వైవిధ్యమైన కథలకు, స్క్రీన్‌ప్లేకు పెట్టింది పేరు కె.భాగ్యరాజ్!
on Jan 7, 2025
(జనవరి 7 దర్శకుడు కె.భాగ్యరాజ్ పుట్టినరోజు సందర్భంగా..)
ఏ సినిమాకైనా ప్రధానంగా కావాల్సింది చక్కని కథ, కథనం. గతంలో దర్శకనిర్మాతలు కేవలం కథను నమ్ముకొని సినిమాలు చేసేవారు. అయితే రాను రాను కథ, కథనాల మీద దర్శకులకు శ్రద్ధ తగ్గింది. సినిమా ఎంత హంగూ ఆర్భాటంగా ఉంటే అంత గొప్ప సినిమా అనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే అవేవీ సినిమాను బ్రతికించలేవని ఎప్పటికప్పుడు కొన్ని సినిమాల ఫలితాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఎవరేమన్నా సినిమాకి మూలస్తంభం కథే. అలాంటి కథలతో ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం. తన సినిమాలతో ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న భాగ్యరాజ్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ అయ్యాయి.
1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు. 1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్.