చివరి రోజుల్లో కుటుంబ పోషణ కోసం సీరియల్స్‌లో నటించిన సుత్తి వేలు!
on Jul 22, 2021
తెలుగు సినిమాల్లో సుత్తి జంటది ఒక ప్రత్యేక ముద్ర. సుత్తి వీరభద్రరావు, ఆయన అసిస్టెంట్‌గా సుత్తి వేలు ఎన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని తమ సుత్తితో నవ్వించారో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరిలో వీరభద్రరావు త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లగా, ఆ తర్వాత వేలు ఇటు కామెడీ పాత్రలతోనే కాకుండా అటు వైవిధ్యమైన పాత్రలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. 'ప్రతిఘటన'లో పిచ్చివాడిగా మారిన పోలీస్ కానిస్టేబుల్‌గా వేలు నటన గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆ ఒక్క పాత్రతో వేలు తన నటనలోని మరో కోణాన్ని అద్భుతంగా చూపించారు.
వీరభద్రరావును గురువుగా భావించే వేలు.. ఆయన మరణంతో చాలా కుంగిపోయారు. ఆ తర్వాత తనను 'ముద్ద మందారం'తో సినీ నటుడిగా పరిచయం చేసి, 'నాలుగు స్తంభాలాట'తో సుత్తి వేలుగా పాపులారిటీ కల్పించిన దర్శకుడు జంధ్యాల కన్నుమూయడంతో మరింత బాధకు లోనయ్యారు. మద్రాసులో ఉన్నంత కాలమూ వేలుకు తిరుగులేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే తెలుగు చిత్రసీమ హైదరాబాద్‌కు తరలివచ్చిందో.. అప్పట్నుంచి ఆయనకు కష్ట కాలం మొదలైందనే చెప్పాలి. మునుపటి ప్రాభవాన్ని ఆయన కోల్పోయారు. ఎంత కష్టపడినా, ఆయనకు ఫలితం దక్కలేదు.
సినిమా అవకాశాలు బాగా తగ్గిపోవడంతో ఒకానొక దశలో ఆయనకు కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా పరిణమించింది. భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకును పోషించడానికి తప్పనిసరిగా టీవీ సీరియల్స్‌ను ఆశ్రయించారు. అంతకుముందు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ సీరియల్ 'ఆనందో బ్రహ్మ'లో తెగ నవ్వించిన వేలు, చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టీవీ సీరియల్స్‌లో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలను కూడా చేశారు. జీవన పోరాటంలో అలిసిపోయిన ఆయన 66 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబర్‌లో కన్నుమూశారు. అప్పటికే ఆయన పళ్లు ఊడిపోయి, 70 ఏళ్లకు పైగా వయసుంటుందనే విధంగా మారిపోయారు.
కామెడీ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగి, ప్రతిఘటన, వందేమాతరం, ఈ చదువులు మాకొద్దు, ఒసేయ్ రాములమ్మా లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుని, ప్రతిభావంతుడైన నటుడిగా పేరుపొందిన వేలు ఆఖరి రోజుల్లో ఆర్థిక కష్టాలకు గురికావడం మాత్రం ఎంతైనా శోచనీయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
