సెకండ్ డే మరింత ఎక్కువగా 'పుష్ప' హిందీ వసూళ్లు! నార్త్‌లో బన్నీ మేనియా!!
on Dec 19, 2021
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' హిందీ వెర్షన్ రెండో రోజు అంచనాలను మించిన కలెక్షన్స్‌ను రాబట్టింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ మూవీ హిందీ బెల్ట్‌లో రెండో రోజు రూ. 4 కోట్ల నెట్ సాధించింది. తొలిరోజు హిందీ సినిమా రూ. 3 కోట్ల నెట్‌ను సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఫస్ట్ డే కంటే సెకండ్ డే రూ. 1 కోటి ఎక్కువ వసూళ్లు సాధించిన 'పుష్ప' హిందీ వెర్షన్ బయ్యర్లను ఆనంద డోలికల్లో ముంచేసింది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతోటే అక్కడ రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మాస్ ఏరియాల్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పుష్ప' సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈరోజు కలెక్షన్లు కూడా సాలిడ్‌గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
కూలివాడి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగే పుష్పరాజ్ కథతో సుకుమార్ తీసిన 'పుష్ప' మూవీని హిందీ ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మార్కెట్ పెరుగుతోందనేందుకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి హిందీ వెర్షన్‌కు నిర్మాతలు పెద్దగా ప్రమోషన్ నిర్వహించింది లేదు. కేవలం యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తోటే 'పుష్ప'పై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా విడుదలయ్యాక టైటిల్ రోల్లో బన్నీ ప్రదర్శించిన అభినయం వారిని అమితంగా ఆకట్టుకుంటోందని వసూళ్లు తెలియజేశాయి. మహారాష్ట్రలోని మాస్ ఏరియాల్లో 'పుష్ప'ను చూసేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. సెకండ్ లాక్డౌన్ తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకున్నాక ఒక డబ్బింగ్ సినిమాకు వరుసగా రూ. 3 కోట్లు, రూ. 4 కోట్ల వసూళ్లు రావడం.. అదీ ఒక డబ్బింగ్ మూవీకి రావడం.. అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు.