ENGLISH | TELUGU  

ఒక్క ఫ్లాప్‌తో 13 మంది నిర్మాతలు వెనక్కి తగ్గారు.. అప్పుడు దాసరి ఏం చేశారో తెలుసా?

on May 3, 2025

(మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా..) 

1950 నుంచి 1970 వరకు కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డ్డి, హెచ్‌.ఎం.రెడ్డి, ఎల్‌.వి.ప్రసాద్‌, కె.ఎస్‌.ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శకులు తెలుగు సినిమాకి వన్నె తెచ్చారు. ఆ తర్వాతి తరంలో దర్శకుడిగా పరిచయమైన దాసరి నారాయణరావు పాతతరం దర్శకుల లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకొని ఎన్నో వైవిధ్యమైన సినిమాలను రూపొందించి దర్శకరత్నగా అవతరించారు. దాసరి స్పృశించని కథాంశం లేదు అంటే అతిశయోక్తి కాదు. స్టార్‌ హీరోతో చేసినా, అంతా కొత్తవారితో చేసినా తన సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయాలి అనే లక్ష్యంతోనే సినిమాలు చేసేవారు. ఒక దశలో తెలుగు సినిమాని శాసించారు. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా దర్శకుడికి స్టార్‌ హోదాను తీసుకొచ్చిన ఘనత దర్శకరత్న దాసరికే దక్కుతుంది. 

1942 మే 4న పాలకొల్లులో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు దాసరి. తనకు చదువు చెప్పించే స్తోమత తండ్రికి లేకపోవడంతో ఒక మాస్టారి సహాయంతో చదువుకున్నారు. చిన్నతనం నుంచే నటన పట్ల, రచన పట్ల ఆయనకు అభిరుచి ఉండేది. ఎన్నో నాటకాలు రచించడమే కాకుండా నటించారు కూడా. ఆ తర్వాత నటుడిగా స్థిరపడాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ రైలెక్కారు. కానీ, ఆయనకు మొదట రచయితగానే అవకాశం వచ్చింది. దాదాపు పాతిక సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేసిన తర్వాత 1970లో ‘జగత్‌ జెట్టీలు’ చిత్రంలో మాటల రచయితగా తొలిసారి తెరపై దాసరి పేరు కనిపించింది. అలాగే ఈ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కె.రాఘవ ఆ తర్వాత 1973లో ‘తాత మనవడు’ చిత్రంతో దాసరిని దర్శకుడిగా పరిచయం చేశారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు దాసరి. ఆ తర్వాత సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయారు. నాలుగు సంవత్సరాల్లో దాదాపు 20 సినిమాలు చేసిన దాసరితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేవారు. 2014లో వచ్చిన ‘ఎర్రబస్సు’ దర్శకుడిగా ఆయన చివరి సినిమా. 1970వ దశకం నుంచి దాదాపు అందరు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు దాసరి. తన 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటుడిగా కూడా తన ప్రతిభ కనబరిచి ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నారు. 

సినిమా రంగంలో ఎంత టాలెంట్‌ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్‌లో లేకపోతే అప్పటివరకు సినిమాలు చెయ్యమని వెంట తిరిగిన వారు కూడా మొహం చాటేస్తుంటారు. దర్శకుడిగా అద్భుతమైన సినిమాలు చేసిన దాసరికి కెరీర్‌ ప్రారంభంలో అలాంటి ఓ చేదు అనుభవం ఎదురైంది. తాత మనవడు తర్వాత దర్శకుడిగా బిజీ అయిపోయిన దాసరి.. చాలా సినిమాలు కమిట్‌ అయి ఉన్నారు. ఆ క్రమంలోనే 1977లో చేసిన జీవితమే ఒక నాటకం సినిమా పెద్ద ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. అప్పటికి 13 మంది నిర్మాతలు దాసరితో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో తాము ఇచ్చిన అడ్వాన్స్‌ వెనక్కి ఇవ్వమని అడిగారు. వారికి తిరిగి ఇవ్వడానికి సమయానికి డబ్బు లేకపోవడంతో తన భార్య నగలు తాకట్టుపెట్టి ఆ నిర్మాతలకు సెటిల్‌ చేశారు దాసరి. 

