అప్పుడు హీరోయిన్‌గా ఒప్పుకోలేదు.. ఆ తర్వాత అదే హీరోతో స్పెషల్ సాంగ్ చేసింది!
on Apr 1, 2024
ఒక సినిమాలో నటీనటుల ఎంపిక అనేది ఎంతో ప్రాధాన్యంతో కూడుకొని ఉంటుంది. తాను అనుకున్న కథలో హీరోగా ఎవరు సరిపోతారు, హీరోయిన్‌గా ఎవరైతే బాగుంటారు, మిగతా క్యారెక్టర్లు ఏ ఆర్టిస్టులు చేస్తే ప్రేక్షకులు మెచ్చుతారు అనే విషయంలో డైరెక్టర్‌కి ఒక క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ ఆలోచనకి తగిన నటీనటులు దొరికితే సగం సక్సెస్ సాధించినట్టుగా భావిస్తారు. అలా ఒక హీరోని ఫిక్స్ అయిపోయి ఎవరెన్ని చెప్పినా వినకుండా అతనితో సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి. ఆ సినిమా ‘యమలీల’. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకున్న ఎస్వీకె.. అందులో హీరో ఎవరైతే బాగుంటుంది అని ఎంతో ఆలోచించిన తర్వాత అలీ తన కథలోని హీరో క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చెయ్యగలడు అనిపించింది. అనుకున్నదే తడవుగా అలీని తన సినిమాలో బుక్ చేసేసుకున్నాడు. అయితే అతని సన్నిహితులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఎస్వీకె నిర్ణయాన్ని ఖండిరచారు. అలీ హీరో ఏమిటి? అంటూ హేళన చేశారు. అవేవీ పట్టించుకోని కృష్ణారెడ్డి.. అలీతోనే సినిమా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు.
ఇక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. తను డైరెక్ట్ చేసిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెంబర్‌వన్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న సౌందర్య అయితే బాగుంటుందనిపించింది కృష్ణారెడ్డికి. సౌందర్యకు కథ వినిపించారు. ఆమెకు కూడా కథ బాగా నచ్చింది. అయితే అందులో అలీ హీరో అని తెలుసుకున్న సౌందర్య.. కృష్ణారెడ్డికి సారీ చెప్పి సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయంలో ఎంతో అప్‌సెట్ అయిన ఎస్‌వీకే ‘యమలీల’ చిత్రంలో హీరోయిన్‌గా ఇంద్రజను ఎంపిక చేశారు. ఆమె అంతకుముందే ‘జంతర్ మంతర్’ అనే సినిమాలో నటించింది. అయితే ‘యమలీల’ ముందుగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇంద్రజ పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది.
1994 ఏప్రిల్ 28న ‘యమలీల’ విడుదలైంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాలో చూపించిన నావెల్టీకి అందరూ ఫిదా అయిపోయారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా వర్కవుట్ అయింది. దానికి తగ్గట్టుగానే అలీ తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ అలరించాడు. ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కాదనుకుంది సౌందర్య. ఆ విషయంలో తాను బాధపడ్డానని ఆ తర్వాత ఓ సందర్భంలో చెప్పింది. ఆ తర్వాత తన తప్పును సరిదిద్దుకునేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో రూపొందిన ‘శుభలగ్నం’ చిత్రంలో ‘చినుకు చినుకు.. అందెలతో..’ అనే పాటలో అలీతో కలిసి స్టెప్పులేసింది. అంతకుముందే ‘మాయలోడు’ చిత్రంలో ఇదే పాటను బాబూమోహన్, సౌందర్యలపై చిత్రీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు కృష్ణారెడ్డి. ‘శుభలగ్నం’లో మరోసారి అదే పాటను ఉపయోగించి మరోసారి ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన ఎస్వీకృష్ణారెడ్డిని నిజంగా అభినందించాల్సిందే.
Also Read