సల్మాన్ ఖాన్‌ను పంది, కుక్కతో పోల్చిన విందు ధారాసింగ్.. ఎందుకంటే!
on Mar 9, 2024
సినిమా రంగంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో వారికి నచ్చినట్టుగానే ఉంటారు. వారికి నచ్చినవి తింటారు, నచ్చిన పనులు చేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒకరు. సాధారణంగా హీరోలైనా, హీరోయిన్లయినా వారి గ్లామర్‌ని కాపాడుకునేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు యోగా చేస్తే, మరికొందరు జిమ్‌లో వర్కవుట్లు చేస్తారు. మరికొందరు తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. తమ న్యూట్రిషియన్ ఏది తినమంటే అదే తింటారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా, మరింత ఫిట్‌గా కనిపిస్తారు. కొందరు ఫుడ్ విషయంలో అస్సలు కంట్రోల్‌గా ఉండలేరు. అయితే దీనికి సల్మాన్ ఖాన్‌ను మినహాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే సల్మాన్ భోజన ప్రియుడు. ఏది కావాలంటే అది లాగించేస్తాడు.
ఫిట్నెస్ విషయంలో సల్మాన్ ఖాన్ ఏమేం చేస్తాడు, ఏం తింటాడు అనే విషయాల గురించి ఆయన స్నేహితుడు విందు ధారాసింగ్ వివరిస్తూ ‘మేమిద్దరం చిన్న తనం నుంచి కలిసి చదువుకున్నాం. ఒక దశలో నేను బాగా లావయ్యాను. నన్ను అలా చూసి వెంటనే జిమ్‌లో జాయిన్ అయిపోయాడు. రోజులో ఎక్కువ శాతం జిమ్‌లో ఉంటాడు. అంత వర్కవుట్ చేసినా ఫుడ్‌ని కంట్రోల్ చెయ్యలేడు. పందిలా తింటాడు.. కుక్కలా వర్కవుట్ చేస్తాడు. అదే సల్మాన్ పద్ధతి. అతను తినే పద్ధతి చూసిన నేను ఓ రోజు అడిగాను.. అంత తిన్నావు కదా! అదంతా ఏది అంటే.. వర్కవుట్ చేసి కరిగించేశాను అని చెబుతాడు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే మనసున్న దేవుడు సల్మాన్. అతనికి దాన గుణం ఎక్కువ. తండ్రి తనకు డబ్బులిస్తే.. వాటిని ఇంట్లో పనిచేసేవారికి పంచిపెట్టేవాడు. అది ఎంత అయినా సరే.. ఒక్కోసారి అవి లక్షల్లో ఉండేవి. ఇప్పటికీ సల్మాన్ అలానే అందరికీ సాయం చేస్తున్నాడు. నెలకు 25 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఎంత సంపాదించినా తన పాకెట్ మనీ మాత్రం తండ్రి దగ్గరే తీసుకుంటాడు’ అని స్నేహితుడి గురించి తనకు తెలిసిన కొన్ని విశేషాలను తెలియజేశాడు విందు ధారాసింగ్.
Also Read