లవర్‌బోయ్ నుంచి యాక్షన్ హీరో వరకు రామ్ పోతినేని జర్నీ ఇదే!
on May 15, 2025
(మే 15 రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా..)
చిన్న వయసులోనే హీరోగా పరిచయమై సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ తరం హీరోల్లో అలా విజయం సాధించిన హీరోగా మొదట ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలి. తన 18 ఏటనే ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయయ్యారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా ఆ తర్వాత చేసిన సినిమాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత 18 సంవత్సరాలకే హీరోగా నటించిన ఘనత రామ్ పోతినేనికి దక్కుతుంది. ఎనర్జిటిక్ లవర్ బోయ్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా ‘దేవదాసు’తో ఎనర్జిటిక్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా నుంచి ‘డబుల్ ఇస్మార్ట్’ వరకు రకరకాల జోనర్స్‌లో సినిమా చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు రామ్. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల అతను హీరో అవ్వాలనుకున్నాడా.. లేక చిన్నతనం నుంచే ఆ కోరిక ఉందా? అసలు రామ్ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? అనే విషయాలు తెలుసుకుందాం.
1988 మే 15న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు రామ్ పోతినేని. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ అతనికి పెదనాన్న అవుతారు. రామ్ హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ అతని విద్యాభ్యాసం అంతా చెన్నయ్‌లోనే జరిగింది. రామ్‌కి చిన్నతనం నుంచీ సినిమాల్లో కనిపించాలని ఉండేది. తన ఆరో ఏటనే పెద్దయ్యాక హీరో అవుతానని తన క్లాస్ టీచర్‌తో చెప్పాడట. రామ్‌కి చదువు కంటే సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. 2002లో తమిళంలో రూపొందిన అడయాళం అనే షార్ట్ ఫిలింలో డ్రగ్ ఎడిక్ట్‌గా మొదటిసారి నటించారు. అందులో రామ్ పెర్‌ఫార్మెన్స్ చూసి తను నిర్మించే సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకున్నారు ఎం.ఎస్.రాజు. అయితే అప్పటికి రామ్ వయసు 13 సంవత్సరాలు. అది హీరో వయసు కాకపోవడంతో సిద్ధార్థ్‌ను తీసుకున్నారు. అదే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఆ తర్వాత ఎన్.జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న రామ్.. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రామ్ మొదటి సినిమా తనే నిర్మించాలి అనుకున్నారు స్రవంతి రవికిశోర్. కానీ, ఆ అవకాశం వై.వి.యస్.చౌదరికి దక్కింది. రామ్, ఇలియానాలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవదాసు’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తన పెర్‌ఫార్మెన్స్‌తో, స్టెప్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాదు, ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
‘ఆర్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సుకుమార్ తన రెండో సినిమా ‘జగడం’ కోసం రామ్‌ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా తన ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు రామ్. అతను హీరోగా నటించిన రెండు సినిమాలూ నిర్మించే అవకాశం స్రవంతి రవికిశోర్‌కి రాలేదు. మూడో సినిమాను తన బేనర్‌లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ హీరోగా ‘రెడీ’ పేరుతో నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్ టాలీవుడ్‌లో స్టార్ హీరో అయ్యారు. దీంతో రామ్‌కి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ క్రమంలో వచ్చిన ‘మస్కా’, ‘గణేశ్’, ‘రామరామ కృష్ణకృష్ణ’ వంటి సినిమాలు రామ్‌కి ఆశించిన విజయాల్ని అందించలేకపోయాయి. ఆ సమయంలో చేసిన ‘కందిరీగ’ అతని కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. ఆ సమయంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన ‘నేను శైలజ’ మళ్లీ రామ్‌కి ఎనర్జీనిచ్చింది. ఆ తర్వాత చేసిన ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంతో మరో సూపర్‌హిట్ అందుకున్నారు.
2019లో పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటివరకు లవర్‌బోయ్ ఇమేజ్ ఉంటూనే ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఓ కొత్త అవతారం ఎత్తారు. తన లుక్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్ని విషయాల్లోనూ ఛేంజ్ ఓవర్ అవడంతో ఓ కొత్త రామ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటివరకు అతన్ని లవర్‌బోయ్‌గా ఆదరించిన ప్రేక్షకులు మాస్ హీరోగా కూడా యాక్సెప్ట్ చేసి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఘనవిజయాన్ని అందించారు. రామ్ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇదే. ఈ సినిమా తర్వాత లవర్ బోయ్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మాస్ అండ్ యాక్షన్ సినిమాలపైనే దృష్టిపెట్టారు రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో చేసిన మూడో సినిమా ‘రెడ్’ చిత్రం సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాలో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా తర్వాత చేసిన ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు ఆశించిన స్థాయి విజయాల్ని అందుకోలేకపోయాయి. మళ్ళీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు రామ్. ప్రస్తుతం మహేష్‌బాబు దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాతో మరోసారి తన ఎనర్జీని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రామ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
