మొదటి 4 సినిమాలు రిలీజ్ కాలేదు.. ఆమెను ఐరన్‌లెగ్ అన్నారు.. కానీ, సూపర్‌స్టార్ అయిపోయింది!
on Feb 18, 2025
సినిమా రంగంలో స్టార్స్‌గా, సూపర్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు వారి తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు మాత్రం కష్టాలతోపాటు ఎన్నో అవమానాలను కూడా సహించారు. నీ మొహం, నీ వాయిస్ సినిమాకి పనికి రాదు అనే మాట ఎంతో మంది నటీనటుల అనుభవంలో ఉన్నదే. ఇక కొందరికి అవకాశాలు వచ్చినప్పటికీ కాలం కలిసి రాక ఆ సినిమాలు విడుదల అవ్వవు. అలాంటి చిత్రమైన పరిస్థితి ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ జీవితంలో జరిగింది. ఆమె కెరీర్ ప్రారంభంలో నాలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే వరసగా ఒకదాని వెంట మరొకటి షూటింగ్ ఆలస్యం కావడంతోపాటు అవి రిలీజ్‌కి కూడా నోచుకోలేదు. దాంతో అవకాశాల కోసం ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లినా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్లినా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. పైగా ఆమెకు ‘ఐరన్ లెగ్’ అనే బిరుదును కూడా తగిలించారు. విషయం తెలుసుకున్న ఇతర దర్శకనిర్మాతలు కూడా ఆమెను దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఓ తెలుగు దర్శకుడు మాధురీ దీక్షిత్‌తో ఒక సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ఆ సినిమా పేరు ‘పుష్పక విమానం’. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటో తెలుసుకుందాం..
కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూకీ చిత్రం ‘పుష్పక విమానం’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి సరిపోయే అమ్మాయి కోసం సింగీతం వేట మొదలుపెట్టారు. అప్పట్లో బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నీలమ్ కొఠారిని తమ సినిమాలో ఎంపిక చేసేందుకు బొంబాయి వెళ్లి ఆమెను కలిశారు సింగీతం. సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో చేస్తానని ఒప్పుకుంది నీలమ్. అయితే బొంబాయి నుంచి తనతోపాటు హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వస్తారనే కండిషన్ పెట్టింది. ఇది రొటీన్‌గా తీస్తున్న కమర్షియల్ సినిమా కాదని, ఒక ప్రయోగమని చెప్పారు సింగీతం. మామూలు సినిమాకైతే మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పించేవాళ్లం అని చెప్పారు. కానీ, నీలమ్ ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలైంది.
ఆ సమయంలో ‘షోలే’ వంటి సెన్సేషనల్ హిట్ సినిమాను రూపొందించిన రమేష్ సిప్పీని కలిసి విషయం చెప్పారు సింగీతం. ‘ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆమె నటించిన నాలుగైదు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. ఆమెకు ఐరన్‌లెగ్ అనే పేరు వచ్చేసింది. ఆమె పేరు మాధురీ దీక్షిత్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి కలవండి’ అని చెప్పారు రమేష్ సిప్పీ. ఆయన చెప్పినట్టుగానే మాధురీ దీక్షిత్ అడ్రస్ కనుక్కొని ఆమె మేనేజర్‌తో విషయం చెప్పారు సింగీతం. అలాంటి డైలాగులు లేని సినిమాలో మా హీరోయిన్ చేయదు అంటూ తిప్పి పంపించాడు ఆ మేనేజర్. ఆ తర్వాత ఓ ఫంక్షన్‌లో అమలను చూశారు సింగీతం. ఆమె గురించి వాకబు చేస్తే.. శివాజీ గణేశన్‌తో ఒక సినిమాలో నటించిందనీ, నటన అస్సలు తెలీదని చెప్పారు. అయితే దర్శకుడిగా ఆమెను సునిశితంగా పరిశీలించిన సింగీతంకి అలా అనిపించలేదు. ఎంతో సహజంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి తమ సినిమాలోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్ సూట్ అవుతుందని భావించి ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు.
మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా టైమ్ బాగోకపోతే ఎవరో ఒకరు అడ్డు పడతారనీ, ఏదో విధంగా అది పక్కకి వెళ్లిపోతుందనే విషయం మాధురీ దీక్షిత్ విషయంలో ప్రూవ్ అయింది. అప్పటికే నాలుగు రిలీజ్ అవ్వని సినిమాల్లో నటించిన ఆమెకు పుష్పక విమానం ఒక మంచి అవకాశం. కానీ, అది ఆమె మేనేజర్ వల్ల చేజారిపోయింది. ఆ తర్వాత ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకొని హీరోయిన్‌గా బిజీ అయిపోయిన తర్వాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో ఓ సినిమా చేశారు. ఆ సమయంలో పుష్పక విమానం గురించి ఆమెతో ప్రస్తావించి జరిగింది చెప్పారు సింగీతం. ఆయన మాటలకు ఆమె షాక్ అయిపోయి ఒక్కసారిగా తలకొట్టుకుంటూ.. అప్పుడు ఉన్న మేనేజర్‌ను ‘మంచి ఛాన్స్ మిస్ చేశాడు’ అని తిట్టుకుంది మాధురీ దీక్షిత్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
