ENGLISH | TELUGU  

జయప్రద సినిమా జీవితం ఎంతో ఉజ్వలం.. వ్యక్తిగత జీవితం మాత్రం అంధకారమే!

on Apr 2, 2024

అందం, అభినయం రెండూ సమపాళ్ళలో ఉంటేనే హీరోయిన్‌గా సినిమా రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఈ రెండూ ఉన్నప్పటికీ తారలుగా తారాస్థాయికి చేరుకున్నవారు అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అవకాశం జయప్రదకు దక్కింది. పెద్దయిన తర్వాత డాక్టరు కావాలని కలలు కన్న జయప్రద యాక్టర్‌గా తన ప్రతిభను వెండితెరపై చూపించే అవకాశం వచ్చింది. 14 ఏళ్ళ వయసులో స్కూల్‌ ఫంక్షన్‌లో ఆమె చేసిన నాట్యప్రదర్శన చూసి ముగ్ధుడైన నటుడు ప్రభాకరరెడ్డి.. చిత్ర పరిశ్రమకు ఆమెను పరిచయం చేశారు. 1976లో విడుదలైన ‘భూమికోసం’ చిత్రంలో ఒక పాటలో డాన్స్‌ చేయడం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జయప్రద. ఆ సినిమాకుగాను ఆమెకు లభించిన పారితోషికం కేవలం రూ.10. ఆ తర్వాతికాలంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి అత్యదిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 

1962 ఏప్రిల్‌ 3న రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది జయప్రద. ఆమె అసలు పేరు లలితారాణి. చిన్నతనంలోనే ఆమెకు నృత్యంలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. ‘భూమికోసం’ చిత్రంలో ఆమె చేసిన డాన్స్‌ చూసిన తెలుగు, తమిళ దర్శకనిర్మాతలు ఆమెకు వరస అవకాశాలు ఇచ్చారు. మొదట ఆమె హీరోయిన్‌గా తమిళ సినిమా ‘మన్మథలీలై’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కె.బాలచందర్‌ ‘అంతులేని కథ’ అనే ద్విభాషా చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు దర్శకుల్లో ఆమె మొదట కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘సిరిసిరిమువ్వ’ సినిమా చేసింది. అది కూడా ఘనవిజయం సాధించడంతో జయప్రదకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ‘అడవిరాముడు’ చిత్రంతో గ్లామర్‌ హీరోయిన్‌, కమర్షియల్‌ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సినీ పరిశ్రమకు వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ వంటి టాప్‌ హీరోలతో జోడీ కట్టారు. 1980కి ముందే ‘సిరిసిరిమువ్వ’ చిత్రం హిందీ రీమేక్‌ ‘సర్‌గమ్‌’ చిత్రంలో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా మెప్పించారు. 

మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి భాషల్లో 300కు పైగా సినిమాల్లో  నటించింది జయప్రద. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి, కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి సౌత్‌ హీరోలతోపాటు బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, జితేంద్ర, రాజేష్‌ఖన్నా వంటి టాప్‌ హీరోల సరసన నటించింది. జయప్రద కెరీర్‌ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. అయితే వీరిద్దరికీ మాటలు ఉండేవి కాదు. సినిమాల్లో మాత్రం సొంత అక్కా చెల్లెళ్ళు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా వారి నటన ఉండేది. కానీ, బయట మాత్రం ఇద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కారణాలు ఎవరికీ తెలీదు. ఆమాటకొస్తే వారిద్దరూ ఎందుకు మాట్లాడుకోరో వాళ్ళకి కూడా తెలీదు.  వారిద్దరి మధ్య మాటలు లేకపోవడం అనేది చివరి వరకు అలాగే కొనసాగింది. తన కెరీర్‌ మొత్తాన్ని ఎక్కడా ఎక్స్‌పోజింగ్‌కి తావివ్వకుండా సినిమాలు చేస్తూ హోమ్‌లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు జయప్రద. 1994లో రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ సినిమాలను పక్కన పెట్టకుండా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆమె 2023లో ఒక మలయాళ చిత్రంలో చివరిగా నటించారు. 

జయప్రద సినిమా కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా కొనసాగింది. అయితే వ్యకిగత జీవితంలో మాత్రం ఆమెకు మానసిక వ్యధే మిగిలింది. 1986లో బాలీవుడ్‌ నిర్మాత శ్రీకాంత్‌ నహతాను ప్రేమించి పెళ్ళి చేసుకుంది జయప్రద. అయితే అప్పటికే అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్‌. ఈవిషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేవి. అలా రావడానికి కారణం. వీరి పెళ్ళయిన తర్వాత శ్రీకాంత్‌ మొదటి భార్యకు మూడో సంతానం కలిగింది. అది ఆమెకు ఎంతో బాధ కలిగించిన అంశం. వాస్తవానికి శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకునే నాటికి అతనికి పెళ్ళయిందన్న విషయం ఆమెకు తెలియదు అంటారు. అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. పెళ్ళయిన తర్వాత కూడా మొదటి భార్యను వదిలిపెట్టకపోవడంతో ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్ళింది. అతని నుంచి విడిపోయిన తర్వాత మరొకరికి తన జీవితంలో స్థానం ఇవ్వలేదు జయప్రద. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఒక బిడ్డను దత్తత తీసుకొని పెంచుకున్నారు. 

1994లో ఎన్‌.టి.రామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు జయప్రద. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షాన చేరి తెలుగుదేశం మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్‌లోని ములాయం సింగ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ నా జన్మభూమి, ఉత్తరప్రదేశ్‌ నా కర్మభూమి అనే నినాదంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైంది జయప్రద. 2019లో భారతీయ జనతాపార్టీలో చేరిన ఆమె ఆ పార్టీలోనే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. 

డాక్టర్‌ కావాలని కలలు కని ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్‌ అయిన జయప్రద భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అందాల తారగా అందరి మన్ననలు పొందారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగిన జయప్రదకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.