మన గుండెల్లో ఎప్పటికీ నిలిచివుండే ఎవర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్!
on Jan 21, 2022

ఎనిమిదేళ్ల క్రితం - "నాకు కేన్సర్. నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు" అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం ఆచరించి, మరి కొద్ది రోజుల్లో మరణం తప్పదని తెలిసినా, గుండె చిక్కబట్టుకొని, 'మనం' చిత్రంలో 'చైతన్య' అనే ముదుసలి పాత్రను అభినయించి, నవ్వుతూ వెళ్లిపోయిన అసాధారణ 'మనీషి'.. అక్కినేని నాగేశ్వరరావు. జనవరి 22 ఆయన వర్ధంతి. భౌతికంగా ఆయన మనకు దూరమై ఎనిమిదేళ్లు గడిచినా, ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పడం లేదంటే.. అదీ ఆయన ముద్ర! తెలుగు సినీ గగనాన వెలసిన ధ్రువ నక్షత్రం.. ఏఎన్నార్!!
తెలుగు సినిమాకు సంబంధించి 'ఎవర్‌గ్రీన్ హీరో' అనే మాటను అక్కినేనిని ఉద్దేశించే ఎవరైనా అనేవారు. తెరమీద ఆయన ముఖం అలా వెలిగింది. ఆ ముఖం అసంఖ్యాక ప్రజల్ని ఆకర్షించింది. ఎనభై ఏళ్లు దాటిన వయసులోనూ ఆయన కెమెరా ముందు పాతికేళ్ల కుర్ర హీరోలకు ఉత్సాహం కలిగించే విధంగా నటించారు. ఆయనను మామూలు నాగేశ్వరరావుగా రోజూ చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోయేవిధంగా తెరపై తన చలాకీతనాన్ని ప్రదర్శించారు. అంతకంటే ముందు తనకంటే వయసులో పాతిక, ముప్పై ఏళ్లు చిన్నవాళ్లయిన హీరోయిన్లు - జయసుధ, జయప్రద, శ్రీదేవి, రాధిక, రాధ, సుహాసిని వాంటి వాళ్లతో సమానంగా పరుగులు తీస్తూ, హుషారుగా డాన్సులేస్తూ నటించారు. అప్పుడాయన అరవై పదులు దాటిన మనిషంటే ఎవరూ నమ్మేవాళ్లు కాదు.
అక్కినేని మన ఎవర్‌గ్రీన్ హీరో మాత్రమే కాదు, మన మొదటి గ్లామర్ హీరో కూడా. ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి దానికి పదమూడేళ్ల స్వల్ప చరిత్రే ఉంది. 1931లో తొలి టాకీ 'భక్త ప్రహ్లాద' వచ్చినదనుకుంటే.. ఇప్పుడు తెలుగు సినిమా వయసు 90 ఏళ్లు. అందులో 70 ఏళ్లు అక్కినేనివి. ఒక నటుడు 70 సంవత్సరాల పాటు తెరపై కనిపించడం ఏ రకంగా చూసినా అసాధారణం, అపురూపం, అరుదైన ఘనకార్యం. ఆయన టైటిల్ రోల్ చేసిన 'బాలరాజు' 1948లో విడుదలైంది. అంతకు ముందు మన సినిమా రంగంలో చిత్తూరు నాగయ్య లాంటి ప్రసిద్ధ నటులున్నారు కానీ, వారిలో ఎవరూ 'గ్లామరస్ హీరో' అనిపించుకోలేకపోయారు. మొదటిసారిగా సినిమా ఎలాగైనా ఉండనీ, నాగేశ్వరరావు కోసం దాన్ని చూడాలనిపించే విధంగా ఆ సినిమాతో ఆయన జనాన్ని మంత్రముగ్ధులను చేశారు.
Also read: బర్త్‌డే స్పెషల్ స్టోరీ: సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో టాప్ టెన్ హిట్స్!
