ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ!
on Dec 17, 2024
చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీమణులు తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా తారాపథంలో దూసుకుపోయారు. వారి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే స్థాయి నటనను ప్రదర్శించిన నటీమణులు కొద్దిమందే ఉంటారు. 1970వ దశకం తర్వాత అలాంటి నటీమణిగా పేరు తెచ్చుకున్న నటి జయసుధ. తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకునే ఆమెను సహజనటి అని పిలుచుకుంటారు. పాతతరంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న సావిత్రి, జమున, వాణిశ్రీ వంటి నటీమణుల తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి జయసుధ. ఎలాంటి పాత్రనైనా తన సహజ నటనతో రక్తి కట్టించగల సమర్థత ఉన్న జయసుధ ఒక దశలో హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఆమె నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి అంటే అప్పటికి ఆమె ఎంత బిజీ హీరోయినో అర్థం చేసుకోవచ్చు. నటిగా అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన జయసుధ సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైంది, ఆమె సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
జయసుధ అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్‌లో జన్మించారు. ఆమెకు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మేనత్త అవుతారు. జయసుధకు ఊహ తెలిసే సమయానికే విజయనిర్మల రంగుల రాట్నం, పూలరంగడు, సాక్షి వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు జయసుధను షూటింగ్స్‌కి తీసుకెళ్లేవారు విజయనిర్మల. అలా జయసుధకు సినిమాలంటే ఇష్టం పెరిగింది. మేనత్తలాగే తను కూడా నటిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. అందుకే తరచూ షూటింగ్స్ చూసేందుకు మేనత్తతో కలిసి వెళుతుండేవారు. అదే సమయంలో సూపర్‌స్టార్ కృష్ణను విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లో పండంటి కాపురం చిత్రం నిర్మించేందుకు విజయనిర్మల సన్నాహాలు చేసుకున్నారు. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 12 ఏళ్ళ బాలిక కావాల్సి వచ్చింది. ఆ పాత్రను జయసుధతో చేయించాలనుకున్నారు విజయనిర్మల. అయితే దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్ చేసి ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. కృష్ణ అన్నయ్య కుమార్తెగా పండంటి కాపురం చిత్రంలో నటించారు జయసుధ. 1972 ఫిబ్రవరిలో మొదటి సారి జయసుధ కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలైంది.
కొన్ని నెలల తర్వాత కె.బాలచందర్, ఆర్.త్యాగరాజన్ వంటి దర్శకులు తమ సినిమాల్లో చిన్న పాత్రలు ఇచ్చారు. అలా 1975 వరకు దాదాపు పది తమిళ చిత్రాల్లో నటించారు. అప్పటికే సుజాత పేరుతో ఓ నటి ఉండడంతో ఆమె పేరును జయసుధగా మార్చారు ఓ రచయిత. చదువును అశ్రద్ధ చేస్తూ సినిమాల్లో నటించడం జయసుధ తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ఆమెను ప్రోత్సహించారు. 1975లో డైరెక్టర్ ఎన్.గోపాలకృష్ణ లక్ష్మణరేఖ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలోని కవిత పాత్రకు జయసుధ సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రారంభమై కొన్నాళ్ళు బాగానే షూటింగ్ నడిచినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అదే సమయంలో కె.బాలచందర్ అపూర్వ రాగంగళ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే సోగ్గాడు చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు కె.బాపయ్య. అలా జయసుధ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పూర్తి కాకముందే రెండు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అవి ఘనవిజయం సాధించడంతో హీరోయిన్‌గా జయసుధ బిజీ అయిపోయారు. లక్ష్మణరేఖ చిత్రాన్ని పూర్తి చేసేందుకు డేట్స్ ఎడ్జస్ట్ చెయ్యడం కష్టం అయిపోయింది. ప్రతిరోజూ రాత్రిళ్ళు షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేశారు జయసుధ. 1975లోనే విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించి జయసుధకు మంచి పేరు తెచ్చింది.
1976లో కె.రాఘవేంద్రరావు రెండో సినిమా జ్యోతి చిత్రంలో హీరోయిన్‌గా నటించారు జయసుధ. కె.రాఘవేంద్రరావు, జయసుధ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా జ్యోతి. ఇక అక్కడి నుంచి ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1977 ఎన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా అడవిరాముడులో జయసుధకు ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో జయసుధకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. 1980లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా ప్రేమాభిషేకం చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు దాసరి నారాయణరావు. ఆ సినిమాలోని వేశ్య పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో జయసుధ అయితే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెకు విషయం చెప్పారు దాసరి. వేశ్య పాత్ర కావడంతో చేయడానికి సంకోచించారు జయసుధ. నిడివి తక్కువే అయినా నీకు చాలా మంచి పేరు వస్తుందని దాసరి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. సినిమాలోని ఆమె పోర్షన్‌ను 10 రోజుల్లోనే పూర్తి చేసేశారు దాసరి. 1981లో విడుదలైన ప్రేమాభిషేకం సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. దాసరి చెప్పినట్టుగానే శ్రీదేవి కంటే జయసుధకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు జయసుధ.
త్రిశూలం, గృహప్రవేశం, మేఘసందేశం, అనురాగదేవత, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, కలికాలం వంటి సినిమాలు జయసుధకు సహజనటి అని పేరు తెచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే. ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్క, వదిన, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు జయసుధ. 5 దశాబ్దాలుగా వివిధ పాత్రలు పోషిస్తూ నటిగా కొనసాగుతున్న జయసుధ తన కెరీర్‌లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కిపైగా సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు జయసుధ. అంతేకాదు, భర్త నితిన్ కపూర్‌తో కలిసి జె.ఎస్.కె. కంబైన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు. తన సహజ నటనకుగాను ఉత్తమనటిగా 5 నంది అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులతోపాటు కళాసాగర్ అవార్డు, ఎఎన్నార్ నేషనల్ అవార్డు వంటి ఎన్నో అత్యున్నత అవార్డులు అందుకున్నారు జయసుధ.
జయసుధ వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ను వివాహం చేస్తున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మనస్పర్థలు రావడంతో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. 1985లో బాలీవుడ్ హీరో జితేంద్ర బంధువైన నితిన్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిహాన్, శ్రేయాన్. జయసుధకు సేవాగుణం, దానగుణం ఎక్కువ. అందుకే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి వైద్య సహాయం లేని పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ చేరి 2009లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత వైసీపీలో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరారు.
Also Read