ENGLISH | TELUGU  

ఒకే పాత్రను కొన్ని వందల సినిమాల్లో చేసి మెప్పించిన మేటి నటి సూర్యకాంతం!

on Dec 18, 2024

తాము చేస్తున్న సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ, పాతతరం నటి సూర్యకాంతం తన విషయంలో అది కరెక్ట్‌ కాదని నిరూపించారు. గయ్యాళి అత్త అంటే మనకు సూర్యకాంతం గుర్తొస్తారు. ఆ పాత్రకు పేటెంట్‌ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అంతలా ముద్రపడిపోయింది. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 700కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్నీ గయ్యాళి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం. అలా వరసగా గయ్యాళి పాత్రలు చేసి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రల ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ, జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.

1924 అక్టోబర్‌ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. అందరి కంటే చిన్నది కావడంతో ఆమెను ఎంతో గారాబం చేసేవారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్‌లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా అవేవీ పట్టించుకోకుండా నాటకాల్లో కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూల్‌లో నాటకాలు వేశారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్‌ నాట్యమండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాబారం వంటి నాటకాల్లో నటించారు. 

ఆ సమయంలోనే జెమిని సంస్థవారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలి అని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాళ్లు ఇద్దరు మద్రాస్‌ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారితోపాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికీ చిన్న చిన్న వేషాలు ఇచ్చారు. అదే సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద నారది చిత్రంలో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమినివారు తమతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పారు. పుల్లయ్య కూడా పెద్ద డైరెక్టరేనని, ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం. దీంతో జెమినీవారు సూర్యకాంతంకి ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి అడక్కుండా అగ్రిమెంట్‌ని రద్దు చేసుకున్నారు. అలా 1946లో విడుదలైన నారద నారది చిత్రంలో తొలిసారి నటించారు. ఈ సినిమా తర్వాత 1949 వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి సూర్యకాంతం హిందీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కుకున్న తర్వాతే హిందీలోకి వెళితే బాగుంటుందని దర్శకుడు సి.పుల్లయ్య ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోనే నటిగా కొనసాగారు. 

1950లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రంతో సూర్యకాంతం కెరీర్‌ గొప్ప టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాళి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతంను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలే అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లిచేసిచూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్‌, తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగు నీడలు, అప్పుచేసి పప్పుకూడు.. ఇలా దాదాపు 20 సంవత్సరాలపాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 1962లో సూర్యకాంతం చేసిన గుండమ్మకథకు చాలా విశేషాలు ఉన్నాయి. అప్పటికే ఎన్‌.టి.ఆర్‌. ఎఎన్నార్‌ తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు. వారిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ గుండమ్మకథ అనే టైటిల్‌ని పెట్టడం ఆరోజుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ప్రతి సినిమాలోనూ గయ్యాళి పాత్ర పోషించినా.. అందులోనే విభిన్నమైన కోణాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. సూర్యకాంతంను తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాలను ఎంతో ఆదరించేవారు. 

సినిమాల్లో గయ్యాళి పాత్రలు చేసి అందరితోనూ తిట్లు తినే సూర్యకాంతం నిజ జీవితంలో సౌమ్యంగా ఉండేవారు. పెద్దలను గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి. ఆమె షూటింగ్‌కి వెళుతున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్ళేవారు. తన సహనటీనటులకు, సాంకేతిక నిపుణులకు వాటిని కొసరి కొసరి వడ్డించేవారు. అంతేకాదు, రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్‌కి తీసుకొచ్చేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతోపాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్‌ చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటికి మరమ్మతులు చేయించి, పెయింట్‌ వేయించి తిరిగి అమ్మేవారు. ఆరోజుల్లో నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయని గ్రహించిన సూర్యకాంతం.. విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్‌ కిట్‌లను తెప్పించి నటీనటులకు అమ్మేవారు. 

ఇక వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. సూర్యకాంతం నాటకాలు వేసే రోజుల్లోనే న్యాయవాదిగా పనిచేసే పెద్దిభొట్ల చలపతిరావు కూడా నాటకాల్లో నటించేవారు. ఆయన తెనాలి నుంచి మద్రాస్‌ షిప్ట్‌ అయిన తర్వాత 1950లో చలపతిరావును వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. వీరికి సంతానం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుడ్ని నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టుకున్నారు. సూర్యకాంతంకి దానగుణం ఎక్కువ. వికలాంగులకు, వృద్ధకళాకారులకు ఆర్థికసాయం చేసేవారు. అలాగే సినిమాల్లో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్ళకు పంపించేవారు. గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకునేవారు కాదు. తిరుపతిలో ఆమె పేరుమీద ఒక కాటేజీ ఉండేది. మూడు వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కట్టించారు సూర్యకాంతం. 

ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే.. ఒక సినిమాలో నటుడు నాగయ్యను నోటికొచ్చినట్టు తిట్టే సీన్‌ చెయ్యాల్సి వచ్చింది. అది పూర్తవ్వగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం. ‘నువ్వు కాదు నన్ను తిట్టింది.. నీ పాత్ర.. దానికెందుకమ్మా బాధపడతావు. ఊరుకో’ అని ఓదార్చారు నాగయ్య. స్యూరకాంతం నవలలు ఎక్కువగా చదివేవారు. ఓ పక్క నటిస్తూనే ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చెయ్యాలనుకున్నారు. ప్రతిరోజూ రాత్రి పూట చదువుకునేవారు. దీని వల్ల పగలు షూటింగులో ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి ‘నటిగా నీకు ఇంత మంచి పేరు ఉంది. డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చెయ్యొచ్చు. సినిమా అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు’ అని సీరియస్‌గా చెప్పడంతో డిగ్రీ చెయ్యాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం. 50 ఏళ్ల వయసులో మరాఠి, ఫ్రెంచ్‌ భాషలు నేర్చుకున్నారు. 

చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు సూర్యకాంతం. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారు కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 డిసెంబర్‌ 18న కన్నుమూశారు సూర్యకాంతం. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. 50 సంవత్సరాలు నటిగా కొనసాగి, దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం చనిపోయారన్న వార్త తెలిసి కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి అంజలీదేవి, జమున, అల్లు రామలింగయ్య, జి.వరలక్ష్మీ, వాణిశ్రీ వంటి పది మంది మాత్రమే వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తన సహజ నటనతో లక్షల మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం ఆత్మకు వారి నివాళే నిజమైన శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

(డిసెంబర్ 18 సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..)


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.