ఆస్కార్‌కి వెళ్లిన ఇండియన్ మూవీ.. ఇండియాలోనే బ్యాన్ కాబోతోందా?
on Mar 27, 2025
ప్రతి ఏడాదీ ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని వైవిధ్యమైన సినిమాలు, అందరి దృష్టినీ ఆకర్షించే సినిమాలు ఉంటాయి. మరికొన్ని సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి, అమానుష ఘటనల గురించి ప్రశ్నించేవిగా ఉంటాయి. ఏ జోనర్‌లో చేసిన సినిమా అయినా థియేటర్‌లో రిలీజ్ అవ్వాలంటే సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ వారు ఇచ్చే సర్టిఫికెట్ తప్పనిసరి. సెన్సార్‌కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి పరిధిలో ఉన్న సినిమాలకే సర్టిఫికెట్స్ ఇస్తుంటారు. పరిధి దాటిన సినిమాలకు మాత్రం సర్టిఫికెట్ ఇచ్చేందుకు కొన్ని షరతులు విధిస్తారు. అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించడం లేదా తగ్గించడం వంటివి సూచిస్తారు. ఇండియాలో సెన్సార్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు సర్టిఫికెట్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. అలా ఇప్పుడు మరో సినిమాకి సెన్సార్ కష్టాలు వచ్చాయి. ఆ సినిమా పేరు ‘సంతోష్’.
సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ అనే హిందీ సినిమాకి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు లభించాయి. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని అన్‌సెర్టయిన్ రిగార్డ్ విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించగా విమర్శకుల మంచి రివ్యూస్ వచ్చాయి. 78వ బఫ్తా అవార్డులకు ‘సంతోష్’ నామినేట్ అయింది. 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా యూకే నుంచి ఎంట్రీకి ఎంపికైంది. డిసెంబర్ షార్ట్ లిస్ట్‌లో ‘సంతోష్’ చిత్రం నిలిచింది. ఇండియాలో 2025 జనవరి 10న విడుదల చేస్తామని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, సినిమాకి సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. సినిమాను విడుదల చెయ్యాలంటే కట్ చెయ్యాల్సిన సీన్స్ చాలా ఉన్నాయని బోర్డు వివరించింది. ముఖ్యంగా పోలీసుల ప్రవర్తన, క్రూరత్వం, కుల వివక్ష వంటి సున్నితమైన సమస్యలను తీసుకొని ఈ కథను తయారు చేసుకొని విమర్శనాత్మకంగా చిత్రాన్ని రూపొందించారు. కానీ, పోలీసులకు నైతికత లేదని చెబుతూ వారిని క్రూరంగా చూపించారని, దానికి సంబంధించి కట్స్ విధిస్తున్నామని తెలిపింది సెన్సార్.
సెన్సార్ తీరును ‘సంతోష్’ దర్శకనిర్మాతలు తప్పుబడుతున్నారు. వారు చెప్పిన కట్స్ చేయడం వల్ల సినిమాలో ఉన్న అసలైన సోల్ మిస్ అవుతుందని చెబుతున్నారు. సెన్సార్ చెప్పినట్టుగా సీన్స్ కట్ చేస్తే సినిమా స్వరూపం మారిపోతుందని, తాము అనుకున్న సినిమా కాకుండా మరొకటి ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకురాలు సంధ్యాసూరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి ‘సంతోష్’ చిత్రం భారతదేశంలో రిలీజ్ అవ్వడం అనేది అనుమానాస్పదమే అంటున్నారు. ఈ విషయమై దర్శకురాలు సంధ్యాసూరి మాట్లాడుతూ ‘సెన్సార్ అధికారుల నిర్ణయం మమ్మల్ని నిరాశ పరుస్తోంది. మమ్మల్ని ఎంతో బాధించింది. ఇంతకుముందు ఎన్నో సినిమాలకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మేం చూపించిన సన్నివేశాలు కూడా ఇంతకుముందు సినిమాల్లో వచ్చినవే. అయితే సెన్సార్ వారు సూచించిన కట్స్ చేసే ఉద్దేశం మాకు లేదు. అలా చేయడం వల్ల సినిమాకి చాలా నష్టం జరుగుతుంది’ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
