బ్రహ్మానందం గిన్నిస్‌బుక్ రికార్డ్ సాధించే స్థాయికి వచ్చారంటే.. దానికి కారణం సుత్తివేలు!
on Jan 31, 2025
(ఫిబ్రవరి 1 హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)
అతను తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్‌లో నవ్వులే నవ్వులు. ఆఖరికి ఏదైనా వేదికపై కనిపించినా కేరింతలు వినిపిస్తాయి. ఒక స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ అతని సొంతం. అతనే నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం. తెలుగువారు మంచి హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. కామెడీని ఏ రూపంలో ఉన్నా, అది ఎవరు చేసినా ఆస్వాదిస్తారు. అందులోనూ బ్రహ్మానందం పండిరచే కామెడీ పూర్తిగా విభిన్నం. తన డైలాగులతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్‌తో కూడా నవ్వు తెప్పించగల నటుడు. అంతేకాదు, ఎలాంటి డైలాగు చెప్పకుండా తన ఎక్స్‌ప్రెషన్‌తోనే ప్రేక్షకుల్ని నవ్వించగల సమర్థుడు బ్రహ్మానందం. తన 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 1250కిపైగా సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. కేవలం హాస్యనటుడిగా 1250 సినిమాలు చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన కమెడియన్ బ్రహ్మానందం. జగమెరిగిన బ్రహ్మానందం గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రస్తావించుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అయితే ఆయన జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం, చేసిన పాత్రల తీరుతెన్నుల గురించి చెప్పుకోవడం సమంజసం అనిపించుకుంటుంది.
1956 ఫిబ్రవరి 1న అప్పటి గుంటూరు జిల్లాలోని చాగంటివారి పాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఏడో సంతానంగా జన్మించారు బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదివారు. ఆ తర్వాత చదివించే ఆర్థిక స్తోమత నాగలింగాచారికి లేకపోవడం వల్ల సన్నిహితులైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశారు. ఖాళీ సమయాల్లో సినిమా తారలను ఇమిటేట్ చేస్తూ స్నేహితులను నవ్విస్తూ ఉండేవారు. అంతేకాదు, విద్యార్థులకు వినోదాన్ని అందిస్తూనే పాఠాలు చెప్పేవారు. ఇది చూసిన ఆయన మిత్రులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఓసారి హైదరాబాద్ వచ్చినపుడు రచయిత ఆదివిష్ణు పరిచయమయ్యారు. బ్రహ్మానందంలోని టాలెంట్‌ని గుర్తించిన ఆయన దూరదర్శన్‌లోని ‘పకపకలు’ అనే కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇప్పించారు. ఆరోజుల్లో దూరదర్శన్ తప్ప మరో టీవీ ఛానల్ లేని కారణంగా బ్రహ్మానందం చెప్పే జోకులు రాష్ట్రం నలుమూలలా పాకాయి.
1985లో నరేష్ హీరోగా వేజెళ్ళ సత్యనారాయణ రూపొందిస్తున్న శ్రీతాతావతారం చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. విశేషం ఏమిటంటే.. బ్రహ్మానందం పుట్టినరోజైన ఫిబ్రవరి 1న తొలిసారి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. ఈలోగా బ్రహ్మానందం గురించి జంధ్యాలకు తెలియడంతో తను చేస్తున్న సత్యాగ్రహం చిత్రంలో గుండు హనుమంతరావు కాంబినేషన్‌లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత చంటబ్బాయ్ షూటింగ్ సమయంలో బ్రహ్మానందంను చిరంజీవికి పరిచయం చేశారు జంధ్యాల. అప్పుడు తను నటిస్తున్న పసివాడి ప్రాణం చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించారు చిరంజీవి. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని కూడా ఎవరికీ తెలీదు. అలా మూడు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు బ్రహ్మానందం.
