'గూఢచారి 116'కు హీరో కావాలంటే కృష్ణ బదులు రామ్మోహన్‌ను పంపిన ఆదుర్తి!
on Jul 7, 2021
ఇండియాలోనే తొలి జేమ్స్‌బాండ్ సినిమా హీరోగా ఎవరికీ దక్కని అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. 'గూఢచారి 116'తో ఆయన ఈ ఘనత సాధించారు. అందుకే ఆ తర్వాత కాలంలో 'ఆంధ్రా జేమ్స్‌బాండ్' అన్న ఖ్యాతి పొందారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఆయన హీరోగా పరిచయం అయిన 'తేనె మనసులు' సినిమాయే 'గూఢచారి 116'లో నటించే అవకాశం ఆయనకు కల్పించిందనే విషయం చాలామందికి తెలీదు.
'తేనె మనసులు' సినిమాలో కృష్ణకు స్కూటర్‌తో కారును చేజ్ చేస్తూ, స్కూటర్‌ను అలాగే వదిలేసి కారులోకి జంప్ చేసే సీన్ ఒకటుంది. డూప్ లేకుండా ఆ సీన్‌లో నటించారు కృష్ణ. ఆయన సాహసం నిర్మాత డూండీని బాగా ఆకట్టుకుంది. అందుకే ఎం. మల్లికార్జునరావు డైరెక్షన్‌లో 'గూఢచారి 116' సినిమా తియ్యాలని డూండీ అనుకున్నప్పుడు ఆయన మనసులో మెదిలింది కృష్ణే. 'పానిక్ ఇన్ బ్యాంకాక్' మూవీ ఆధారంగా ఆరుద్ర రాసిన కథలో జేమ్స్‌బాండ్ క్యారెక్టర్‌కు కృష్ణ సరిగ్గా సరిపోతారనీ, జేమ్స్‌బాండ్ చేసే సాహసాలు ఆయన బాగా చేస్తాడనీ డూండీకి అనిపించింది.
ఒకరోజు ఆదుర్తి సుబ్బారావుకు ఫోన్ చేసి, "మీ హీరోతో సినిమా తియ్యాలనుకుంటున్నాను. అతన్ని మా ఆఫీసుకు పంపిస్తారా?" అనడిగారు డూండీ. 'తేనె మనసులు'లో మెయిన్ హీరోగా నటించిన రామ్మోహన్‌ను అడుగుతున్నారనుకొని ఆయన్ని పంపించారు ఆదుర్తి. రామ్మోహన్ రావడంతో డూండీకి తాను చేసిన పొరపాటు అర్థమైంది. అప్పటికి ఆయనతో అవీ ఇవీ మాట్లాడి పంపించేసి, మళ్లీ ఆదుర్తికి ఫోన్ చేశారు. "రామ్మోహన్ కాదండీ.. కృష్ణ అని మరో హీరో ఉన్నాడు కదా.. అతను కావాలి నాకు" అని చెప్పారు. అప్పుడు కృష్ణను పంపించారు ఆదుర్తి.
కృష్ణ తమ ఆఫీసుకు రాగానే, "మా సినిమాలో నిన్ను హీరోగా బుక్ చేశామయ్యా.. జేమ్స్‌బాండ్ వేషం" అని చెప్పి, అప్పటికప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు డూండీ. అలా హీరోగా తన మూడో సినిమాలో 'గూఢచారి 116'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు కృష్ణ. ఆయనకు అభిమానులు ఏర్పడడం మొదలైంది ఈ సినిమాతోటే.
Also Read