ఆ పది తెలుగు సినిమాలు ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు.. ఎందుకో తెలుసా?
on Apr 1, 2024
ఒక సినిమా పూర్తి కావడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషి ఏదో ఒక రూపంలో ఉంటుంది. వారి వారి శక్తిమేర సినిమా బాగా రావాలనే ప్రయత్నిస్తారు. ఇక నిర్మాత తను తీసే సినిమా విడుదలై మంచి లాభాలు రావాలని ఆశిస్తాడు. తద్వారా ఇండస్ట్రీలో నిర్మాత నిలదొక్కుకొని ఇంకా మంచి మంచి సినిమాలు నిర్మించాలనుకుంటాడు. డబ్బు, కృషి, పట్టుదల ఉన్నా.. అన్నీ కలిసి రావాలి అంటారు. అలా అన్నీ కలిసి వచ్చినపుడే నిర్మాత అనుకున్నది జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో సినిమా పూర్తయిన తర్వాత కూడా విడుదలకు నోచుకోదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్న సినిమాలైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల, రిలీజ్ సమయంలో ప్రమోషన్స్‌కి డబ్బు పెట్టలేక సినిమాను రిలీజ్ చేయకుండా వదిలేస్తారు. అలా కాకుండా కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పటికీ ల్యాబ్స్‌లోనే మగ్గిపోతున్నాయి. అలా ఏయే సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి, అవి ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, మాధవి జంటగా బాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శాంతినివాసం’. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోవడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. సినిమా రిలీజ్ సమయంలో నిర్మాత హఠాత్తుగా మరణించడం వల్ల ఆ టైమ్‌లో రిలీజ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎవ్వరూ ఆ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్రయత్నించలేదు.
‘అన్నమయ్య’ వంటి భక్తిరసాత్మక చిత్రాన్ని రూపొందించిన కె.రాఘవేంద్రరావు ఆ తర్వాత ‘ఇంటింటా అన్నమయ్య’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా 2013 రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిరది. ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యలేకపోయారు.
‘7జి. బృందావన కాలని’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో రవికృష్ణ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత తన సోదరుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘జాదు’ అనే సినిమా చేశాడు రవికృష్ణ. తమిళ్లో ‘కేడీ’ పేరుతో విడుదలైంది. కానీ, తెలుగులో రిలీజ్‌కి నోచుకోలేదు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్. అప్పటికే దేవదాసు, పోకిరి వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఇలియానా ‘జాదూ’లో హీరోయిన్ అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు.
సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ హీరోగా రామ్‌ప్రసాద్ రగుతు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల నిర్మించిన చిత్రం ‘అయినా ఇష్టం నువ్వు’. కీర్తి సురేష్‌కి ఇదే తొలి సినిమా. 2016లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు.
విక్రమ్‌కి తెలుగులో ఎంతటి పాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అతనికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడిన తర్వాత అంతకుముందు తమిళ్లో చేసిన కొన్ని సినిమాలను కూడా డబ్ చేసి తెలుగులో వదిలారు. 2008లో విక్రమ్, త్రిష కాంబినేషన్లో ఎన్.లింగుస్వామి రూపొందించిన ‘భీమ’ తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ, ఈ సినిమాను విడుదల చెయ్యలేకపోయారు.
సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా ఎ.ఎన్.బోస్ దర్శకత్వంలో ఆనంద్ రంగా, శేషురెడ్డి నిర్మించిన ‘డి.కె.బోస్’ 2013లోనే రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. కోవిడ్ టైమ్‌లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని కూడా ప్రయత్నించారు. కానీ, ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు.
రియల్‌స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందిన సినిమా ‘కోతి కొమ్మచ్చి’. ‘శతమానం భవతి’ వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని రూపొందించారు. 2020లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
హిందీలో సూపర్‌హిట్ అయిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో రూపొందిన సినిమా ‘దటీజ్ మహాలక్ష్మీ’. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు.
2013లో సూర్య హీరోగా స్వీయ దర్శకత్వంలో గౌతమ్ మీనన్ ‘ధ్రువనక్షత్రం’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. అయితే క్రియేటివిటీ డిఫరెన్సెస్ వల్ల సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2015లో విక్రమ్ హీరోగా చిత్రాన్ని ప్రారంభించారు. ఏడు దేశాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఆర్థికపరమైన, ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.
2014లో కార్తీ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తమిళ్ సినిమా ‘మదరాసి’. 2010లో సుశీంద్రన్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన ‘నాన్ మహాన్ అల్ల’ చిత్రాన్ని అదే సంవత్సరం ‘నాపేరు శివ’ పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. కార్తీ, పా.రంజిత్ కాంబినేషన్లో రూపొందిన ‘మదరాసి’ చిత్రాన్ని 2022లో ‘నా పేరు శివ2’ పేరుతో రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. డబ్బింగ్‌కి సంబంధించిన పనులన్నీ పూర్తయినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు.
Also Read