1987 జూలై 23న పసివాడి ప్రాణం విడుదలైంది. అదే సమయంలో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు అహ నా పెళ్లంట చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చే అరగుండు పాత్రను సుత్తి వేలుతో చేయించాలి అనుకున్నారు. అయితే ఆ టైమ్‌కి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయినా అతని డేట్స్ బాగా ట్రై చేశారు. కానీ, వీలుపడలేదు. ఆ సమయంలో రామానాయుడికి సత్యాగ్రహం చిత్రంలో నటించిన బ్రహ్మానందం గుర్తొచ్చి ఆ క్యారెక్టర్ అతనితో చేయించమని జంధ్యాలకు చెప్పారు. అప్పుడు బ్రహ్మానందంకి ఫోన్ చేసి పిలిపించారు. అలా సుత్తివేలు చెయ్యాల్సిన పాత్ర బ్రహ్మానందంకి దక్కింది. అహ నా పెళ్ళంట విడుదలై ఘనవిజయం సాధించింది. 16 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 5 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా బ్రహ్మానందంకి పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 1992లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమాతో బ్రహ్మానందం కెరీర్ తారా స్థాయికి చేరింది. సంవత్సరానికి 30కి పైగా సినిమాలు చేస్తూ బిజీ కమెడియన్ అయిపోయారు. హీరో ఎవరైనా బ్రహ్మానందం మాత్రం సినిమాలో కామన్ అనే స్థాయికి ఆయన కెరీర్ ఎదిగింది. ఒక దశలో బ్రహ్మానందం లేకుండా ఏ స్టార్ హీరో సినిమాగానీ, ఒక రేంజ్ హీరో సినిమా గానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం ఉండడం వల్లే బిజినెస్ జరిగాయి.
బ్రహ్మానందం పోషించిన పాత్రల్లోని మేనరిజమ్స్, ఊతపదాలు, డైలాగులు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లిపోయాయి. దైనందిన జీవితంలో వాటిని తరచుగా వాడడం జనానికి అలవాటైపోయింది. అలాంటి వాటిలో చిత్రం భళారే విచిత్రంలోని ‘నీ ఎంకమ్మా’, మనీ చిత్రంలోని ‘ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్’, ధర్మచక్రం చిత్రంలోని ‘ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా’, అనగనగా ఒకరోజు చిత్రంలోని ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు’, నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని ‘రకరకాలుగా ఉంది మాస్టారూ’, ఎన్నో చిత్రాల్లో వాడిన పదం ‘జఫ్ఫా’, పోకిరి చిత్రంలోని ‘పండగ చేస్కో’, ఢీ చిత్రంలోని ‘నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి రావుగారూ’, దూకుడులోని ‘నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్‌ఎంఎస్ చేయండి’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం చెప్పిన డైలాగులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలు చేయకపోయినా, ఆయన నటించిన కామెడీ సీన్స్ టీవీల్లో ప్రతిరోజూ మారుమోగిపోతూ ఉంటాయి. అలాగే మీమ్స్‌లో, రీల్స్‌లో బ్రహ్మానందం రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటారు.
వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మీ. వీరికి గౌతమ్, సిద్ధార్థ్ సంతానం. వీరిలో గౌతమ్.. పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించినా నటుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టాయని చెప్పొచ్చు. ఒక విధంగా 2000 సంవత్సరంలో సునీల్ ఎంటర్ అయిన తర్వాత బ్రహ్మానందం కెరీర్ కాస్త మందగించింది. సునీల్ తన డిఫరెంట్ కామెడీతో, డైలాగ్ మాడ్యులేషన్‌తో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఢీ చిత్రం బ్రహ్మానందంకి మరో బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ తన కామెడీతో అలరిస్తున్నప్పటికీ మరోపక్క బ్రహ్మానందం కూడా తన హవా కొనసాగించారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కొత్తతరం కామెడీ యాక్టర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. దాంతో బ్రహ్మానందం ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తను నటుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా. ప్రస్తుతం తన ఊహలకు తగ్గట్టుగా బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
