బ్రహ్మానందం ఆ షో చెయ్యకపోతే జంధ్యాల కంట్లో పడివుండేవారు కాదు!
on Nov 12, 2021

ఒక పనిపై 1984 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చారు బ్రహ్మానందం. అప్పుడాయన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా నాటకాలు ఆడుతున్నారు. మిమిక్రీలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయనకు ప్రముఖ రచయిత ఆదివిష్ణు పరిచయమయ్యారు. బ్రహ్మానందంలోని హాస్యప్రియత్వాన్ని ఆయన గమనించి దూరదర్శన్‌లో 'పకపకలు' అనే కార్యక్రమంలో చెయ్యమన్నారు. బ్రహ్మానందం చేశారు. ఆ కార్యక్రమానికి మంచి పేరు వచ్చింది. ఇదే ప్రోగ్రామ్‌ను జంధ్యాల చూశారు. ఆయనకు బ్రహ్మానందం కామెడీ బాగా నచ్చింది. కబురు పంపారు. వెళ్లి కలిశారు బ్రహ్మానందం. 'సత్యాగ్రహం' అనే చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు జంధ్యాల.
నేనేంటీ, సినిమాల్లో నటించడమేంటని కాస్త భయపడ్డారు బ్రహ్మానందం. "మరేం ఫర్వాలేదు, నేనెలా చెబితే అలా చెయ్యి" అని జంధ్యాల భరోసా ఇచ్చారు. అంతకుముందు డ్రామాలు, మిమిక్రీలూ చేసిన అనుభవం ఉండటం వల్ల కెమెరా ముందు నటన అంటే ఆయనకు భయం వెయ్యలేదు. 'సత్యాగ్రహం' సినిమా మొదలు కాకముందే 'శ్రీ తాతావతారం' అనే మరో మూవీలో ఛాన్స్ వచ్చింది. అప్పటికి ఇంకా అత్తిలి కాలేజీలో పనిచేస్తూనే ఉన్నారు. నటుడిగా తెరపరిచయమైన మూడో సంవత్సరం జంధ్యాల దర్శకత్వంలో 'అహ నా పెళ్లంట' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో చేసిన 'అరగుండు' పాత్ర ఆయన జీవితాన్నే మార్చేసింది. దాంతో బ్రహ్మానందం పేరు మారుమోగిపోయింది.
ఆ సినిమా చూడ్డానికి విజయవాడలోని ఓ థియేటర్‌కు వెళ్లారాయన. ఆ రోజుల్లో తనను తాను తెరమీద చూసుకోవడమే ఆయనకు ఓ అద్భుతం. అలాంటిది తనను చూసి ప్రేక్షకులు విరగబడి నవ్వుతుండటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అక్కడ్నుంచి ఆయనను ఎంతోమంది పెద్ద పెద్ద దర్శకులూ, నిర్మాతలూ, నటులూ ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు. అలా లెజెండరీ కమెడియన్ స్థాయికి ఎదిగారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



