ముగ్గురు బాలీవుడ్ స్టార్స్‌కి నోటీసులు జారీ చేసిన కోర్టు!
on Mar 9, 2025
సినిమా తారలు కమర్షియల్ యాడ్స్‌లో నటించడం అనేది ఇప్పటిది కాదు. ఎన్నో దశాబ్దాలుగా అది జరుగుతూనే ఉంది. అయితే ఈమధ్యకాలంలో కొన్ని రకాల ప్రొడక్ట్స్‌ని ప్రచారం చేసే క్రమంలో కొందరు తారలు ఇరకాటంలో పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రొడక్ట్ గురించి ప్రచారం చేస్తున్నందుకు షారూక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు జారీ చేసింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. జైపూర్‌లో ఉన్న ఈ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు, యోగేంద్ర సింగ్ అనే న్యాయవాది కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఆ ముగ్గురు స్టార్స్‌కి నోటీసులు పంపింది.
విషయం ఏమిటంటే.. షారూక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్.. ముగ్గురూ కలిసి విమల్ పాన్ మసాలా యాడ్‌లో నటించారు. అయితే అది మోసపూరిత యాడ్ అని ఆరోపించారు ఫిర్యాదు దారుడు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేయడమే కాకుండా, ఆ ప్రకటన ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ యాడ్‌లో ‘దానె దానె మే కెేసర్ కా దమ్’ క్యాప్షన్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. యోగేంద్ర ఆరోపణ ప్రకారం ఆ ప్రొడక్ట్‌లో అసలు కేసర్ అనే పదార్థం ఉండదని, దాని ధర లక్షల్లో ఉంటుందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఆ యాడ్‌లో నటించిన స్టార్స్‌కే కాకుండా దాన్ని రూపొందించిన సంస్థ అధినేత విమల్‌కుమార్‌కి కూడా నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నిందితులను ఆదేశించింది కోర్టు. అంతేకాదు, మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని సూచించింది. హాజరు కాని పక్షంలో వారు లేకుండానే విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు ఆ హీరోలు నోటీసులపై స్పందించలేదు. ఫిర్యాదు చేసిన యోగేంద్ర ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఆ యాడ్‌ను నిషేధించాలని కోర్టును కోరారు. మరి కేసుపై హీరోలు ఎలా స్పందిస్తారో, చివరికి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
