ENGLISH | TELUGU  

ఆ పాత్రల్లో కొందరు నటిస్తారు, మరికొందరు జీవిస్తారు.. అరుదైన ఆ పాత్రల వెనుక ఉన్న కథ ఏమిటంటే..!

on Jul 16, 2024

సినిమా రంగంలో ప్రతి ఆర్టిస్టూ తను చేసే పాత్రకు పూర్తి న్యాయం చెయ్యాలనుకుంటారు. అయితే కొందరు ఆ క్యారెక్టర్‌లో నటిస్తారు. కానీ, కొందరు మాత్రం జీవిస్తారు. అలా తమకు ఇచ్చిన క్యారెక్టర్‌లో జీవించాలంటే ఆ పాత్రను అర్థం చేసుకోవాలి. అందులో లీనమైన నటించాలి. ఆ సమయంలో ఆ క్యారెక్టరే కనిపించాలి తప్ప నటుడు కాదు. అలా కనిపించాలంటే దాని వెనుక ఎంతో కృషి అవసరం. డైరెక్టర్‌ తమకి ఇచ్చిన క్యారెక్టర్‌ తాలూకు లక్షణాలను ఆకళింపు చేసుకొని నటించడం అనేది పరిపూర్ణ నటుడి లక్షణం. ఆ క్యారెక్టర్‌ని పండిరచడానికి, ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలోని అవయవాల లోపం ఉన్న క్యారెక్టర్‌ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. దాని కోసం ఎంతో మందిని పరిశీలించి వారి నుంచి ఎంతో నేర్చుకుంటారు. అలాంటి అరుదైన క్యారెక్టర్స్‌ చేసిన కొందరు నటుల గురించి తెలుసుకుందాం.

సుప్రసిద్ధ తమిళ నటుడు, సీనియర్‌ నటి రాధిక తండ్రి ఎం.ఆర్‌.రాధ ‘రక్తకన్నీర్‌’ నాటకాన్ని స్టేజిపై ప్రదర్శించేవారు. ఈ నాటకంలో ప్రధాన పాత్ర ధారి అయిన గోపాల్‌ చివరి దశలో కుష్ఠు వ్యాధిగ్రస్తుడవుతాడు. ఆ పాత్రను స్టేజి మీద తొలిసారి ప్రదర్శించే ముందు కుష్ఠు రోగులున్న హాస్పిటల్‌కి వెళ్ళి వారితో రోజుల తరబడి గడిపారు. వారి ప్రవర్తన, మాట్లాడే తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వాటన్నింటినీ ఆకళింపు చేసుకున్న తర్వాత వేదికపై ఆ నాటకాన్ని ప్రదర్శించారు. ఆయన ఆ పాత్రను రక్తి కట్టించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా ఆ నాటకాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. ఆ తర్వాత ఆ నాటకాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. 

అదే నాటకాన్ని తెలుగు నటుడు నాగభూషణం ‘రక్తకన్నీరు’ పేరుతో కొన్ని వందల సార్లు స్టేజిపై ప్రదర్శించారు. అది ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. 1954లో వచ్చిన ‘రక్తకన్నీర్‌’ చిత్రంలోని ఎం.ఆర్‌.రాధ నటనను సునిశితంగా పరిశీలించారు నాగభూషణం. అంతేకాదు, తను కూడా కొందరు కుష్ఠు రోగులను దగ్గరకు వెళ్లి మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు. అలా ఆ పాత్రలో జీవించేందుకు ఆ పరిశీలన ఎంతగానో ఉపయోగపడింది. భారతదేశంలోని ఎంతో మంది నటీనటులు ఎక్కువగా అంధుల పాత్రలను పోషించారు. అయితే పాతతరంలోని నటులు అంధులుగా నటించినా ఆ పాత్రలకు పూర్తి న్యాయం చెయ్యలేకపోయారనే చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఒక పాత్రగా చేశారే తప్ప సహజంగా అంధులు ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్ని చూపించలేకపోయారు. 

ఇలాంటి అరుదైన పాత్రలు చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న కమల్‌హాసన్‌ 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో అంధుడిగా నటించి అందర్నీ మెప్పించారు. ఆ పాత్రలో జీవించేందుకు కమల్‌ మద్రాసులో ఉన్న ఒక వికలాంగుల పాఠశాలకు వెళ్ళి, ఆ స్కూల్‌కి కొంత విరాళమిచ్చి అక్కడ వున్న అంధులను దగ్గరగా పరిశీలించారు. వారి బాడీ లాంగ్వేజ్‌, నడక, భావప్రకటన వంటి అంశాలను బాగా గ్రహించిన తర్వాతే సినిమాలోని ఆ పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కమల్‌హాసన్‌ చేసిన సినిమాల్లో ‘అమావాస్య చంద్రుడు’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు.

1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్రంలో సున్నం రంగడు పాత్ర కోసం ఎంతో మంది రిక్షావాళ్ళను పరిశీలించారు ఎస్‌.వి.రంగారావు. వాళ్ళు బీడీ కాల్చే విధానం, మాట్లాడే తీరు, వారు ఎలా నడుస్తారు వంటి విషయాలను బాగా తెలుసుకొని సున్నం రంగడు పాత్రకు న్యాయం చేశారు. ఇలాంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తోంది. ప్రస్తుత జనరేషన్‌లో కూడా కొన్ని అరుదైన పాత్రలను పోషించాల్సి వచ్చినపుడు నటీనటులు ఆ క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసుకొని ఆయా పాత్రల్లో జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.