ENGLISH | TELUGU  

30 సంవత్సరాల మ్యూజికల్ హిట్ 'అల్లరి ప్రియుడు'

on Mar 19, 2023

 

యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అప్పటి దాకా రాజశేఖర్‌కు ఉన్న ఇమేజ్‌ను మార్చేసిన సినిమా 'అల్లరి ప్రియుడు'. ఆయనను కూడా రొమాంటిక్ హీరోగా జనం యాక్సెప్ట్ చేస్తారని ఆ సినిమాతోటే ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్‌కు తెలిసింది. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన రమ్యకృష్ణ, మధుబాల నటించారు. హిందీలో అప్పటికే విడుదలై ఘన విజయం సాధించిన 'సాజన్' మూవీకి ఇది ఫ్రీమేక్. ఆ సినిమాలో మాధురీ దీక్షిత్ హీరోయిన్ కాగా, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఆమెను వలచే హీరోలుగా నటించారు. ఆ మూవీలో హీరోయిన్ రోల్ తెలుగులోకి వచ్చేసరికి హీరో అయితే, అందులోని హీరోలు తెలుగు మూవీలో హీరోయిన్లుగా మారిపోయారు. రాఘవేంద్రరావు సొంగ బ్యానర్ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై 'అల్లరి ప్రియుడు' మూవీని కె. కృష్ణమోహనరావు నిర్మించారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. 1993లో మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లలిత, కవిత ఫ్రెండ్స్. ఒకే రోజు పుడతారు. లలిత ఒక భవన నిర్మాణ మేస్త్రీ కూతురు అయితే, కవిత బిల్డర్ రంగారావు కూతురు. ప్రమాదంలో లలిత తండ్రి చనిపోతే, అనాథ అయిన ఆమెను తన ఇంటికి తెచ్చుకొని కవిత లాగే తన కన్న కూతురిగా పెంచుతారు రంగారావు దంపతులు. అలా సొంత అక్కచెల్లెళ్లుగా పెరిగిన లలిత (రమ్యకృష్ణ), కవిత (మధుబాల) ఒకరి కోసం మరొకరు ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కవిత పేరుతో లలిత రాసిన కవితలు పత్రికల్లో పబ్లిష్ అయ్యి పాపులర్ అవుతుంటాయి. వాటిని ఫైవ్ స్టార్ మ్యూజిక్ ట్రూప్‌ను నడిపే రాజా (రాజశేఖర్) అనే గాయకుడు పాడుతూ పేరు తెచ్చుకుంటాడు. ఆ కవితలపై తన అభిమానం తెలియజేస్తూ ఉత్తరాలు కూడా రాస్తుంటాడు. అయితే వాళ్లు ముగ్గురూ కలిసిన సందర్భంలో ఆ కవితలను కవితే రాసిందంటూ రాజాకు పరిచయం చేస్తుంది లలిత. నిజమేననుకొని కవితకు దగ్గరవుతాడు రాజా. అయితే, కవితతో పాటు లలిత కూడా రాజాకు మనసిస్తుంది. అయితే ఒకరోజు తాను రాజను ప్రేమిస్తున్న విషయం లలితకు చెప్పేస్తుంది లలిత. ఖిన్నురాలైన లలిత తన ప్రేమను మనసులోనే దాచేసుకుంటుంది. ఒకానొక రోజు ఆ కవితలు రాసేది కవిత కాదనీ, లలిత అనీ రాజాకు తెలిసిపోతుంది. దాంతో రాజా ఏం చేశాడు? రాజాను లలిత గాఢంగా ప్రేమిస్తోందని తెలిసిన కవిత ఏం చేసింది? అనేది మిగతా కథ.

ప్రధాన పాత్రల్లో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల చాలా బాగా రాణించి, రక్తి కట్టించారు. వారి మధ్య ముక్కోణ ప్రేమ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఒకరికొకరు ఎవరో తెలీనప్పుడు రాజశేఖర్, రమ్యకృష్ణ పడే గొడవలు, పరస్పరం తిట్టుకొనే తీరు ఆకట్టుకున్నాయి. రమ్యకృష్ణ గ్లామర్ అదనపు ఆకర్షణ. కీరవాణి స్వరాలు కూర్చగా వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, కీరవాణి రాసిన పాటలన్నీ ప్రజాదరణ పొంది, సినిమా విజయంలో కీలక భూమిక నిర్వహించాయి. రోజ్ రోజ్ రోజాపువ్వా, అందమా నే పేరేమిటి అందమా, ప్రణయమా నీ పేరేమిటి, ఏం పిల్లది ఎంత మాటన్నది, ఉత్తరాల ఊర్వశి, అహో.. ఒక మనసుకు నేడే, చెప్పకనే చెబుతున్నది.. పాటలను జనం తెగ పాడుకున్నారు. విశేషమేమంటే.. అంత దాకా డాన్స్ రాని హీరోగా పేరుపొందిన రాజశేఖర్ వేసిన స్టెప్పులు ముచ్చటగా అనిపించి ఆయనకు పేరు తెచ్చాయి. ఆ క్రెడిట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాదే అని చెప్పాలి. రాఘవేంద్రరావు చిత్రీకరించిన తీరు, అశోక్ కుమార్ కళా దర్శకత్వం, తండ్రీకొడుకులు విన్సెంట్, అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీతో ఆ పాటలు చూడచక్కగా ఉంటాయి.

ఇవాళ మాస్ మహరాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోన్న రవితేజ ఈ మూవీలో రాజశేఖర్ మిత్రబృందంలో ఒకడిగా సైడ్ క్యారెక్టర్‌లో కనిపించడం గమనించదగ్గ విషయం. రాజశేఖర్ మ్యూజిక్ ట్రూప్ మేనేజర్ బిట్రగుంట బిళహరిగా బ్రహ్మానందం, వారు ఉండే ఇంటి ఓనర్‌గా బాబూ మోహన్ నవ్వులు పంచారు. రాజా మామ్మగా మనోరమ, పోస్ట్‌మాస్టర్‌గా సారథి, మంకీస్ అనే మ్యూజిక్ బ్యాండ్ నడిపే వాడిగా శ్రీహరి, రంగారావు మేనల్లుడు బుచ్చిబాబుగా సుధాకర్ తమ పాత్రల్ని చక్కగా పోషించి సినిమా విజయంలో తమ వంతు బాధ్యతల్ని నెరవేర్చారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.