చేవారో అర్థమవుతుంది. అంతటి ఆదరణ ఇప్పటి సినిమాలకు వస్తే  కలెక్షన్లు వేల కోట్ల రూపాయల్లో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఈ సినిమాలో నటించిన వారంతా మహామహులే. ముఖ్యంగా శ్రీరాముడిగా ఎన్టీఆర్‌, సీతగా అంజలీదేవి నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరికీ పాదాభివందనం చేసి హారతులు ఇచ్చి వారిని దైవసమానులుగా భావించేవారు జనం. దాదాపు 49 సంవత్సరాల తర్వాత ఎన్‌.టి.రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతగా బాపు దర్శకత్వంలో ఇదే కథను ‘శ్రీరామరాజ్యం’గా తెరకెక్కించారు. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుందీ చిత్రం. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.