హిట్ ఫిల్మ్ 'రాముడు కాదు కృష్ణుడు' విడుదలై నేటికి 40 ఏళ్లు!
on Mar 25, 2023
అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో అత్యధిక శాతం విజయం సాధించినవే. వాటిలో ఒకటి 40 ఏళ్ల క్రితం వచ్చిన 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రం ఒకటి. 1983 మార్చి 25న విడుదలైన ఈ సినిమాలో అక్కినేని సరసన నాయికలుగా జయసుధ, రాధిక నటించారు. కథ, చిత్రానువాదం, సంభాషణలు, పాటలు కూడా దాసరే రాశారు. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్‌పై ఎన్.ఆర్. అనూరాధాదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈమె ఎవరో కాదు, అలనాటి నటీమణి, మనదేశం చిత్రంతో ఎన్టీఆర్‌ను నటునిగా పరిచయం చేసిన సి. కృష్ణవేణి కుమార్తె. 'రాముడు కాదు కృష్ణుడు'లో నాగేశ్వరావు ద్విపాత్రాభినయం చేశారు.
రాము (అక్కినేని నాగేశ్వరరావు) కోటీశ్వరుడైన బహదూర్ అప్పారావు (సత్యనారాయణ) కుమారుడు. అతను మంచి మనసున్నవాడే కాదు, కొంచెం అమాయకత్వం ఉన్నవాడు కూడా. అతని మేనమామ గోపాలరావు (రావు గోపాలరావు) ఒక మోసగాడు. కూతురు జయమ్మ (జయమాలిని)ని రాముకిచ్చి పెళ్లిచేసి, అతని ఆస్తినంతా తన హస్తగతం చేసుకోవాలనే దురాలోచన ఉన్నవాడు. ఆ ఇంట్లో వరాలు (జయంతి) ఒక్కతే రామును బాగా చూసుకొనే వ్యక్తి. ఆమె చనిపోయిన రాము అన్న భార్య. రాము పేదింటి అమ్మాయి శారద (రాధిక)ను ప్రేమిస్తాడు. అయినా తండ్రి ఆజ్ఞ మేరకు మరదలు జయమ్మను పెళ్లి చేసుకోడానికి సిద్ధపడతాడు. జయమ్మకు మేనబావ గిరి (గిరిబాబు)తో శారీరక సంబంధం ఉందనే విషయం రాముకు చెబుతుంది వరాలు. దీంతో రాము, వరాలుకు మధ్య అక్రమ సంబంధం ఆపాదించి వరాలును ఆమె ఇద్దరు పిల్లలతో ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేస్తాడు గోపాలరావు. రాము కూడా ఆ ఇంట్లో ఉండలేనని వెళ్లిపోతాడు. అప్పారావును దివాళా తీయించి, ఆయనను పిచ్చివాడిగా చిత్రీకరించి ఆ ఇంట్లోనే బంధించి ఉంచుతాడు గోపాలరావు.
మరోవైపు రాము తమ్ముడైన కృష్ణ తన తల్లి లక్ష్మి (సుకుమారి)తో కలిసి ఉంటూ, సత్య (జయసుధ) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అనుకోకుండా రాము, కృష్ణ పరస్పరం తారసపడతారు. గోపాలరావు కుట్ర కారణంగా తను గర్భవతిగా ఉన్నప్పుడు అప్పారావు తనను వదిలివేశాడని లక్ష్మి ఆ ఇద్దరికీ గతం వివరిస్తుంది. విచ్చిన్నపైపోయిన ఆ కుటుంబాన్ని ఒక్కటి చేసే బాధ్యత తీసుకున్న కృష్ణ ఏం చేసి, గోపాలరావు ఆట కట్టించాడనేది క్లైమాక్స్.
రాము, కృష్ణగా రెండు భిన్న మనస్తత్వాలున్న పాత్రలను అక్కినేని ఎంతో వేరియేషన్‌తో నటించి సినిమాను తన భుజాల మీద మోసుకుపోయారు. రాధిక, జయసుధ ఆయన సరసన నాయికలుగా సరిగ్గా సరిపోయారు. ఇద్దరికిద్దరూ హుషారుగా ఆ పాత్రల్ని పోషించారు. నిజానికి ఈ మూవీలో జయసుధ, జయప్రదలను హీరోయిన్లుగా ఎంచుకున్నారు దాసరి. అయితే జయప్రదకు ఆ సమయంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో రాధిక వచ్చారు. అక్కినేని సరసన రాధిక నటించిన తొలి సినిమా ఇదే. రావు గోపాలరావు విలనీ సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది! రాము ఆఫీసులో పనిచేసే గుమాస్తా లింగంగా అల్లు రామలింగయ్య తనదైన మార్క్ కామెడీతో నవ్వించారు. అప్పారావుగా సత్యనారాయణ, వరాలుగా జయంతి, లక్ష్మిగా సుకుమారి, గోపాలరావు తల్లి కాంతమ్మగా సూర్యకాంతం, భార్య రాధమ్మగా రాజసులోచన, గిరిగా గిరిబాబు, జయమ్మగా జయమాలిని, మమతగా మమత తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభాకర రెడ్డి, సత్యేంద్రకుమార్, కొసరాజు అతిథి పాత్రలో కనిపించారు.
చక్రవర్తి సంగీతం సమకూర్చిన 'ఒక లైలా కోసం', 'చూశాకా నిను చూశాకా', 'ఒక చేత తాళి' పాటలతో పాటు 'అందమంతా అరగదీసి', 'అన్నం పెట్టమంది అమ్మ' లాంటి స్పెషల్ సాంగ్స్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినా 'ఒక లైలా కోసం సాంగ్' వినిపించేది. 'చూశాకా నిను చూశాకా' పాటను మద్రాస్‌లోని వీజీపీ గార్డెన్స్‌లో కేవలం రెండున్నర గంటల వ్యవధిలో చిత్రీకరించి రికార్డ్ నెలకొల్పారు దాసారి. ఈ పాట మొత్తం అక్కినేని, జయసుధను వీజీపీ చుట్టూ పరిగెత్తించారు కొరియోగ్రాఫర్ సలీం.
బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన ఈ సినిమా నిర్మాతకు, పంపిణీదారులకు మంచి లాభాలు సమకూర్చి పెట్టింది. ఈ మూవీ శతదినోత్సవం మద్రాస్‌లోని తాజ్ కోరమాండల్ హోటల్లో కన్నుల పండువగా జరిగింది. హిందీ స్టార్ యాక్టర్ జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక సభకు డైరెక్టర్ వి. మధుసూదనరావు అధ్యక్షత వహించారు.