
బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ నటులు వచ్చారు.. వెళ్లారు. కానీ మూడు దశాబ్దాలకు పైగా తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు మాత్రం షారుఖ్ ఖాన్. రొమాంటిక్ లవర్ బాయ్‌గా మొదలైన ఆయన ప్రయాణం.. యాక్షన్ సినిమాలతో మరో స్థాయికి చేరింది. ఒకప్పుడు ప్రేమకథలతో అమ్మాయిల మనసు దోచుకున్న షారుఖ్.. ఇప్పుడు యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు.
నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన కింగ్ ఖాన్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్-10 చిత్రాలు ఏవో చూద్దాం.
దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే:
షారుఖ్ ఖాన్‌ను రొమాంటిక్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఇది. రాజ్ పాత్రలో ఆయన నటన, కాజోల్‌తో కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేమకథలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
స్వదేశ్:
కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లోనూ షారుఖ్ తన సత్తా చాటారు. అమెరికాలో పనిచేసే శాస్త్రవేత్త మోహన్ భార్గవ్‌గా ఆయన నటన అద్భుతం. సొంత గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి అక్కడి సమస్యలను చూసి ఎలా మారిపోయాడనేది ఈ సినిమా కథ. థియేటర్లలో ఆశించిన స్థాయి విజయం అందుకోకపోయినా.. కాలక్రమంలో కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
చక్ దే ఇండియా:
రొమాంటిక్ సినిమాలకే పరిమితం కాకుండా ఓ స్పోర్ట్స్ డ్రామాతోనూ మెప్పించారు షారుఖ్. మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా కబీర్ ఖాన్ పాత్రలో జీవించారు. దేశభక్తి, టీమ్ స్పిరిట్, ఓటమి నుంచి గెలుపు దిశగా సాగే ప్రయాణం ఈ సినిమాకు ప్రధాన బలం.
కల్ హో నా హో:
షారుఖ్ ఖాన్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎమోషనల్ లవ్ స్టోరీల్లో ఇదొకటి. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమన్ మాథుర్ పాత్రలో షారుఖ్ అద్భుతంగా నటించారు. తన జీవితంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ.. పక్కన ఉన్నవాళ్ల జీవితాల్లో సంతోషం నింపే వ్యక్తిగా షారుఖ్ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
మై నేమ్ ఈజ్ ఖాన్:
షారుఖ్ నటనా ప్రతిభను మరో కోణంలో చూపించిన సినిమా ఇది. ఆస్పెర్గర్ సిండ్రోమ్ ఉన్న రిజ్వాన్ ఖాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. 9/11 దాడుల తర్వాత అమెరికాలో ముస్లింలపై పెరిగిన వివక్ష, ఒక వ్యక్తి ఎదుర్కొనే కష్టాలను ఈ సినిమా ద్వారా చూపించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు లభించింది.

వీర్ జారా:
ప్రేమకు దేశ సరిహద్దులు అడ్డుకావని చెప్పిన అందమైన ప్రేమకథ ఇది. భారతీయ వైమానిక దళ అధికారి వీర్ ప్రతాప్ సింగ్‌గా షారుఖ్ నటన, ప్రీతి జింటాతో ఆయన కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎన్నోమందికి ఫేవరెట్.
డర్:
షారుఖ్ ఖాన్ కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో 'డర్' కూడా ఒకటి. యష్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రాహుల్ మెహ్రా పాత్రలో నటించారు. ఒక అమ్మాయిపై విపరీతమైన ప్రేమ పెంచుకుని, ఆమెను దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా షారుఖ్ నటన ప్రేక్షకులను భయపెట్టింది.
బాజీగర్:
కెరీర్ ప్రారంభంలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు షారుఖ్ వెనుకాడలేదు. అజయ్ శర్మ పాత్రలో ఆయన చూపించిన నటన అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. సంప్రదాయ హీరో ఇమేజ్‌కు భిన్నంగా కనిపిస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించవచ్చని ఈ సినిమాతో నిరూపించారు.
దేవదాస్:
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో దేవదాస్‌గా షారుఖ్ నటన మరో లెవల్‌లో ఉంటుంది. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ వంటి నటీమణులతో కలిసి చేసిన ఈ చిత్రం భారీ విజువల్స్, సంగీతం, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమలో విఫలమైన వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణలను ఆయన అద్భుతంగా పలికించారు.
కుచ్ కుచ్ హోతా హై:
షారుఖ్ ఖాన్ రొమాంటిక్ ఇమేజ్‌ను మరింత బలపరిచిన చిత్రం ఇది. రాహుల్ పాత్రలో ఆయన నటన, కాజోల్‌తో స్నేహం, ప్రేమ, రాణి ముఖర్జీతో రొమాన్స్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కరణ్ జోహార్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇప్పటికీ బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీస్‌లో ఒకటి.
ఈ పది సినిమాలే కాకుండా షారుఖ్ కెరీర్‌లో చెప్పుకోవాల్సిన చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి. కభీ హాన్ కభీ నా, దిల్ సే, రబ్ నే బనాదీ జోడీ, డాన్, కభీ ఖుషీ కభీ గమ్, దిల్ తో పాగల్ హై, హే రామ్ వంటి సినిమాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
[Shah Rukh Khan Top 10 Movies, Shah Rukh Khan Birthday Special, Shah Rukh Khan Best Movies, Shah Rukh Khan Birthday, Best SRK Movies, Shah Rukh Khan Blockbusters, Shah Rukh Khan]





