ENGLISH | TELUGU  

తెలుగులో బ్లాక్‌బస్టర్‌.. మరో నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తే.. అక్కడా బంపర్‌హిట్‌!

on Apr 6, 2024

కొన్ని బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ వెనుక ఎన్నో కథలు ఉంటాయి, మరెన్నో విశేషాలు ఉంటాయి. అలాంటి ఒక సినిమా సెట్‌ కావడం వెనుక, స్టార్ట్‌ అవ్వడం వెనుక ఎదురైన అవాంతరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ కలిసొస్తేనే ఒక బ్లాక్‌బస్టర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2006లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సూపర్‌స్టార్‌ మహేష్‌, పూరి జగన్నాథ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా క్రేజ్‌ పరంగా, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్‌ అంశాలు ఉన్నాయి. అవేమిటో, ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అవ్వడానికి ఎంత కాలం పట్టిందో తెలుసుకుందాం. 

‘బద్రి’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన పూరి జగన్నాథ్‌ ఆ తర్వాత నాలుగైదు సూపర్‌హిట్‌ సినిమాలు చేసి డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసే డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వరస విజయాలతో దూసుకెళ్తున్న పూరికి ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్‌ అవ్వడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బద్రి టైమ్‌లోనే రాసుకున్న ఓ స్క్రిప్ట్‌ని బయటికి తీశాడు. దానికి ‘ఉత్తమ్‌సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ’ అనే టైటిల్‌ పెట్టుకున్నాడు. ఆ కథ విన్న రవితేజ చాలా ఎక్సైట్‌ అయ్యాడు. చేసేద్దాం అన్నాడు ఉత్సాహంగా. ఈ సినిమా చేసేందుకు నిర్మాత నాగబాబు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే అదే టైమ్‌లో రవితేజకు ‘ఆటోగ్రాఫ్‌’ చేసే మంచి ఛాన్స్‌ వచ్చింది. ఈ విషయం పూరికి చెప్పి ఆ ప్రాజెక్ట్‌కి షిప్ట్‌ అయిపోయాడు. ఈ గ్యాప్‌లో పూరి తన తమ్ముడు సాయిరామ్‌శంకర్‌తో ‘143’ చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా రిలీజ్‌ అయింది. కానీ, రవితేజ మాత్రం ఖాళీగా లేడు. ఒక దశలో బాలీవుడ్‌ యాక్టర్‌ సోనుసూద్‌తో ఉత్తమ్‌సింగ్‌ సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ, కుదరలేదు. 2004లో ఒకసారి తాజ్‌ హోటల్‌లో పూరి, మహేష్‌ కలిశారు. అంతకు మూడేళ్ళ క్రితం మహేష్‌కి ‘ఇడియట్‌’ కథ చెప్పాడు పూరి. అది మహేష్‌కి నచ్చలేదు. అతనితో ఇది రెండో మీటింగ్‌. ఈసారి ఉత్తమ్‌సింగ్‌ కథ చెప్పాడు. మహేష్‌కి కథ నచ్చింది. నెక్స్‌ట్‌ ఇయర్‌ స్టార్ట్‌ చేద్దాం అంటూ సిఖ్‌ బ్యాక్‌డ్రాప్‌ మార్చమని చెప్పాడు. అలాగే ఉత్తమ్‌సింగ్‌ అనే టైటిల్‌ మహేష్‌కి నచ్చలేదు. వెంటనే ‘పోకిరి’ టైటిల్‌ చెప్పాడు పూరి. ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయింది. అయితే నెక్స్‌ట్‌ ఇయర్‌ వరకు ఆగలేని పూరి వెంటనే నాగార్జునతో ‘సూపర్‌’ చిత్రాన్ని స్టార్ట్‌ చేసేశాడు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత ‘పోకిరి’ ప్రాజెక్ట్‌కి వచ్చాడు పూరి. అప్పటికి మహేష్‌ కూడా ఫ్రీ అయిపోయాడు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ కోసం వేట మొదలైంది. అయేషా టకియా, దీపిక పదుకొనే, పార్వతి మెల్టన్‌..ఇలా చాలా మందిని అనుకున్నారు. చివరికి ఇలియానా ఫిక్స్‌ అయింది. 