తనతో సినిమా చెయ్యాలని ఎదురుచూసిన నిర్మాతలంతా వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నారు దాసరి. ఆ సమయంలోనే నిర్మాత వడ్డే రమేష్‌ ఆయన దగ్గరకి వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో అంతకుముందు పాడవోయి భారతీయుడా అనే సినిమా చేశారు. ఆ సినిమా డిజాస్టర్‌ అయినప్పటికీ మరో సినిమా చెయ్యమని దాసరిని అడిగారు రమేష్‌. ఆ మాట విని దాసరి ఆశ్చర్యపోయారు. ‘అందరూ అడ్వాన్స్‌లు వెనక్కి తీసుకుంటే నువ్వేంటి సినిమా చెయ్యమంటున్నావు’ అని అడిగారు. దానికి రమేష్‌ ‘వాళ్లంతా నిజమైన నిర్మాతలు కాదు. ఒక సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన ఏ దర్శకుడ్నీ తక్కువ చేయలేం. ఇకపై మా బేనర్‌లో చేసే ప్రతి సినిమాకీ మీరే డైరెక్టర్‌’ అన్నారు. 

అప్పుడు తను ఉన్న పరిస్థితిలో తప్పకుండా ఒక భారీ హిట్‌ కొట్టి తీరాలని డిసైడ్‌ అయ్యారు దాసరి. అప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఓ కథతో స్క్రిప్ట్‌ రెడీ చేశారు. ఆ కథను మొదట కృష్ణకు వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ప్రారంభించాలనుకుంటున్న సమయంలో కృష్ణ మరొకరికి అత్యవసరంగా సినిమా చెయ్యాల్సి వచ్చింది. అయితే తను ఇచ్చిన డేట్స్‌లోనే రోజుకి రెండు షిఫ్టుల్లో రెండు సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారు కృష్ణ. అయితే దానికి వడ్డే రమేష్‌ ఒప్పుకోలేదు. తమకి ఇచ్చిన డేట్స్‌ని ఆ నిర్మాతకే ఇవ్వమని కృష్ణకు చెప్పారు రమేష్‌. అప్పుడు తన మిత్రుడైన కృష్ణంరాజును కలిసి సినిమా చెయ్యమని అడిగారు. ఆయన ఒప్పుకోవడంతో దాసరితో కథ చెప్పించారు. కృష్ణంరాజుకు కూడా కథ బాగా నచ్చింది. అదే ‘కటకటాల రుద్రయ్య’. భారతంలోని కర్ణుడి పాత్రను తీసుకొని సోషలైజ్‌ చేసి అద్భుతమైన కథను రాశారు దాసరి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ అలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయని కృష్ణంరాజుకు అది వెరైటీ అయింది. రుద్రయ్య పాత్రను పూర్తిగా అవగతం చేసుకున్న ఆయన ఆ పాత్రలో జీవించారు. 

హీరో అంటే క్లీన్‌గా, నీట్‌గా ఉండడమే అప్పటి ప్రేక్షకులకు తెలుసు. కానీ, కటకటాల రుద్రయ్య చిత్రంలో కృష్ణంరాజు ఎంతో రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తారు. పెర్‌ఫార్మెన్స్‌గానీ, డైలాగులుగానీ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అవి ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఈ సినిమాతో తన సత్తా ఏమిటో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు దాసరి. ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన జయసుధ, జయచిత్ర, జమున నటించారు. జె.వి.రాఘవులు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. దాసరి నారాయణరావుపై ఉన్న నమ్మకంతో సినిమా చేసేందుకు ముందుకొచ్చిన వడ్డే రమేష్‌కి కటకటాల రుద్రయ్య చాలా పెద్ద హిట్‌ సినిమా అయింది. రూ.18 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపు కోటి రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటివరకు అలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయకపోవడం వల్ల ఈ సినిమాతో కృష్ణంరాజు ఇమేజ్‌ మరింత పెరిగి రెబల్‌స్టార్‌ అయ్యారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి తెలుసుకున్న నటరత్న ఎన్‌.టి.రామారావు దర్శకనిర్మాతలను పిలిచి అభినందించారు. అలా దాసరి, వడ్డే రమేష్‌ ఇద్దరూ కలిసి రంగూన్‌ రౌడీ, బొబ్బిలిపులి, విశ్వనాథనాయకుడు, లంకేశ్వరుడు వంటి సినిమాలను నిర్మించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.