ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ సినిమాకు అందిస్తున్న సంగీతం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలోని పాటలపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తుండగా.. తాజాగా రెహమాన్ ఈ స్పందనలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వచ్చే విమర్శలు, ప్రశంసల కంటే తాను చేసే పనిలో నిజాయతీగా ఉండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పాటను రూపొందించే క్రమంలో ఎన్నో ఆలోచనలు, మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే తుది రూపం ఇస్తామని, అప్పటికే ప్రేక్షకుల స్పందనలను పరిశీలించే ఓపిక కూడా మిగలదని ఆయన వివరించారు.
‘రామాయణ’లోని ‘రావణ తాండవ్’ పాట విడుదలైనప్పుడు కూడా కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత కొందరు తమ అభిప్రాయాలను మార్చుకొని ప్రశంసలు కురిపించారని రెహమాన్ తెలిపారు. తన కుమారుడు కూడా సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలను తన దృష్టికి తీసుకొస్తుంటాడని చెప్పారు. “నిన్న విమర్శించినవారే ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారని నా కొడుకు అంటుంటాడు. నేను మాత్రం నా పని నిజాయతీగా చేశాను.. ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నది ఆయన మాటల సారాంశం. గతంలో చేసిన విజయాలనే మళ్లీ మళ్లీ పునరావృతం చేయకుండా, కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగాలని రెహమాన్ అభిప్రాయపడ్డారు.
ఇక ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటపై కూడా ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. ఈ పాటలో ఖవ్వాలీ లేదా సూఫీ సంగీత ఛాయలు ఉన్నాయని, రామాయణ నేపథ్యానికి ఈ శైలి సరిపోతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో రెహమాన్ స్పందన ఆసక్తికరంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాల సంగీత ప్రయాణంలో ఇంతటి గొప్ప ఇతిహాసానికి సంగీతం అందించడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భారతీయులు ఎంతోమందికి పరిచయమైన ఈ కథను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో భాగం కావడం తనకు ప్రత్యేకమైన అనుభూతి అని తెలిపారు.
ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రెహమాన్ వెల్లడించారు. సాధారణంగా తన సంగీతాన్ని స్వయంగా రూపొందించడానికే ఇష్టపడే ఆయన, ఈ ప్రాజెక్టులో జిమ్మర్ భాగస్వామ్యం కావడం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నారు. విదేశీ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరగడానికి ఈ కలయిక దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది.
[AR Rahman, Ramayana Songs Controversy, AR Rahman Trolling, Ramayana Mangal Rang Song, Ravana Tandav Song, Hans Zimmer, Ranbir Kapoor Ramayana, Sai Pallavi Ramayana]




