'శివయ్య'గా రాజశేఖర్ అలరించి నేటికి పాతికేళ్లు!
on Mar 27, 2023
రాజశేఖర్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన హిట్ ఫిల్మ్ 'శివయ్య'. 'మృగం'తో డైరెక్టర్‌గా పరిచయమై అందర్నీ తనవైపుకు తిప్పుకున్న సురేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోనికా బేడి, సంఘవి నాయికలుగా నటించారు. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చిన పాటలు జనాదరణ పొందాయి. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 1998 మార్చి 27న 'శివయ్య' చిత్రం విడుదలైంది.
శివయ్య (రాజశేఖర్) తన చెల్లెలి ఇంటర్మీడియేట్ చదువు కోసం ఊరి నుంచి నగరానికి వస్తాడు. అక్కడి మిఠాయికొట్టు యజమాని కూతురైన శిరీష (సంఘవి) అతడికి మనసిస్తుంది. లోకల్‌గా జనాన్ని బెదిరిస్తూ సమాంతర రాజ్యం నడుపుతున్న జ్యోతి (మోహన్ రాజ్), పూర్ణ (రవిబాబు) అనే గూండాలతో శివయ్య తలపడతాడు. నమ్మినవాళ్లే ద్రోహం చెయ్యడంతో శివయ్య వాళ్ల చేతుల్లో దారుణంగా గాయపడతాడు. అతని కళ్లముందే చెల్లెలిపై అత్యాచారం చేస్తారు.
ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోజా (మోనికా బేడి) వచ్చి, శివయ్య గతం గురించి చెబుతుంది. తన కుటుంబ గౌరవం కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా ఎలా దూరం పెట్టాడో తెలియజేస్తుంది. శివయ్య జనాల్ని చైతన్యవంతుల్ని చేసి కోర్టులో గూండాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి, వారికి శిక్ష పడేలా చూడ్డంతో కథ ముగుస్తుంది.
ఊరికి సంబంధించిన సన్నివేశాల్ని తూర్పుగోదావరి జిల్లాలోని కోడూరుపాడు అనే గ్రామంలో చిత్రీకరించి, సిటీకి సంబంధించిన సీన్లను హైదరాబాద్ పరిసరాల్లో తీశారు. పోసాని కృష్ణమురళి రాసిన సంభాషణలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. క్లైమాక్స్‌లోని కోర్టు సీన్‌లో శివయ్య మాటలు కూడా బాగా పేలాయి. అయితే కొన్ని సందర్భాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. 'మొదటిసారి ముద్దుపెడితే ఎలాగుంటది' పాట బాగా పాపులర్ అయ్యింది.
శివయ్య క్యారెక్టర్‌లో రాజశేఖర్ శివతాండవం చేసిన ఈ మూవీలో సంఘవి గ్లామర్ రోల్‌లో, మోనికా బేడి పోలీస్ క్యారెక్టరులో అలరించారు. గూండాలు జ్యోతి, పూర్ణ పాత్రల్లో మోహన్ రాజ్, రవిబాబు విలనీని బాగ్రా ప్రదర్శించారు. అపార్ట్‌మెంట్ వాసులుగా అనేకమంది పాపులర్ నటులు ఈ మూవీలో కనిపించారు. వారిలో ఏవీఎస్, రాళ్లపల్లి, జయప్రకాశ్ రెడ్డి, మాడా, పిఎల్ నారాయణ లాంటివారున్నారు.
ఈ మూవీ 100 రోజుల వేడుక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
Also Read