‘‘నీ దారి పూల దారి’’.. చిరు ‘మగమహారాజు’కి 40 ఏళ్ళు
on Jul 14, 2023

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు విజయ బాపినీడు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. వాటిలో 'మగమహారాజు' ఒకటి. వాస్తవానికి ఈ చిత్రాన్ని మౌళి తెరకెక్కించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి విజయ బాపినీడు వచ్చారు. సుహాసిని కథానాయికగా నటించిన ఈ సినిమాలో నిర్మలమ్మ, ఉదయ్ కుమార్, అన్నపూర్ణ, రావు గోపాల రావు, రాళ్ళపల్లి, రోహిణి, బాలాజీ, తులసి, హేమ సుందర్, నూతన్ ప్రసాద్, అనూరాధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ కథను అందించిన ఈ చిత్రానికి కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు.
కథ విషయానికి వస్తే.. రాజు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. పెళ్ళి కాని చెల్లి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు.. ఇలా తనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో రాజుకి ధనవంతురాలైన సుహాసిని పరిచయమవుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. మరోవైపు డబ్బు సంపాదన కోసం సైకిల్ రేస్ లో పాల్గొంటాడు రాజు. 8 రోజుల పాటు రాత్రి, పగలు తేడా లేకుండా నిరవధికంగా పాల్గొని.. డబ్బు సంపాదిస్తాడు. సుహాసినితో పెళ్ళయ్యాక రాజు సమస్యలు తీరుతాయి.
కృష్ణ - చక్ర సంగీతమందించిన ఈ చిత్రంలో "నీ దారి పూల దారి" చార్ట్ బస్టర్ గా నిలవగా.. "సీతే రాముడి", "అన్నలో అన్న", "నెలలు నిండే", "మా అమ్మ చింతామణి" గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన 'మగమహారాజు'.. హిందీలో 'ఘర్ సంసార్' (జితేంద్ర, శ్రీదేవి) పేరుతో రీమేక్ అయింది. 1983 జూలై 15న జనం ముందు నిలిచిన 'మగమహారాజు'.. శనివారంతో 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



