550 సార్లు రీ రిలీజ్ అయి రికార్డుల్లోకి ఎక్కిన సినిమాలో ఎన్నో విశేషాలు, మరెన్నో వివాదాలు!
on Apr 1, 2024
పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకు సెకండ్ రిలీజ్ అంటూ మళ్ళీ విడుదల చేసేవారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చేవారు. ఇప్పుడదే ట్రెండ్‌గా మారింది. ఈమధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి, అవుతున్నాయి. సాధారణంగా ఒక సినిమాను రెండుసార్లు లేదా మూడు సార్లు రీరిలీజ్ చేస్తారు. కానీ, 550 సార్లు రీ రిలీజ్ అయిన సినిమా ఉందనే విషయం మీకు తెలుసా? ఇద్ది ఎవ్వరూ నమ్మలేని నిజం. అదే కన్నడలో రూపొందిన ‘ఓం’ సినిమా. శివరాజ్‌కుమార్ హీరోగా, ప్రేమ హీరోయిన్‌గా ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 19 మే, 1995లో విడుదలై సంచలనం సృష్టించింది. అప్పటివరకు కన్నడలో ఆ తరహా చిత్రం రాలేదు. కథ, కథనం, క్యారెక్టర్లు.. ఇలా అన్ని విషయాల్లో ఉపేంద్ర కొత్తదనం చూపించాడు. దాంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని రికార్డులు సృష్టించింది. 20 సంవత్సరాల్లో అంటే 2015 వరకు ఈ సినిమా 550 సార్లు రీరిలీజ్ అయింది. ఏ విధంగా చూసినా ఇది నమ్మశక్యం కాని విషయం. అందుకే ఈ రికార్డును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పొందుపరిచారు.
ఈ సినిమా రూపొందడం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. అలాగే సినిమా నిర్మాణంలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడు ఉపేంద్ర ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అతని సినిమా చూసేవారందరికీ తెలుసు. అప్పటివరకు ఎవరూ అటెమ్ట్ చెయ్యని అంశాన్ని తీసుకొని సినిమాలు తీస్తూ ఘనవిజయాలు అందుకుంటాడు. ‘ఓం’ చిత్రం విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అయ్యాడు. అతని కాలేజ్ డేస్‌లోనే ఈ కథను రాసుకున్నాడు. ఎవరో రాసిన ఒక ఉత్తరాన్ని అతని స్నేహితుడు కాలేజికి తీసుకురావడంతో అదొక సంచలనంగా మారింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ‘ఓం’ చిత్రం ప్రథమార్థాన్ని రాసుకున్నాడు. సెకండాఫ్‌ని ఆర్గనైజ్‌డ్ క్రైమ్, మాఫియాలోని కొన్ని యదార్థ ఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు. అయితే ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ విడుదలైంది. ఉపేంద్ర రాసిన కథ కూడా ఇంచుమించు అలాగే ఉండడంతో డిజప్పాయింట్ అయి కొన్ని మార్పులు చేర్పులతో మరో కొత్త కథను చేసుకున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. యదార్థంగా అండర్‌వరల్డ్‌లో పనిచేసిన ఎంతో మంది నేరస్తులు, నిందితులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటింపజేయడానికే కొందరిని బెయిల్‌పై బయటికి తీసుకు రావడం విశేషం. అప్పట్లో కర్ణాటకలో పేరు మోసిన రౌడీషీటర్లు కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి వారు ‘ఓం’ చిత్రంలో నటించారు. ఈ విషయాలన్నీ బయటికి రావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ‘ది వీక్’ మ్యాగజైన్ ‘ఓం’ చిత్రంపై ఒక కవర్ స్టోరీని రాసింది. దేశవ్యాప్తంగా లెజండరీ నటుడిగా రాజ్‌కుమార్‌కి ఎంతో పేరుంది. అలాంటి నటుడి బేనర్‌లో ఇలాంటి సినిమా నిర్మించకుండా ఉంటే బాగుండేదని ఆ కథనంలో రాసుకొచ్చారు.
మొదట ఈ సినిమా క్లైమాక్స్ చూసిన సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. క్లైమాక్స్‌లో భారీగా మార్పులు చేస్తే తప్ప సర్టిఫికెట్ ఇవ్వం అని స్పష్టం చేసింది. వారు చెప్పినట్టుగానే కొన్ని మార్పులు చేసి సర్టిఫికెట్ పొందారు. రూ.70 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పంపిణీ హక్కులను హెచ్.డి. కుమారస్వామి సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, ఉత్తమ నటిగా ప్రేమ, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్‌లు అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్(సౌత్)ను శివరాజ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. బెంగళూరులోని కపిల్ థియేటర్‌లో ‘ఓం’ చిత్రాన్ని అత్యధికంగా 30సార్లు రీ రిలీజ్ చేశారు. ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మరో రికార్డు ఏమిటంటే.. ఈ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ళ తర్వాత 2015లో డిజిటల్ రైట్స్‌కి విక్రయానికి పెట్టగా రూ.10 కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది.
ఈ చిత్రాన్ని తెలుగులో డా.రాజశేఖర్ హీరోగా, ప్రేమ హీరోయిన్‌గా ‘ఓంకారమ్’ పేరుతో 1997లో నిర్మించారు. తెలుగు వెర్షన్‌కి కూడా ఉపేంద్రే దర్శకత్వం వహించాడు. అయితే ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. హిందీలో లవ్‌స్టోరీ, బేతాబ్ వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన దర్శకుడు రాహుల్ రావైల్ 1999లో ‘ఓం’ చిత్రాన్ని ‘అర్జున్ పండిట్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. సన్నిడియోల్, జుహీ చావ్లా హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read