పాతికేళ్ల ఫ్యామిలీ ఫిల్మ్ 'మావిడాకులు'
on Mar 20, 2023
జగపతిబాబును ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో 'మావిడాకులు' కూడా ఒకటి. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. రవిబాబు నటునిగా పరిచయమైంది ఈ సినిమాతోటే. బెంగాలీ అమ్మాయి రచన నాయికగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం ఒక ప్లస్ పాయింట్. శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె. భగవాన్, డీవీవీ దానయ్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జె. పుల్లారావు సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమా సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. అంటే 1998లో మార్చి 20న విడుదలైంది.
మావిడాకులు అనేవి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినవి. పండగలకు, పబ్బాలకు ఇంటి ద్వారాలను మావిడాకులతో అలంకరిస్తారు. వాటితో అలా అలంకరించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలాగే పెళ్లిలోనూ మావిడాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ చిత్ర కథకూ, మావిడాకులకూ సంబంధం ఉంది. ప్రతాప్ ఆహా అనే టీవీ చానల్లో క్రియేటివ్ హెడ్‌గా వర్క్ చేస్తుంటాడు. పెళ్లైన కొద్ది కాలానికే భార్యతో విడాకులు తీసుకొని, పసిపాపను తనే పెంచుతుంటాడు. ఇంకోవైపు ప్రియ ఓహో అనే చానల్‌కు క్రియేటివ్ హెడ్. ఆమె హాస్పిటల్లో కొడుకును కనడం, కోర్టులో భర్తతో విడాకులు మంజూరవడం ఒకేసారి జరుగుతాయి. ఆహా, ఓహో చానళ్లు ఒకదానికొకటి పోటీ చానళ్లు కావడంతో ప్రతాప్, ప్రియ ఇద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి కుస్తీలు పడుతుంటారు. ప్రతాప్ కూతురు పప్పీ, ప్రియ కొడుకు బబ్లూ ఇద్దరూ సింగిల్ పేరెంట్ లవ్‌తో విసిగిపోతుంటారు. తనకు తల్లి కావాలని ప్రియ, తనకు తండ్రి కావాలని బబ్లూ కోరుకుంటూ ఉంటారు. ప్రతాప్ మాజీ మామగారైన బాపినీడు ఎలాగైనా మాజీ అల్లుడికి ఇంకో పెళ్లిచెయ్యాలని కంకణం కట్టుకొని ఒక నాటకం ఆడతాడు. దాంతో ప్రతాప్, ప్రియ.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఇండాల్సి వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ, ప్రతాప్, ప్రియ.. ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఆ ఇద్దరికీ ఎలా పెళ్లి జరిగిందనేది మిగతా కథ.
ప్రతాప్, ప్రియ మధ్య వృత్తిపరమైన పోటీతో వచ్చే స్పర్ధలు తొలిగి, ఆ ఇద్దరూ పరస్పరం దగ్గరయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే పిల్లల సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఆహా చానల్ ఓనర్‌గా ఏవీఎస్, ఓహో చానల్ ఓనర్‌గా తనికెళ్ల భరణి, లవంగం క్యారెక్టర్లో బ్రహ్మానందం.. అలాగే మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ కామెడీ క్యారెక్టర్లతో నవ్వించారు. ప్రతాప్ మాజీ మామగారు బాపినీడుగా కోట శ్రీనివాసరావు ఒక కీలక పాత్రలో సినిమాకు ఎస్సెట్ అయ్యారు. దాసరి నారాయణరావు సినిమా 'కల్యాణ ప్రాప్తిరస్తు'లో హీరోయిన్గా నటించిన కావ్య ఈ సినిమాలో ప్రతాప్‌ను ఆకట్టుకొని, అతడి భార్య కావాలని ఆశిస్తూ అతడి ఇంటికి పనిమనిషిగా వచ్చే మాధురి వ్యాంప్ తరహా పాత్రలో కనిపిస్తుంది. జగపతిబాబు, కావ్యలపై ఓ పాట కూడా ఉంది.
బలభద్రపాత్రుని రమణి, ఈవీవీ సంయుక్తంగా కథ అందించిన ఈ సినిమాకు జనార్దన మహర్షి ప్రభావవంతమైన సంభాషణలు రాశారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, కె. రవీంద్రబాబు ఎడిటర్‌గా, శ్రీనివాసరాజు ఆర్ట్ డైరెక్టర్‌గా తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. కోటి స్వరాలు కూర్చిన పాటలకు సీతారామశాస్త్రి, భువనచంద్ర, మధుఫల (పరిచయం) సాహిత్యం అందించారు. ఈ పాటలకు డీకేఎస్ బాబు, రాజు సుందరం, రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ సమకూర్చారు.
Also Read