‘పోకిరి’ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. పూరి జగన్నాథ్‌ వర్కింగ్‌ స్టైల్‌ మహేష్‌కి బాగా నచ్చింది. అప్పటివరకు మహేష్‌ పనిచేసిన డైరెక్టర్లందరిలో పూరి స్పీడ్‌ అని అర్థమైంది. ప్రతి షాట్‌ని సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేసేవాడు. 70 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్‌ గెటప్‌, క్యారెక్టరైజేషన్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌... ఇలా అన్నీ మార్చేశాడు పూరి. అతనికి ఒక కొత్త లుక్‌ తీసుకొచ్చాడు. మణిశర్మ మ్యూజిక్‌లో చేసిన పాటలన్నీ బాగా కుదిరాయి. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ పాట సినిమా రిలీజ్‌కి ముందే పెద్ద సంచలనం సృష్టించింది. ‘శివమణి’ షూటింగ్‌ టైమ్‌లో ఫారిన్‌ వెళ్ళిన పూరికి ఒకచోట ఒక వ్యక్తి గిటార్‌తో ‘లిజన్‌ టు ది ఫాలింగ్‌ రైన్‌’ పాటను ప్లే చేస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు పూరి. సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన ‘గౌరి’ చిత్రంలోని ‘గల గల పారుతున్న గోదారిలా..’ పాటే అది. ఆ ఇంగ్లీష్‌ పాట ఇన్‌స్పిరేషన్‌తోనే తెలుగులో పాట చేశారని తర్వాత తెలుసుకున్నాడు పూరి. అది కృష్ణ పాటే కాబట్టి తమ సినిమాలో పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కొత్తగా వినిపించిన ఆ పాట చాలా పెద్ద హిట్‌ అయింది. 

2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ చెల్లా చెదురు చేసేసింది. ‘పోకిరి’ మహేష్‌కి స్టార్‌డమ్‌ తీసుకొచ్చింది. పూరిని టాప్‌ డైరెక్టర్‌ని చేసింది. హీరోయిన్‌గా ఇలియానాకు క్రేజ్‌ వచ్చింది. సినిమాలోని ప్రతి సీన్‌ పేలింది. డైలాగులు, యాక్షన్‌ సీన్స్‌, అలీ, వేణుమాధవ్‌, బ్రహ్మాంనందం కాంబినేషన్‌లో రూపొందిన బెగ్గర్స్‌ సీన్స్‌ థియేటర్‌లో అదిరిపోయాయి. 75 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమా కూడా సాధించిన రికార్డులు ‘పోకిరి’ సాధించింది. 2007లో విజయ్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ్‌లో రూపొంది అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. 2009లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్‌లోనే ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తే బాలీవుడ్‌లో కూడా బిగ్‌ హిట్‌గా నిలిచింది. 2010లో దర్శన్‌ హీరోగా కన్నడలో ‘పోర్కి’గా, 2014లో షకీబ్‌ఖాన్‌ హీరోగా ‘రాజోట్టో’ పేరుతో బంగ్లాదేశ్‌లో ఈ సినిమా రూపొంది ఘనవిజయం సాధించింది. రీమేక్‌ చేసిన అన్ని భాషల్లో ‘పోకిరి’ సూపర్‌హిట్‌ కావడం విశేషం.

మహేష్‌, పూరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పోకిరి’ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. 63 కేంద్రాల్లో 175 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 17 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శించారు. ఇది అప్పటికి ఆల్‌ ఇండియా నేషనల్‌ రికార్డుగా నిలిచింది. తిరుపతిలోని ఓ థియేటర్‌లో ఫ్లోటింగ్‌ బాగా ఎక్కువ ఉండడంతో రోజూ 5 ఆటలు చొప్పున 200 రోజులు రన్‌ అయింది. టోటల్‌ రన్‌లో రూ.66 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది ‘పోకిరి’. అందులో రూ.48 కోట్ల షేర్‌ వచ్చింది. ‘మగధీర’ రిలీజ్‌ అయ్యేవరకు అంటే మూడు సంవత్సరాలపాటు ఆ రికార్డు అలాగే ఉంది. అప్పటికి ఇండియా లెవల్‌లో టాప్‌ గ్రాసర్‌గా ‘పోకిరి’ రెండవ స్థానంలో ఉంది. అలా టాప్‌ 5లో నిలిచిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ సినిమా అది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.