హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్న సోను సూద్ డైరెక్టోరియల్ మూవీ ‘ఫతే’ టీజర్!
on Mar 16, 2024
సోను సూద్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. కరోనాకి ముందు సోను సూద్ సినిమా ప్రేమికులకు మాత్రమే పరిచయం. కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయిపోయి, లాక్‌డౌన్‌తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజలకు అండగా నిలబడి ఎవరికీ సాధ్యంకాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు సోను. సినిమాల్లో విలన్‌గానే ఎక్కువగా నటించిన సోను నిజజీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటి వరకు విలన్‌గా, సహాయనటుడిగా పలు చిత్రాల్లో నటించిన సోను ఇప్పుడు డైరెక్టర్‌గా తన కెరీర్‌లో కొత్త టర్న్ తీసుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘ఫతే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాడు సోనుసూద్. ఈ ఒక్క టీజర్‌తోనే డైరెక్టర్‌గా తన టాలెంట్ ఏమిటో చూపించేశాడు. విజువల్స్, టేకింగ్ చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ చేసిన సినిమాలా అనిపిస్తోంది ‘ఫతే’. ఫతే అనే హిందీ పదాన్ని ఇంగ్లీష్‌లో రాసినపుడు హెచ్ అక్షరాన్ని కూడా వాడతారు. అది సైలెంట్ లెటర్. ఈ సినిమా టీజర్‌లో చూపించిన టైటిల్‌లో కూడా హెచ్ అనే లెటర్‌ని రెడ్ కలర్‌లో సెపరేట్ చేయడం వల్ల ఇంగ్లీష్‌లో ‘ఫేట్’ అనే అర్థం కూడా వస్తుంది. సోను ఇంటెలిజెన్స్ ఏమిటో అతను పెట్టిన టైటిల్‌లోనే అర్థమవుతోంది.
బ్యాక్‌డ్రాప్‌గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గానీ, యాక్షన్ ఎపిసోడ్స్‌గానీ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా సోను హ్యాండిల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాక్వలిన్ ఫెర్నాండెస్ నటిస్తోంది. ఇదే సంవత్సరం ‘ఫతే’ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్‌లోనే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, సోనాలి సూద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read