నటిస్తూనే తుది శ్వాస విడుస్తానని చెప్పిన ఎస్.వి.రంగారావు.. చివరికి అన్నంత పనీ చేశారు!
on Jul 2, 2025
(జూలై 3 ఎస్.వి.రంగారావు జయంతి సందర్భంగా..)
పాతతరం నటీనటులంతా నాటక రంగంపైనా, సినిమా రంగంపైనా విపరీతమైన గౌరవంతోనే తమ కెరీర్‌ను కొనసాగించారు. నటనను దైవంగా భావించేవారు. ఎంతగా అంటే తమ చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలి, నటనకు రిటైర్‌మెంట్ అనేది ఉండకూడదు అని చెబుతూ ఉండేవారు. అలా చివరి శ్వాస వరకూ నటిస్తూ కన్నుమూసిన నటులు ఎస్.వి.రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు. 70 సంవత్సరాలపాటు నటనలోనే కొనసాగి 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు అక్కినేని. ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ అదే సంవత్సరం మే 23న విడుదలైంది. అంతకుముందు ఎస్.వి.రంగారావు కూడా నటిస్తూనే కన్ను మూస్తానని పలుమార్లు చెప్పేవారు. చెప్పినట్టుగానే యశోదకృష్ణ సినిమా సెట్స్‌లోనే ప్రాణాలు విడిచారు.
వెర్సటైల్ ఆర్టిస్ట్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎస్.వి.రంగారావు. తన కెరీర్‌లో చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేసిన సందర్భాలు చాలా తక్కువ. తను చేసే ప్రతి క్యారెక్టర్ వైవిధ్యంగా, విభిన్నంగా ఉండాలనుకునేవారు. అనుకున్నట్టుగానే అలాంటి పాత్రలే ఆయనకు వచ్చేవి. ఆయా పాత్రల్లో ఆయన జీవించేవారు. ప్రేక్షకులకు ఆ పాత్ర కనిపించేది తప్ప ఎస్వీఆర్ కనిపించేవారు కాదు. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అలాంటి గొప్ప నటుడికి తీరని అన్యాయం జరిగిందని ఇప్పటికీ ఎంతో మంది ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఎస్వీఆర్ ప్రేక్షకులు మెచ్చిన నటుడే కాదు, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ నచ్చిన నటుడు కూడా. అలాంటి గొప్ప నటుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి పురస్కారాలూ లభించలేదు. అంత గొప్ప నటుడ్ని ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయమని అందరూ బాధపడుతూ ఉంటారు.
1947లో వరూధిని చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఎస్.వి.రంగారావుకు ఆ తర్వాత పల్లెటూరిపిల్ల, షావుకారు చిత్రాలు చాలా మంచి పేరు తెచ్చాయి. అలా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత పాతాళభైరవిలో చేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర ఆయనలోని గొప్ప నటుడ్ని వెలికి తీసింది. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొందరు నటులు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తూ ఉంటారు. కానీ, ఎస్వీఆర్‌కి ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలు వచ్చేవి. వాటిని ఎంతో సమర్థవంతంగా పోషించడం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగిన నటుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఎన్టీఆర్, ఎఎన్నార్ కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. వారిద్దరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. నటన విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌తో ఎప్పుడూ పోటీ పడేవారు ఎస్వీఆర్. కానీ, వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో నటుడుగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన ఎస్వీఆర్‌లో ఉండేది. అది గమనించిన ఎన్టీఆర్ ఆయనకు ధైర్యం చెప్పేవారు. నటుడుగా అత్యున్నత స్థానానికి వెళతారు అని ప్రోత్సహించేవారు.
వ్యక్తిత్వం విషయానికి వస్తే.. ఎదుటివారు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. దానివల్ల ఆయన నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1950లో విజయ సంస్థ తెలుగులో నిర్మించిన షావుకారు చిత్రాన్ని 1965లో ఎంగవీట్టు పెన్ పేరుతో తమిళ్‌లో రీమేక్ చేశారు. తెలుగులో జానకి పోషించిన పాత్ర కోసం తమిళ్‌లో నిర్మలను తీసుకున్నారు. విజయ సంస్థ ద్వారా నటిగా పరిచయమవడంతో తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు నిర్మల. అప్పటికి నటుడుగా టాప్ పొజిషన్‌లో ఉన్నారు ఎస్వీఆర్. తెలుగులో ఎస్వీఆర్ పోషించిన సున్నపు రంగడు పాత్ర కోసం ఆయన్నే ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభం రోజున విజయనిర్మలను చూసి ‘ఇంత బక్కపలచగా ఉందీ అమ్మాయి. ఈమె ఈ సినిమాలో హీరోయినా. ఈమె కంటే కె.ఆర్.విజయ బాగుంటుంది. ఆమెను తీసుకోండి’ అని నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు ఎస్వీఆర్. దాంతో హీరోయిన్‌గా తనకు వచ్చిన అవకాశం పోయిందంటూ విజయనిర్మల మేకప్ రూమ్‌లో ఏడుస్తూ కూర్చున్నారు. అయితే మరుసటి రోజు విజయనిర్మల ఇంటికి కారు వచ్చింది. షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన ఆమెకు ఎస్వీఆర్ కనిపించలేదు. తర్వాత తెలిసిందేమిటంటే.. ఆ సినిమా నుంచి ఆయన్ని తీసేసి మరొకర్ని పెట్టారు. అలా ఒక చిన్న మాట వల్ల ఆ సినిమాలో అవకాశాన్ని కోల్పోయారు ఎస్వీఆర్.
తన చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను అని ఎస్వీఆర్ చెప్పిన మాటల్ని యశోద కృష్ణ చిత్రం నిజం చేసింది. 1974లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు దర్శకుడు సి.ఎస్.రావు. ఈ సినిమాలో కంసుడి పాత్ర పోషించారు ఎస్వీఆర్. కథ ప్రకారం కృష్ణుడి చేతిలో కంసుడు చనిపోతాడు. దానికి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఎస్వీఆర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. అలా తను కోరుకున్న విధంగానే సినిమా సెట్స్‌లోనే ప్రాణాలు వదిలారు ఎస్వీఆర్. అప్పటికి ఆయన కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో కొంత భాగం నటించారు కూడా. అయితే ఎస్వీఆర్ మరణం తర్వాత ఆ సినిమాల్లో ఎస్వీఆర్ చేసిన పోర్షన్ వరకు తొలగించి గుమ్మడితో వాటిని పూర్తి చేశారు దర్శకనిర్మాతలు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
