కంగనా రనౌత్‌కి హైకోర్టు షాక్.. ‘ఎమర్జెన్సీ’ని చుట్టుముట్టిన వివాదాలు!
on Sep 5, 2024
సినిమా రంగంలో వివాదాస్పద వ్యక్తులకు కొదవలేదు. ఏదో ఒక సందర్భంలో వివాదాల్లో తలదూర్చి ఎదుటివారి మీద ఆరోపణలు చేయడమే కాకుండా, తమని తాము కించపరుచుకునే విధంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వివాదాల్లో కొందరు నటీమణులు కూడా అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎం.పి. కంగనా రనౌత్ ముందు ఉంటుందని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కొన్ని వివాదాల్లో ఆమె ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమెకు అనేక ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి. కానీ, ఆమె ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఏకంగా వివాదాస్పద కథాంశంతో ఓ సినిమాను తీసి జనంలోకి వదలాలని నిర్ణయించుకుంది. ఆ సినిమా పేరు ‘ఎమర్జన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు.
జీ స్టూడియోతో కలిసి సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించారు కంగనా. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి అనేక విమర్శలు ఆమెను చుట్టు ముట్టాయి. వాటన్నింటినీ దాటుకొని సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి విడుదలకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఓ వర్గం కోర్టును ఆశ్రయించింది. సినిమాలో తమను తక్కువ చేసి చూపించారన్నది వారి ఆరోపణ. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌కి సూచించింది కోర్టు. అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ ‘ఎమర్జన్సీ’ చిత్రం విడుదలను ఆపెయ్యాలని సెన్సార్ బోర్డును కోరింది. వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో ద్వేషాల్ని పెంచేలా సినిమా ఉందని సెన్సార్ బోర్డ్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ పేర్కొంది. దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయించారు కంగనా.
కంగనా పిటిషన్‌ను స్వీకరించిన ముంబై హై కోర్టు కంగనాకు గట్టి షాక్ ఇచ్చింది. సినిమాపై చాలా వర్గాల నుంచి పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిగిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. అంతే కాదు, సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా కేంద్ర సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో సెప్టెంబర్ 18లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. దీనికి సంబంధించిన విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది హైకోర్టు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడడం కంగనాను ఆందోళనకు గురి చేస్తోంది. సినిమాపై వస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంది. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం సెప్టెంబర్ 19 తర్వాతే తెలుస్తుంది.
Also Read