తెరపై కనిపించింత సేపు ఏఎన్నార్ జుట్టు ఎలా దువ్వుకున్నాడు, వేషం ఎలా వేసుకున్నాడు, మీసం ఎలా ఉంది, పక్కవాడితో మాట్లాడేప్పుడు తల ఎలా పక్కకి వంచుతాడు, ఎలా నడుస్తాడు, ఎలా డాన్సులేస్తాడు, ఎలా నవ్వుతాడు.. వంటి ప్రతి చిన్న వివరాన్నీ ప్రేక్షకులు శ్రద్ధగా గమనించి, జ్ఞాపకం పెట్టుకొని, మనం కూడా అలా ఉంటే, అలా చేస్తే ఎంత బావుంటుంది.. అనిపించిన తొలి హీరో అక్కినేని.
Also read: "సగం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాటలకు స్టన్నయిన లక్ష్మి!
నటుడిగా ఆయన చాలా త్వరగా ఎదిగారు. 1948 నాటి 'బాలరాజు'తో పోలిస్తే, 1953లో వచ్చిన 'దేవదాసు' నాటికే ఆయన నటనా వైదుష్యంలో ఉత్తుంగ శిఖరాలు అందుకున్నారు. ఎన్ని భాషల్లో, ఎన్ని దేవదాసు సినిమాలొచ్చినా అక్కినేనిలా ఎవరూ 'దేవదాసు' పాత్రని రక్తి కట్టించలేకపోయారు. "నటనకు ఇది పరాకాష్ఠ. ఇంతకంటే మళ్లీ నాగేశ్వర్రావైనా బాగా అభినయించలేడు" అని ప్రేక్షకులు అనుకునేటంత ఔన్నత్యాన్ని ఆయన 'దేవదాసు'లో అందుకున్నారు. కాని వారి అంచనాలను తలకిందులు చేస్తూ 'విప్రనారాయణ', 'మహాకవి కాళిదాసు', 'బాటసారి', 'ధర్మదాత', 'ప్రేమనగర్', 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం', 'సూత్రధారులు', 'సీతారామయ్యగారి మనవరాలు'.. ఇంకా మరెన్నో చిత్రాలలో ఆయన మరింత ఉన్నతిని సాధించారు. ఇక అందుకోవడానికి ఉన్నత శిఖరాలు లేవని ప్రేక్షకులు అనుకున్నప్పుడల్లా వాళ్లను ఆశ్చర్యపరుస్తూ కొత్తవాటిని సృష్టించారు. ఈ శిఖరాలలో 'సీతారామయ్యగారి మనవరాలు' ఒకటి అని ప్రేక్షక లోకం వేనోళ్ల ప్రశంసించింది. ఆయన తాను మామూలుగా నటించే ధోరణి సినిమాల నుంచి బయటకు వచ్చి 'సూత్రధారులు', 'సీతారామయ్యగారి మనవరాలు' వంటి సినిమాలు చెయ్యడం విశేషం.

డెబ్బై ఎనిమిదేళ్ల క్రితం - ఏఎన్నార్ చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటనను వృత్తిగా, తపస్సుగా స్వీకరించారు. అప్పట్లో ఆయన హాబీలేమిటో తెలియదు కానీ, ఆ తర్వాత నుంచి ఆయనకు రెండు హాబీలయ్యాయి. చివరి దాకా ఆ హాబీలు పోలేదు. ఒక హాబీ - శత దినోత్సవాలు చేసుకోబోయే చిత్రాల్లో తరచుగా నటించడం, రెండో హాబీ - ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి పురస్కారం, దాదాసాహెబ్ పురస్కారం నుంచి ప్రేక్షకులందించే పురస్కారాల వరకు సత్కార పరంపరను స్వీకరించడం.
చివరగా తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నాగేశ్వరరావు 'మనం' అంటూ తెరపై మన ముందుకు వచ్చారు. కానీ అంతకు కొద్ది రోజుల ముందే తెరవెనుక నిష్క్రమించారు. 'ఏఎన్నార్ లివ్స్ ఆన్' అని ఆ సినిమాని ఆయనకు అంకితమిచ్చింది కుటుంబం. నిజమే. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నటికీ తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో జీవించే ఉంటారు.
(నేడు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా..)
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



