చిరంజీవి సినిమా వల్ల మోసపోయిన కృష్ణంరాజు.. ఏం జరిగింది?
on Jan 19, 2026
(జనవరి 20 కృష్ణంరాజు జయంతి సందర్భంగా..)
1989 ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. రెబల్‌స్టార్‌గా ఎన్నో యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణంరాజుకి ఆ సమయంలో సినిమాలు తగ్గుముఖం పట్టాయి. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. అప్పటికి కామెడీ సినిమాల దర్శకుడిగా రేలంగి నరసింహారావుకు మంచి పేరు ఉంది.
ఒకరోజు కృష్ణంరాజు నుంచి రేలంగి నరసింహారావుకు పిలుపొచ్చింది. ఓ హోటల్‌లో ఆయన్ని కలుసుకున్నారు. తమ బేనర్‌లో ఒక సినిమా చెయ్యాలని రేలంగిని అడిగారు కృష్ణంరాజు. తను కామెడీ సినిమాలు చేసే డైరెక్టర్‌నని, యాక్షన్ సినిమాలపై తనకు అంత పట్టులేదని చెప్పారు రేలంగి. అయినా సరే ఒక సినిమా చెయ్యమన్నారు. రేలంగి ఓకే చెప్పారు. ఒక రైటర్ చెప్పిన కథను విన్నారు కృష్ణంరాజు, రేలంగి, సూర్యనారాయణరాజు. కథ ముగ్గురికీ బాగా నచ్చింది.
సినిమా స్టార్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పాటల రికార్డింగ్‌కి ముహూర్తం పెట్టారు. మరో వారం రోజుల్లో పాటల రికార్డింగ్. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ హీరోగా చిక్కడు దొరకడు సినిమా చేస్తున్నారు రేలంగి. ఆ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. దాంతో ఆ చిత్ర నిర్మాతలు రేలంగిని పిలిచారు. కృష్ణంరాజు దగ్గర రెండు రోజులు పర్మిషన్ తీసుకొని చిక్కడు దొరకడు సినిమా రిలీజ్ కోసం వెళ్లారు రేలంగి.
సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత రేలంగి, ఆ చిత్ర నిర్మాత వెంకన్నబాబు, కెమెరామెన్ శరత్ హోటల్ రూమ్‌లో రిలాక్స్ అవుతున్నారు. ఆ సమయంలోనే కృష్ణంరాజుతో చేస్తున్న సినిమా గురించి అడిగారు వెంకన్నబాబు. ఆ కథను చెప్పడం మొదలుపెట్టారు రేలంగి. సడన్‌గా కెమెరామెన్ శరత్ అడ్డు తగిలి ఈ కథ తనకు తెలుసు అన్నారు. దానికి రేలంగి ఆశ్చర్యపోయి ‘ఎలా తెలుసు?’ అని అడిగారు. ‘ఆ సినిమాకి నేను పనిచేశాను’ అని బాంబు పేల్చాడు శరత్.
చిరంజీవి, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాతకుడు’ సినిమా కథ అది. రేలంగి మొదట నమ్మలేదు. మద్రాస్ వెళ్లిన తర్వాత ఆ సినిమా క్యాసెట్ తెప్పించుకొని చూసి షాక్ అయ్యారు. ‘కిరాతకుడు’ సినిమా కథనే కృష్ణంరాజు సినిమా కోసం చెప్పాడు ఆ రైటర్. అదే విషయాన్ని కృష్ణంరాజు చెప్పారు రేలంగి. మొదట నమ్మలేదుగానీ ఆయన కూడా సినిమా చూసి కన్‌ఫర్మ్ చేసుకున్నారు తాను మోసపోయానని. అయితే మరుసటి రోజే పాటల రికార్డింగ్ పెట్టుకున్నారు. మొదట ఆ ప్రాజెక్ట్ ఆపేద్దామని అనుకున్నప్పటికీ అన్ని సినిమాల్లో డూయెట్లు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి.. రికార్డింగ్ ఆపొద్దని చెప్పారు కృష్ణంరాజు.
మరో కథ కోసం వెతుకులాట మొదలుపెట్టారు రేలంగి. అదే సమయంలో ఓంకార్ దగ్గర ఒక కథ ఉందని తెలిసి దాన్ని వినిపించమన్నారు. అది అందరికీ బాగా నచ్చింది. ఆ కథతోనే కృష్ణంరాజు, రేలంగి నరసింహారావు కాంబినేషన్‌లో సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు ‘యమధర్మరాజు’. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. కానీ, చిరంజీవి సినిమా వల్ల జరిగిన మోసాన్ని మాత్రం అంత త్వరగా మర్చిపోలేకపోయారు కృష్ణంరాజు, రేలంగి నరసింహారావు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



